ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? ఎన్నో ఏళ్లుగా రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నా, పడకేసినా, అటకెక్కినా ఎందుకు నోరు మెదపట్లేదు? గొంతు పెగలట్లేదా లేక మనకెందుకులే ఆ గొడవంతా అనుకొని, దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలని తమ 'పని' తాము చేసుకుపోతున్నారా? ప్రతి ఏడాదీ రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ప్రజలు ఆశించడం, షరా మామూలే అన్నట్లు వారికి ఆశాభంగం ఎదురు కావడం ఆనవాయితీగా మారింది. బడ్జెట్‌లో కనిపిస్తున్న రైల్వే లైన్ల పేర్లు ఇరవై ముప్పై ఏళ్లగా వింటున్నవే. ఎప్పటికప్పుడు కొత్తగా చెబుతున్నారు తప్ప పూర్తి చేయడం లేదు. పూర్తి చేయించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు, రాష్ట్రం నుండి కేంద్రంలో మంత్రులుగా ఉన్న పెద్ద మనుషులు గాలికొదిలేశారు.
కేంద్రంలో రాష్ట్రంలో వరుసగా రెండు తడవలుగా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులు ప్రస్తుతం 32 మంది ఉన్నారు. జైపాల్‌రెడ్డి ఆరున్నరేళ్లుగా కేంద్ర కేబినెట్‌లో మంత్రి. ఇక పనబాక లక్ష్మి, పురంధేశ్వరి, పళ్లంరాజు, సాయిప్రతాప్, సహాయ మంత్రులుగా ఉన్నారు. వీరెవరూ రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు రావాలని ప్రయత్నించిన దాఖలా లేదు.
ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అంటూ ప్రాంతీయ విభేదాలను ప్రజల్లో పెంచి పోషించే విషయంలో మాత్రం ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదం లేకుండా దాదాపు ఎంపీలందరూ ముందు వరుసలో ఉంటారు. పోటీలు పడుతున్నారు. ప్రజలకు లాభం జరిగే రైల్వే ప్రాజెక్టుల విషయం వచ్చేసరికి మొక్కుబడిగా కూడా మాట్లాడటంలేదు. కిందపడ్డా పైచేయి నాదే అన్న పద్ధతుల్లో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తమ ఒత్తిడివల్లనే కొన్ని ప్రాజెక్టులు, రైళ్లయినా వచ్చాయని నమ్మింపజూస్తున్నారు.
ఇక లగడపాటి, రాయపాటి, దగ్గుబాటి లాంటి వాళ్లు తామెంతో ధీరులమని ఫోజు పెడతారు తప్ప వారి వారి ప్రాంతాలకు ఒరగబెట్టిందేమీ లేదు. కావూరి, బొత్స, కిల్లి, ఉండవల్లి, చింతా, మోదుగుల, కోట్ల, మాగుంట, నామా వంటి 'ధీరుల'దీ అదే వరస. సీనియర్‌నని చెప్పుకునే వెంకటస్వామి (కాకా), ఆయన కుమారులు ఎప్పుడైనా పెద్దపల్లి లైన్ గురించి ఆలోచించారా? ఆలోచిస్తే ఇన్నేళ్ల వరకూ ఎందుకు పూర్తికాదు? సోనియా జపం చేసే విహెచ్ హైదరాబాద్ గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా? కేకే, మధు యాష్కి కూడా ఇందుకు మినహాయింపు కాదు కదా?
కెసిఆర్ కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లాకు, ఇప్పుడు ఎంపీగా మహబూబ్‌నగర్ జిల్లాకు ఏం చేశారు? ఏ ఎంపీ అయినా, ఏ మంత్రి అయినా స్వలాభం, రాజకీయ లబ్ధి తప్ప ప్రజల గురించి ఆలోచించే తీరిక వారికెక్కడుంది? ఇటువంటి వారు ఉన్నా ఊడినా ప్రజలకొచ్చే ఇబ్బందేమీ లేదు.
No comments:
Post a Comment