Friday, February 25, 2011

జగన్‌ స్వరం మారుతూ..వుంది

వైఎస్‌ జగన్‌ స్వరం మారుతోంది. కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్టానం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిన కొన్ని రోజులకే అంటే గత ఏడాది నవంబర్‌ 25న కిరణ్‌ ప్రమాణస్వీకారం చేయగా 29న జగన్‌ పార్టీ నుండి బయటికొచ్చారు. ఆ తర్వాత ప్రతి మీటింగ్‌లోనూ తన తండ్రి కష్టపడి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టబోనని, 2014 ఎన్నికలు తన టార్గెట్‌ అని చెబుతూ వచ్చారు. అంతలోనే లక్ష్యదీక్ష, జలదీక్ష, ఫీజు పోరు, మధ్యలో జరిగిన ఓదార్పు యాత్రల్లో స్వరం మారుస్తూ వస్తున్నారు. ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని తొలుత విమర్శించారు. పేదలను, ప్రజలను, వైఎస్‌ పథకాలను అమలు చేయని ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. ఫీజుపోరు దీక్ష ప్రారంభించిన తొలి రోజు జగన్‌ ప్రసంగిస్తూ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపితే అపచారం చేసినట్లవుతుంది, గంగా, కృష్ణా, గోదావరి లాంటి పుణ్యనదులు బంగాళాఖాతంలో కలుస్తున్నాయని, ప్రభుత్వాన్ని కలిపితే నదులు అపవిత్రం అవుతాయని 'దాడి'ని తీవ్రతరం చేశారు. అదే సభలో కొంచెం ముందుకెళ్లి ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం తమకు లేదన్నారు.

గురువారం ఫీజుపోరు చివరి రోజు దీక్ష విరమించాక జగన్‌ ఆవేశంగా ప్రసంగించారు. పేదలకు, విద్యార్థులకు అన్యాయం చేస్తున్న 'ఈ ప్రభుత్వాన్ని ఇంకా కొనసాగిస్తే ఆ దేముడు మమ్మల్ని క్షమించడు. మేం తప్పు చేసినవాళ్లమవుతాం' అని హెచ్చరించారు. అంతేకాదు విద్యార్థుల ఆగ్రహాగ్నికి, తల్లిదంద్రుల కన్నీళ్లకు ప్రభుత్వం కొట్టుకుపోతుందని గొంతెత్తారు.

తన తండ్రి తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని పడగొట్టనని మాటిచ్చిన జగన్‌ అంతలోనే ఆ ప్రభుత్వాన్ని తిట్టడమంటే తండ్రిని తిట్టడమే కదా అని కాంగ్రెస్‌లో జగన్‌ను వ్యతిరేకించేవాళ్లంటున్నారు. ఆ విషయాన్ని పక్కనబెడితే జగన్‌ రోజు రోజుకూ స్వరం ఎందుకు పెంచుతున్నారు? ప్రభుత్వాన్ని పడగొట్టబోమన్న ఆయనే ప్రభుత్వాన్ని పడగొడతామని అర్ధం వచ్చే విధంగా ఎందుకు హెచ్చరికలు చేస్తున్నారు? ఇప్పటి వరకూ జగన్‌కు బహిరంగంగా మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య తగ్గుతూ పెరుగుతూ ఉంది. ఎంతగా కూడికలు తీసివేతలు చేసినా 20-30 మధ్యనే ఎమ్మెల్యేల సంఖ్య ఊగిసలాడుతోంది. బాగా స్పష్టంగా చెప్పాలంటే 20-25 మంది బయటికి కనబడుతున్నారు. అంబటి రాంబాబు లాంటి వాళ్లు మాత్రం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో సగానికి కంటే ఎక్కువ మంది జగన్‌ వైపునే ఉన్నారని, సమయం వచ్చినప్పుడు సత్తా చూపుతారంటున్నారు.

ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే చర్యలను జగన్‌ గ్రూపు ఎమ్మెల్యేలు అనుసరిస్తున్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ వైఖరిని నిరశిస్తూ శాసనసభలో రెండు మూడు సార్లు ప్లకార్డులు ప్రదర్శించారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో సభ నుండి బయటికెళ్లిపోయారు. జగన్‌ దీక్ష చేస్తున్న శిబిరం వద్ద నుండి అసెంబ్లీ వరకూ పాదయాత్ర చేశారు. ఇవన్నీ ప్రభుత్వానికి ఒక విధంగా ఇబ్బందికరమే. ఇక జగన్‌ పార్టీని ప్రకటించే వరకూ ఎమ్మెల్యేల సంఖ్యలో దోబూచులాట ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కొంతకాలం ఎమ్మెల్యేలు జగన్‌ పక్కన బహిరంగంగా ఉండటానికి ముఖం చాటేస్తారంటున్నారు. ముఖం చాటేస్తారో లేక జగన్‌కు రాంరాం చెప్పి కాంగ్రెస్‌లో ఉంటారో కాలం సమాధానం చెబుతుంది.

No comments:

Post a Comment