Saturday, February 5, 2011

తెలంగాణాలో మరో కొత్తపార్టీ?

తెలంగాణాలో మరో కొత్త పార్టీ రూపు దిద్దుకోబోతోందా? టిడిపి, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌లోని అసంతృప్తి నేతలు కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారా?...కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వెంకటస్వామి (కాకా) నేరుగా సోనియాగాంధీపై ఆరోపణలు చేయడం, టిడిపి అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేత నాగం జనార్ధనరెడ్డి ధిక్కారస్వరం వినిపించడం, టిఆర్‌ఎస్‌లో కెసిఆర్‌ వైఖరి నచ్చని నేతలతో ఆయన మేనల్లుడు హరీష్‌రావు మంతనాలు జరపడం... ఒకటి తర్వాత ఒకటి జరిగిపోయాయి. ఇవన్నీ వేర్వేరుగా ఆయా పార్టీల్లో జరిగిన సంఘటనలైనప్పటికీ వీటికి ఒకే రకమైన పోలిక ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ సంఘటనల నేపథ్యంలో ఆయా పార్టీల అధినేతలు ధిక్కారస్వరం వినిపించిన నేతలతో చర్చలు జరిపి అంతా బాగుందని, మనస్పర్ధలు సద్దుమణిగాయని పైకి కలర్‌ ఇచ్చారు. 


ఇప్పటికి నాగం కాని, హరీష్‌ కాని, కాకా కాని వారి వారి పార్టీల్లో కొనసాగవచ్చు. అయితే ఆ నేతల ఎజెండా వేరే ఉందంటున్నారు రాజకీయ వేత్తలు. ఈ సంఘటనలపై నిఘా సంస్థలు సైతం దృష్టి సారించాయని సమాచారం. రాష్ట్రపతి, గవర్నర్‌ పదవులను ఆశించిన కాకాకు కాంగ్రెస్‌ అధిష్టానం చెయ్యిచ్చింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కాకా కుమారుడు వివేక్‌ పదవిని ఆశించి భంగపడ్డారు. తెలంగాణాపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఏదోకటి తేల్చకపోతే వచ్చే ఎన్నికల్లో మనుగడ కష్టమనుకొనే నేతలు కాంగ్రెస్‌లో ఇంకా చాలా మంది ఉన్నారు. వీరందరూ కాకా నాయకత్వంలో నడుస్తారని, కాకా చేసిన వ్యాఖ్యలు ముందుచూపుతో చేసినవేనని భోగట్టా.

ఇక కెసిఆర్‌ వ్యవహారశైలిని టిఆర్‌ఎస్‌లో హరీష్‌తో పాటు మరికొందరు జీర్ణించుకోలేక పోతున్నట్లు వార్తలొస్తున్నాయి. కెటిఆర్‌ రాజకీయాల్లోకి వచ్చాక హరీష్‌కు, కెసిఆర్‌ మధ్య దూరం పెరిగిందని టిఆర్‌ఎస్‌ శ్రేణులే అంటున్నాయి. ఇక టిడిపిలో నాగం, కడియం, హరీశ్వర్‌రెడ్డి తదితరులు చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్నారు.

మూడు పార్టీల్లోని అసంతృప్త నేతలూ కలిసి త్వరలో ఒక పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని, అది తెలంగాణాకు పరిమితమని గుస గుసలు వినపడుతున్నాయి. నిఘా వర్గాలకు కూడా కొత్తపార్టీ ఆవిర్భావంపై ఉప్పందినట్లు ప్రచారం జరుగుతోంది.

1 comment:

  1. Baseless assumptions and ruthless rumors. If there is truth in this rumor... then T-State bill will be very easy.

    ReplyDelete