Friday, February 11, 2011

విలీనం..జగన్‌ నెత్తిన పాలు

తమను గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలని పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను కోరారు మెగాస్టార్‌ చిరంజీవి. 'ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం' అన్నట్లు ఇంకా విలీనం కాకముందే తమ తమ ఎమ్మెల్యేలను అధికారపార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రాధేయపడ్డారు చిరు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారో, అధికారుల నుండి వారికి ఎటువంటి 'ట్రీట్‌మెంట్‌' ఉంటుందో దాన్ని తమకూ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అధికారికంగా విలీనం కావడానికి ఇంకా నెల రోజులు పడుతుందని చెబుతున్న చిరునే అప్పుడే తమకు అధికారపార్టీ హౌదా కావాలని, జిల్లా అధికారులకు ఆ విధంగా ఆదేశాలివ్వాలని సిఎంను అడుగారు.

ప్రజలకు ఉత్తమ సేవలందించడం కోసమే కాంగ్రెస్‌తో కలిశామని, పదవులు అప్రస్తుతమని చెప్పిన చిరంజీవి అంతలోనే తమకు అధికారపార్టీ ఎమ్మెల్యేలకిచ్చే సదుపాయాలన్నీ కావాలని అభ్యర్ధించారంటే ఎందుకోసం పిఆర్‌పిని విలీనం చేశారో తెలుసుకోవచ్చు. 'అన్నం ఉడికిందో లేదో తెలుసుకోడానికి ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలు'...విలీనం వెనుక ఉన్న మతలబు ఈ ఒక్క సంఘటనతో అర్థమవుతుంది.

తమను గుండెల్లో పెట్టుకోవాలని చిరంజీవి అడగటం, డిఎస్‌ అందుకు ఒప్పుకోవడం, పరస్పరం స్వీట్లు తినిపించుకోవడం వరకూ బాగానే ఉంది. కిందిస్థాయిలో రెండు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు కలిసి ఉంటారా అన్నది ప్రశ్న. పిఆర్‌పి విలీనం వల్ల కాంగ్రెస్‌ నేతలు రుసరుసలాడుతున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో పిఆర్‌పి వారికి కూడా ఈ సమస్య ఎదురయ్యే అకాశాలు మెండుగా ఉన్నాయి. పిఆర్‌పికి చెందిన 18 మంది (ఇద్దరు ఓకే చెప్పలేదు) ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో కలిస్తే ఇబ్బందేముంది అనుకోవచ్చు.

ఉదాహరణకు కృష్ణా జిల్లాను తీసుకుందాం. విజయవాడలో ఇద్దరు ఎమ్మెల్యేలు పిఆర్‌పికి ఉన్నారు. ఆ ఇద్దరికీ ఎన్నికల్లో సమీప ప్రత్యర్ధులు కాంగ్రెస్‌ వారే. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఓడిపోయిన దేవినేని నెహ్రూ రాజకీయంగా సీనియర్‌, అక్కడి పిఆర్‌పి ఎమ్మెల్యే యలమంచిలి రవి కాంగ్రెస్‌లోకి మారిపోతే నెహ్రూ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకం. ఆయనకు కాంగ్రస్‌లో ప్రాధాన్యత తగ్గిపోతుంది. అందుకే నెహ్రూ జగన్‌ వైపు చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక వేళ నెహ్రూకు కాంగ్రెస్‌ ప్రాధాన్యమిస్తే రవి ఏ టిడిపినో, జగన్‌నో చూసుకోవాల్సి ఉంటుంది.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పిఆర్‌పికి చెందిన వై శ్రీనివాస్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ కూడా ఇదే ప్రోబ్లం. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సమీప ప్రత్యర్ధి వంగవీటి రాధా సైతం పిఆర్‌పిలోనే ఉంటారో లేక వేరే పార్టీలో చేరతారో అర్థం కాకుండా ఉంది. ఇప్పటికే ఆయన జగన్‌ పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఇంద్రకరణ్‌రెడ్డిని పిఆర్‌పి అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి ఓడించారు. ఇంద్రకరణ్‌రెడ్డికి ప్రాధాన్యత ఇస్తే మహేశ్వర్‌రెడ్డి వేరే గూటికి చేరతారు.

కృష్ణా జిల్లాలోనే బందరులో పోటీ చేసి ఓడిపోయిన పిఆర్‌పి నేత బూరగడ్డ వేదవ్యాస్‌ సంగతేంటో తెలీదు. అక్కడి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పేర్ని నాని ఇటీవల జగన్‌ వెంట కనిపించారు. పాలకొల్లులో చిరంజీవిని ఓడించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉషారాణి పరిస్థితేంటి? ఇలా పిఆర్‌పి గెలుపొందిన 18 చోట్లా సమస్యలున్నాయి. ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జిలు ప్రస్తుతం షాడో ఎమ్మెల్యేలుగా వెలిగిపోతున్నారు. విలీనం తర్వాత వారి అధికారాలకు కత్తెర పడటం ఖాయం.

ఇక కాంగ్రెస్‌ గెలిచినప్పటికీ రెండు మూడు స్థానాల్లో పిఆర్‌పి ఉన్న నియోజకవర్గాలు వందకు పైగా ఉన్నాయి. అక్కడి పిఆర్‌పి నేతల భవిష్యత్తు అగమ్యగోచరం. రెండు పార్టీలకు చెందిన వారిలో ఎవరికి అసంతృప్తి కలిగితే వారు జగన్‌ బాట పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎమ్మెల్యేల కోసం విలీనం చేసుకున్న కాంగ్రెస్‌, పదవులు, తాయిలాలు ఆశించి విలీనమైన పిఆర్‌పిల్లోని శ్రేణులకు కింది స్థాయిలో గుండెల్లో పెట్టుకొని కాపాడుకొనే సహనం, ఉదారవాదం లేవు. విలీనం వల్ల ఇప్పటికిప్పుడు పైస్థాయిలో లాభం కలిగినా సుదీర్ఘకాలంలో జగన్‌ నెత్తిన పాలు పోసినట్లే అవుతుంది.

No comments:

Post a Comment