Wednesday, February 16, 2011

కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పునకు వైఎస్సే బాధ్యుడా?

కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం ఏర్పాటు చేసిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసే విధంగా ఉందనే విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండనక్కర్లేదు. ట్రిబ్యునల్‌ తీర్పు ఇలా రావడానికి వెనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైఫల్యం ఉందనే విషయాన్ని కూడా కాదనలేం. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తమ వైఫల్యాన్ని అంగీకరించింది. మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సిఎం ప్రభుత్వ చేతగాని తనాన్ని ఒప్పుకున్నారు. ఇక్కడే తిరకాసుంది. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ట్రిబ్యునల్‌ ముందు ప్రభుత్వ వాదనలు దాదాపు ముగిశాయని, అందువల్ల వైఫల్యం ఆయన సర్కార్‌దేననే అర్థం వచ్చేటట్లు మాట్లాడుతున్నారు సిఎం.

కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పు ఈ విధంగా రావడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శిస్తుంటే, కర్నాటక ఆల్మట్టి నిర్మాణానికి తెలుగుదేశం పార్టీదే బాధ్యతంటూ వచ్చారు కాంగ్రెస్‌ నేతలు. వైఎస్‌ బతికుండగా పలుమార్లు ఎగువ రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఆయన కూడా చంద్రబాబునే తప్పుబట్టారు. కాంగ్రెస్‌, తెలుగుదేశం పరస్పర విమర్శలతోనే గందరగోళ పడుతున్న ప్రజానీకానికి ఇప్పుడు కిరణ్‌కుమార్‌ సర్కార్‌, జగన్‌ గ్రూపు వేర్వేరు పల్లవులు ఎత్తుకున్నాయి. వైఎస్‌ హయాన్ని వదిలేసి అంతకుముందు చంద్రబాబుపై, వైఎస్‌ తర్వాత అధికారంలో ఉన్న రోశయ్య, కిరణ్‌ సర్కార్లపై మండి పడుతున్నారు జగన్‌. ఇది జగన్‌ అవకాశవాదం. జలదీక్షతో సహా ఆయన నిర్వహించిన అన్ని దీక్షలు, యాత్రల్లో ఇదే వరస.

ఇక కిరణ్‌ సర్కార్‌ది మరో వింత. వైఎస్‌ కేబినెట్‌లోని 28 మంది మంత్రులను కిరణ్‌ తన కేబినెట్‌లో కొనసాగిస్తున్నారు. అంతేకాదు కిరణ్‌తో సహా మంత్రులు, కాంగ్రెస్‌ నేతలందరూ వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉండగా కీలక బాధ్యతల్లో ఉన్నవారే. అంటే వైఎస్‌ విజయాలు, వైఫల్యాలు, అవినీతికి, అక్రమాల్లో వారందరికీ బాధ్యత ఉంది. ట్రిబ్యునల్‌ తీర్పు రాష్ట్రానికి వ్యతిరేకంగా రావడానికి వైఎస్‌ ఎంత బాధ్యత వహించాలో ఇప్పటి ప్రభుత్వమూ అంతే బాధ్యత వహించాలి. పైగా రెండు ప్రభుత్వాలూ కాంగ్రెస్‌వే. సోనియాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే వైఎస్‌, రోశయ్య, కిరణ్‌ సర్కార్లు నడిచాయి.. నడుస్తున్నాయి.

ఆ విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు, జగన్‌, ఆయన మద్దతుదార్లు. జగన్‌ తమ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారు కనుక ట్రిబ్యునల్‌ తీర్పునకు వైఎస్‌ ప్రభుత్వానిదే బాధ్యతని ఎదురుదాడి చేస్తున్నారు కిరణ్‌. వైఎస్‌ను తిట్టాలో లేక కిరణ్‌ను తిట్టాలో తెలీక తికమక పడుతున్నారు చంద్రబాబు. సమయాన్ని బట్టి ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ తిడుతున్నారు ప్రధాన ప్రతిపక్ష నేత.

నేతల పంచాయతీ ఎలా ఉన్నా ప్రాంతీయ భేదం లేకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల రైతులూ, ప్రజలూ కృష్ణా ట్రిబ్యునల్‌ వల్ల నష్టపోతారు. ఇప్పటికైనా రాజకీయ స్వలాభాన్ని పక్కనపెట్టి ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం రాజకీయ పార్టీలపై ఎంతైనా ఉంది.

No comments:

Post a Comment