ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌కు కావల్సినన్ని నిధులు ఇవ్వాల్సింది పోయి హైదరాబాద్ శివార్లలో ఆత్మహత్య చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థిని వరలక్ష్మి మరణాన్ని రాజకీయం చేయడం దుర్మార్గం. వరలక్ష్మి చదువుతున్న విజ్ఞాన్ కాలేజీ యాజమాన్యం పెట్టిన వత్తిళ్ల వల్లనే ఎస్సీ అయిన వరలక్ష్మి వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రస్తుతం రవాణాశాఖ బాధ్యతలు చూస్తున్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీలో రవాణ శాఖ మంత్రిని ఎందుకు నియమించారో తెలీదు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రో, ఉన్నత విద్యశాఖ మంత్రో, ఆర్థిక మంత్రో, ముఖ్యమంత్రో వరలక్ష్మి హత్యపై స్పందిస్తే ఏదోలే అనుకోవచ్చు. పిలవని పేరంటానికి వచ్చినట్లు రవాణ శాఖ మంత్రి బొత్స వరలక్ష్మిది ఆత్మహత్యకాదు, గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంలో చనిపోయిందని అవాకులు చవాకులు పేలారు.
విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు, జగన్, కొన్ని రాజకీయపార్టీలు వరలక్ష్మిది ఆత్మహత్యేనని తేల్చేసరికి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. హౌం మంత్రి సబితారెడ్డిని వరలక్ష్మి కుటుంబ సభ్యులు నిలదీసిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి సిఐడి దర్యాప్తునకు ఆదేశించింది. వరలక్ష్మిది ఆత్మహత్యేనని మేజిస్ట్రేట్ రిపోర్టు ఉందని చెప్పిన బొత్స మాట మార్చి తమకు నివేదిక ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.
జగన్ హైదరాబాద్‌లో 'ఫీజు పోరు' దీక్ష ప్రారంభించిన రోజున హౌం మంత్రి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. వరలక్ష్మిది ఆత్మహత్యేనని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మరో పల్లవి అందుకుంది. వరలక్ష్మిది ఆత్మహత్యేనని ఒప్పుకుంటూనే, ఆసలు ఆమె ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు పెట్టుకోలేదని కేసును తప్పుదారి పట్టిస్తోంది. ఇది మరింత హేయమైన విషయం.
ఇప్పటికైనా వరలక్ష్మి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వరలక్ష్మిలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. వేధింపులకు గురి చేసిన విజ్ఞాన్ విద్యా సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలి. తప్పుడు రిపోర్టును వల్లించిన మంత్రి బొత్స సత్యనారాయణ విద్యార్థి లోకానికి, వరలక్ష్మి కుటుంబ సభ్యులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఆత్మహత్యను ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించిన బొత్సపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలి. మంత్రి పదవి నుండి తప్పించాలి. బాధ్యత మరిచిన మంత్రి బీసీ కార్డుతో తాను ఏది చెప్పినా చెల్లుతుందనుకుంటే బీసీలే తిరగబడతారని గ్రహించాలి.
No comments:
Post a Comment