Saturday, February 12, 2011

కెసిఆర్‌ 'అవిశ్వాసం'... ఇదో డ్రామానా?

మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో అవిశ్వాస తీర్మానం అంశం తెరమీదికొచ్చింది. జగన్‌ వెంట కొంత మంది ఎమ్మెల్యేలు నడుస్తుండటంతో కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని 'అవిశ్వాస' భయం వెంటాడుతోంది. అందుకే కాంగ్రెస్‌ నేతలు ఎంఐఎం, పిఆర్‌పితో అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. పిఆర్‌పినైతే విలీనం చేసుకున్నారు. ఇప్పుడు టిఆర్‌ఎస్‌ కూడా కాంగ్రెస్‌లో కలుస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను టిడిపి నేతలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ భవన్‌, గాంధీ భవన్‌కు బ్రాంచి కార్యాలయంగా మారిందని దేవేందర్‌గౌడ్‌ వంటి సీనియర్‌ నేతలు దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తామంటూ కేకే నివాసంలో ఇటీవల కెసిఆర్‌ చేసిన ప్రకటనను సాక్ష్యంగా చూపిస్తున్నారు.

కెసిఆర్‌ తక్కువ తిన్నారా? కొంత కాలంగా తెలుగుదేశమన్నా, చంద్రబాబన్నా ఒంటికాలిపై లేస్తున్న టిఆర్‌ఎస్‌ అధినేత ఏకంగా 'అవిశ్వాసం' అస్త్రాన్ని బయటికి తీశారు. తాము అసెంబ్లీలో ప్రభుత్వంపై 'అవిశ్వాసం' ప్రవేశపెడతామని, టిఆర్‌ఎస్‌ మద్దతు ఇవ్వకపోతే ఎవరు ఎవరికి బ్రాంచి ఆఫీస్‌గా మారతారో తేలుతుందని సవాల్‌ విసిరారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఆయన్ని 'అవిశ్వాసం' భయం వెంటాడుతోంది. రైతుల సమస్యలపై చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష చేసినప్పుడు టిడిపి 'అవిశ్వాసం' పెడతామని హెచ్చరించింది. ఆ తర్వాత జగన్‌ వంతు వచ్చింది. జగన్‌ పార్టీని వీడిన తర్వాత ఆయన వెంట కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కొందరు నడుస్తున్నారు. వైఎస్‌ కష్టపడి తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని తమకు తాముగా పడగొట్టబోమని అంటున్నప్పటికీ ప్రభుత్వం పడిపోవాలని జగన్‌, ఆయన మద్దతుదార్లు ప్రతి బహిరంగసభలోనూ శాపనార్ధాలు పెడుతున్నారు.

దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలని మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి జగన్‌ను సవాల్‌ చేస్తుంటే, మీరే సభలో 'విశ్వాసం' నిరూపించుకోవాలని జగన్‌ గ్రూపు నేతలు ప్రతి సవాల్‌ చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టట్లేదంటూ నిలదీస్తున్నారు. తాము ప్రజా సమస్యలపై అవసరమైతే అవిశ్వాస తీర్మానం పెడతామని, ఎవరో అడిగితే పెట్టబోమంటున్నారు చంద్రబాబు. ఇప్పుడు తాజాగా కెసిఆర్‌ ముందుకొచ్చి తామే అవిశ్వాస తీర్మానం పెడతామని, అధికారపార్టీ ఎలాగూ మద్దతు ఇవ్వదు కనుక తమకు మద్దతు ఇవ్వాలని టిడిపిని డిమాండ్‌ చేశారు. టిడిపిని 'ఫిక్స్‌' చేయడానికి పావులు కదుపుతున్నారు.

ఎవరికివారు అవిశ్వాస తీర్మానం అంటున్నా శాసనసభలో అందుకు ప్రొసీజర్‌ ఉంది. అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే అయినా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టొచ్చు. అయితే దానిపై చర్చ, ఓటింగ్‌ జరగాలంటే సభలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్యలో పదిశాతం మంది సభ్యులు తీర్మానానికి మద్దతు ఇవ్వాలి. దీని ప్రకారం 294 మంది ఎమ్మెల్యేలున్న సభలో 30 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వాలి. ప్రస్తుతం టిఆర్‌ఎస్‌కు 11 మంది ఎమ్మెల్యేలున్నారు. కాబట్టి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా చర్చ, ఓటింగ్‌ జరగదు. స్పీకర్‌ ఆ తీర్మానాన్ని తిరస్కరిస్తారు. టిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ కానీ, టిడిపి కానీ మద్దతిచ్చే అవకాశమే లేదు. జగన్‌కు మద్దతు తెలిపే ఎమ్మెల్యేలు తమకు తాముగా అవిశ్వాస తీర్మానం ఇప్పుడప్పుడే పెట్టరు. టిఆర్‌ఎస్‌కు టిడిపి మద్దతిచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ తీర్మానం పెట్టినా ప్రభుత్వాన్ని ఆదుకోడానికి పిఆర్‌పి సిద్ధంగా ఉంది. కనుక అవిశ్వాస తీర్మానంపై నేతల లొల్లి తప్ప మరేం లేదు.

3 comments:

  1. అవిశ్వాసం పెడతామంటున్నా, అది జగన్ క్యాంపును లేపడానికే. తెరాస కోసం కాకపోయినా ప్రధాన ప్రత్యర్థిగా తెదెపా ఎలాగూ సపోర్ట్ చేస్తుంది. అందరినీ లేపి తాము కాంగ్రెస్ కొంగుచాటున తెరాస దాక్కున్నా ఆశ్చర్యం లేదు. ప్రరాపా కన్నా హీనమైన దివాళాకోరు పార్టీ కాకున్నా తేడా అంత ఎక్కువేం కాదు. ఆఖరున తెరాస వాళ్ళే అవిశ్వాసం వెనక్కితీసుకుని మనకు వినోదం పంచుతారు. ప్రరాప అంతలా కాకున్నా, తెరాస కాంగ్రెస్ ఏజంట్ పార్టీ అన్నది తెలుస్తూనేవుంది.

    ReplyDelete
  2. ఈజిప్టులో ఒక్కడే హోస్నీ ముబారక్ ....!
    కానీ ఆంధ్రా లో ఎవడిని చూసినా హోస్నీ ముబారక్ తాతల్లా వున్నారు.
    నీరోల్లా ఫిడేల్ వాహించే వాళ్ళే ఎక్కువ గా కనిపిస్తున్నారు.
    హా ప్రజా స్వామ్యమా.
    అయ్యయ్యో తెలంగాణమా..!
    ఈ రాక్షస అన్యాయానికి అంతమెప్పుడో.!

    ReplyDelete
  3. ముక్కోడు, ముబారక్ ఒకటే కారని తెలంగాణా విరోచన వాదులు గ్రహించాల్సిన చారిత్రక అవసరముంది. ముబారక్ డిక్టేటరే కాని దగుల్భాజీ కాదు.

    FAQ: పైన టైపో నా? విమోచన బదులు విరోచన అని పడిందా?.
    Ans: అయ్యుండొచ్చు, కాని ఈ సంధర్భంలో పెద్ద తేడా లేదులేండి. :)

    ReplyDelete