Thursday, February 10, 2011

'సూక్ష్మ' నిత్యావసరాల దందా!

- అప్పుపై సరుకులు డోర్‌ డెలివరీ
- వడ్డీ 396%
- పేద మహిళల అవసరాలపై వ్యాపారం
- నిలువు దోపిడీ
- మైక్రో చట్టం ఉల్లంఘన

సూక్ష్మ రుణ సంస్థలు నగదు రూపంలో అప్పులిచ్చే దశ నుండి నిత్యావసర సరుకుల వ్యాపారంలోకి అడుగు పెట్టాయి. నగదు రూపంలో తీసుకున్న అప్పులపై 60 శాతం వరకూ వడ్డీని వసూలు చేసిన సంస్థలు నిత్యావసర వస్తువులను సరఫరా చేసి అత్యధికంగా 396 శాతం వడ్డీని పేద మహిళల నుండి గుంజుతున్నాయి. నూటికి మూడు రూపాయల వడ్డీ అంటేనే వామ్మో అనుకుంటాం. ఇప్పుడు మైక్రో సంస్థలు ఏకంగా నూటికి 33 రూపాయల వడ్డీని మహిళల నుండి ముక్కు పండి మరీ వసూలు చేస్తున్నాయి. నగదు రూపంలో తీసుకున్న రుణాలను తిరిగి వసూలు చెల్లించడానికి ఏడాది, రెండేళ్ల గడువిస్తున్న మైక్రోలు నిత్యావసర వస్తువుల విషయానికొచ్చే సరికి నిబంధనలను సమూలంగా మార్చాయి. తాము సరఫరా చేసే వస్తువుల విలువలో సగాన్ని అడ్వాన్స్‌గా తీసుకుంటున్నాయి. నెల రోజుల్లో మిగిలిన మొత్తాన్నీ చెల్లించాలంటున్నాయి. రోజుకో తీరుగా ధరలు పెరుగుతున్న తరుణంలో నిత్యావసర సరుకులు కొనలేక పేదలు అవస్థలు పడుతున్నారు. ఇదే అదనుగా మహిళల తక్షణావసరాలపై దృష్టి సారించాయి 'సూక్ష్మ' సంస్థలు. 
 
వారి సమస్యలను తమకనుకూలంగా మార్చుకొని అప్పుపై నిత్యావసర సరుకులను ఏజెంట్లనుపయోగించి డోర్‌ డెలివరీ చేస్తున్నాయి. మైక్రో సంస్థల వేధింపులు భరించలేక బాధితుల ఆత్మహత్యల పరంపర కొనసాగిన నేపథ్యంలో సూక్ష్మ సంస్థల కార్యకలాపాల నియంత్రణకు గత ఏడాది అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. సుదీర్ఘ గడువుపై అప్పులిస్తే రుణ గ్రహీతలు చెల్లిస్తారో లేదోనన్న భయంతో స్వల్ప గడువులో తీరిపోయే రుణాలిచ్చి అత్యధిక లాభాలు గడించే ఎత్తు వేశాయి. నిత్యావసర వస్తువులను మహిళలకు అంటగడుతున్నాయి.
సగం ముందే చెల్లించాలి
హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌ ప్రాంతంలో స్పందన సంస్థ మహిళలకు నిత్యావసర సరుకులిచ్చింది. పది మంది సభ్యులతో ఏర్పాటు చేసిన మహిళా గ్రూపునకు సంస్థ ఏజెంట్లు నిత్యావసర సరుకులు అప్పుగా ఇస్తున్నారు. అదీ గ్రూపు సమిష్టి బాధ్యతపైనే. ఒక్కొక్కరికి 50 కిలోల బియ్యం, నాలుగు కిలోల నూనె(నాలుగు ప్యాకెట్లు), రెండు కిలోల కారం(రెండు ప్యాకెట్లు), ఐదు కిలోల గోధుమ పిండి(ఐదు ప్యాకెట్లు), నాలుగు కిలోల ఉప్పు (నాలుగు ప్యాకెట్లు) ఇచ్చారు. వీటికి రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ముందుగా మహిళ నుండి వెయ్యి రూపాయలు తీసుకొని సరుకులిస్తున్నారు. నెలొచ్చేసరికి మిగిలిన వెయ్యి రూపాయలు చెల్లించాలంటున్నారు. ఏ సరుకులు ఏ కంపెనీలవి ఇవ్వాలన్నది మైక్రోల ఇష్టం. వినియోగదారుల ఇష్టా ఇష్టాలకు ఆస్కారం లేదు. సంతోష్‌నగర్‌లోని ఎల్లమ్మ (పేరు మార్చాం)కు 'స్పందన' ఏజెంట్లు ఇచ్చిన సరుకులను పరిశీలిస్తే బియ్యం బస్తాపై 'రెడ్‌ రోజ్‌ కర్నూలు సోనామసూరి బియ్యం' అన్న లేబుల్‌ ఉంది. అక్కడికి దగ్గర్లోని కర్మన్‌ఘాట్‌ రైస్‌ మిల్లు నుండి ఏజెంట్లు సరఫరా చేశారు. నూనె ప్యాకెట్‌పై 'హెల్థీ హార్ట్‌ రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌' అన్న లేబుల్‌ ఉంది. దాని తయారీ కేంద్రం తిమ్మాపూర్‌ దగ్గర్లో ఉంది. ఉప్పు, గోధమ పిండి రేషన్‌ దుకాణాల్లో ఇచ్చే వాటివలే ఉన్నాయని ఎల్లమ్మ ప్రజాశక్తికి చెప్పారు. ఎవరైనా గ్రూపు సభ్యుల ఇంట్లో పెళ్లి వంటి శుభకార్యాల సమయంలో గ్రూపు సభ్యులందరి తరఫునా ఆ ఒక్క సభ్యురాలే సరుకులు తీసుకొని నెలొచ్చేసరికి డబ్బు చెల్లిస్తున్నారు. ఈ విధంగా పెళ్లిళ్ల వంటి వాటినీ 'మైక్రో' ఏజెంట్లు తమ బిజినెస్‌కు ఉపయోగ పెట్టుకుంటున్నారు. ఎల్లమ్మ గ్రూపులోని మరో సభ్యురాలు జానకి (పేరు మార్చాం) మాట్లాడుతూ 'స్పందనాయొనొచ్చి సరుకులిచ్చిన్రు, మార్కెట్ల రేట్‌ కన్న జర ఎక్కువున్నయి' అని తెలిపారు.
లోకల్‌ మేడ్‌ వస్తువులు
దగ్గర్లోని మాదన్నపేట మార్కెట్‌లో పేరెన్నికగన్న బ్రాండ్ల సరుకుల ధరలివి. బియ్యం కిలో రూ.22. ఈ లెక్కన 50 కిలోల బియ్యం 1,100 అవుతుంది. నూనె కిలో 76 చొప్పున నాలుగు కిలోలకు 304, కారం కిలో 110 లెక్కన రెండు కిలోలకు 220, గోధుమ పిండి కిలో 20 వంతున ఐదు కిలోలకు 100, ఉప్పు కిలో ఏడు రూపాయల చొప్పున నాలుగు కిలోలకు 28 అవుతుంది. 'స్పందన' ఇచ్చే ఐదు రకాల సరుకుల విలువ రూ.1,752. ఏజెంట్లు సరుకులు ఇచ్చేటప్పుడే మహిళల నుండి వెయ్యి రూపాయలు అడ్వాన్స్‌ తీసుకుంటున్నారు. నెల తర్వాత మరో వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు. రిటైల్‌ మార్కెట్‌ ధరల ప్రకారం చూసినా నెలకు మైక్రో సంస్థ రూ.752 పెట్టుబడి పెట్టి రూ.248 గుంజుతోంది. తక్కువే కదా అనుకోవచ్చు. రూ.752కి రూ.248 వడ్డీ అంటే వందకు రూ.33 అవుతుంది. బ్యాంక్‌ లెక్కల్లో ఒక రూపాయి అంటే 12 శాతం వడ్డీ, అదే 33 రూపాయలైతే 396 శాతం వడ్డీ. ఒకే చోట గ్రూపులోని పది మందికీ సరుకులిస్తే నెలకు రూ.7,520 పెట్టుబడితే లాభం రూ.2,480.
పేదల బస్తీలపైనే గురి
గ్రామాల్లో, పట్టణాల్లో నూటికి వడ్డీ ఐదు, పది రూపాయలు తీసుకున్నట్లు తెలిస్తేనే గుండెలు జారిపోతాయి. మైక్రోలు ఏకంగా వందకు నెలకు 33 రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నాయంటే.. ఊహించడానికే భయమేస్తోంది. బహిరంగ మార్కెట్‌లో మంచి బ్రాండ్ల వస్తువుల ధరలతో పోలిస్తేనే వడ్డీ ఈ విధంగా ఉంది. హౌల్‌సేల్‌లో నాసిరకం, సెకండ్‌, థర్డ్‌ క్వాలిటీ, లోకల్‌మేడ్‌ సరుకులను 'మైక్రో' ఏజెంట్లు మహిళలకు అంటగడుతున్నారు. వాటిపై లాభం ఏ స్థాయిలో ఉంటుందో సామాన్యులకు ఊహకందదు. మైక్రోల కార్యకలాపాలపై అధ్యయనం చేసిన మాలెగాం కమిటీ వడ్డీ 24 శాతం ఉండాలంది. నిత్యావసర వస్తువుల ముసుగులో అమాయక మహిళల నుండి మైక్రోలు వసూలు చేస్తున్న వడ్డీ 396 శాతంగా ఉంది. నిత్యావసరాల వ్యాపారంలోకి దిగిన మైక్రో సంస్థల్లో ఒక్క స్పదన మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి. అవి తమ కార్యకలాపాలను రాష్ట్రంలోని మారుమూలకు సైతం విస్తరించాయి. పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో మురికివాడలు, రోజువారీ పని చేసుకు బతికే పేదలు ఎక్కడుంటారో ఆ ప్రాంతాలపైనే సూక్ష్మ సంస్థలు దృష్టిసారించి మహిళలను నిలువు దోపిడీ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం వస్తువులు ఇవ్వడం నేరం. చట్టాన్ని మైక్రోలు ఉల్లంఘిస్తున్నాయని ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. కొసమెరుపు... మైక్రోల 'నిత్యావసర' కార్యకలాపాలకు రాత కోతలు, పత్రాలు ఏమీ లేవు. ఆధారాలు దొరకవు. అంతా నోటి మాటపైనే...

2 comments:

  1. ఇది దారుణం, ఘోరం
    ఇప్పటిదాకా డబ్బులిచ్చి వడ్డీ రూపం లో పేదవాళ్ళ రక్తం పీల్చుకున్న ఈ మైక్రో భూతాలు ఇప్పుడు సరుకులిచ్చి సమస్తం పీల్చుకోడానికి సిద్ధపడ్డాయన్నమాట.
    దీనిపై ప్రభుత్వం స్పందించే నాటికి ఎన్ని వందల మంది ప్రాణాలు పోతాయో???
    దేవుడా ఎటు పోతోంది ఈ దేశం?

    ReplyDelete
  2. Good case study. Thanks for sharing.

    ReplyDelete