Wednesday, February 2, 2011

కాంగ్రెస్‌లో 'చిరు' తుఫాన్‌

కాంగ్రెస్‌ తన తలపై తానే నిప్పులు పోసుకుంటోందా? జగన్‌కు చెక్‌ పెట్టేందుకు అది చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీతో పొత్తు లేదా విలీనం ఏదైనా సరే ఈ ప్రతిపాదన ముందుకొచ్చిన ప్రతిసారీ కాంగ్రెస్‌లో దుమారం లేస్తూనే ఉంది. తాజాగా సోమవారం చిరంజీవిని కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ కలవడం, సోనియాను కలవాలని ఆహ్వానించడం కాంగ్రెస్‌లో కలకలం సృష్టించింది. చిరంజీవి ప్రస్తావన వచ్చినప్పుడల్లా పార్టీలో సుడులు తిరుగుతూ పెనుతుపాన్‌ బీభత్సం సృష్టించడం పరిపాటైంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, టిడిపికి తాను ప్రత్యామ్నాయమంటూ ప్రజల ముందుకొచ్చారు మెగాస్టార్‌. తీరా ఎన్నికల ఫలితాలొచ్చేసరికి చతికిలపడ్డారు. కేవలం 18 ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చిరంజీవి సిఎం అవుతారన్న ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లడంతో పిఆర్‌పిని నడపడం చిరుకు పను సవాలైంది.

వైఎస్‌ ఉండగానే కాంగ్రెస్‌కు పిఆర్‌పి దగ్గరైంది. వైఎస్‌ మరణించాక జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పిఆర్‌పితో పొత్తు పెట్టుకోడానికి ప్రయత్నించగా జగన్‌ గ్రూపు తీవ్రంగా అడ్డు తగిలింది. చివరి నిమిషంలో పిఆర్‌పి సొంతంగా పోటీ చేయాల్సి వచ్చింది. జగన్‌ ధిక్కారస్వరం పెరిగిన కొద్దీ చిరంజీవి కాంగ్రెస్‌కు దగ్గరవుతూ వచ్చారు. కాంగ్రెస్‌ సంక్షోభంలో పడితే ప్రభుత్వం పడకుండా మద్దతిస్తామని తరచూ చిరు హామీ ఇస్తూ వచ్చారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో చిరంజీవి ఢిల్లీ వెళ్లి సోనియాను కలిశారు. అప్పుడే మంత్రివర్గంలో పిఆర్‌పి చేరుతుందన్న వార్తలొచ్చినా ఎందుకో అది జరగలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి సిఎం అయ్యాక మళ్లీ పిఆర్‌పి కేబినెట్‌లో చేరుతుందంటూ ప్రచారం జరిగినా నిజం కాలేదు.

జగన్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడిన తర్వాత పరిస్థితిలో మార్పొచ్చింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కొందరు ఆయనకు బహిరంగంగా మద్దతిస్తుండటం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. ఆ ఎమ్మెల్యేలపై చర్య తీసుకుంటే ప్రభుత్వం పడిపోతుంది. అందుకే ఆ నష్టాన్ని భర్తీ చేసుకోడానికి, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోడానికి కాంగ్రెస్‌ హైకమాండ్‌ పావులు కదుపుతోంది. అందులో భాగమే ఆంటోనీ, చిరంజీవి భేటీ. కేంద్రంలో పెద్ద పదవి చిరంజీవికి ఇస్తారని, రాజ్యసభ సీటు కట్టబెడతారని, రాష్ట్ర కేబినెట్‌లో నాలుగు బెర్తులివ్వడానికి కాంగ్రెస్‌ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. చిరంజీవి రాష్ట్ర కేబినెట్‌లో చేరే పక్షంలో ఉప ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నారంటున్నారు. తెలంగాణా ఆందోళనల నేపథ్యంలో ది సాధ్యం కాకపోవచ్చు. అల్లు అరవింద్‌ లేదా మరొకరికి రాజ్యసభ సీటు ఇవ్వొచ్చంటున్నారు.

కాంగ్రెస్‌లో పిఆర్‌పి విలీనం అవుతుందా లేక మద్దతు ఇస్తుందా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. విలీనమేనని కాంగ్రెస్‌ నేతలంటుంటే కాదు మద్దతు మాత్రమేనని పిఆర్‌పి నేతలంటున్నారు. పిఆర్‌పితో స్నేహాన్ని సీనియర్‌ నాయకుడు వెంకటస్వామి (కాకా) తీవ్రంగా వ్యతిరేకించారు. సోనియాపై నిప్పులు చెరిగారు. ఆమె పార్టీ అధ్యక్షురాలుగా ఉండటానికి అనర్హురాలని విమర్శించారు. ఆయన జగన్‌ శిబిరంలో చేరతారని లేదా టిఆర్‌ఎస్‌లో చేరతారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాష్ట్రపతి పదవి ఆశించి భంగపడిన కాకా గవర్నర్‌ కావాలనుకున్నారట. గవర్నర్‌ కాదు కదా ఈసారి సిడబ్ల్యుసిలోకి సైతం తీసుకోరని తేలిపోవడంతో కాకా రెచ్చిపోయారంటున్నారు.

చిరంజీవి రాకను పార్టీలోని తెలంగాణా నేతలు వ్యతిరేకిస్తున్నారు. చిరు రాకతో ఆయన సామాజిక తరగతికి చెందిన మంత్రులు బొత్స, కన్నా, వట్టి తదితరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో మంత్రి పదవులు ఆశిస్తున్న వారు చిరు పార్టీకి మంత్రి పదవులు కట్టబెడితే వారిలో మంరింతగా అసంతృప్తి పెరగడం ఖాయం. జగన్‌ను బచ్చాగాడితో పోల్చిన కాంగ్రెస్‌ నేతలు చిరుతో స్నేహానికి తహ తహలాడుతున్నారంటే జగన్‌ స్టామినా ఏమిటో గుర్తించినట్లు అర్థమవుతుంది. మొత్తంగా చిరంజీవితో స్నేహం కాంగ్రెస్‌ తనకు తానుగా చిచ్చు పెట్టుకోవడంగా రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

No comments:

Post a Comment