Tuesday, February 8, 2011

జగన్‌కు మంత్రి డిఎల్‌ క్విజ్‌...గెలిస్తే సిఎం పీఠం!

వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు సాధనకు సోమవారం నుండి హరిత యాత్ర ప్రారంభించారు. సహజంగా పోలవరం అనగానే గుర్తుచ్చేది వైఎస్సార్‌ పేరు. ఎందుకంటే అప్పట్లో పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రచ్చ అయింది. ఇప్పటికీ ఆ వివాదం కొనసాగుతోంది. పోలవరాన్ని ప్రతిపాదిత ఎత్తులో నిర్మిస్తే గిరిజన గ్రామాలు ముంపునకు గురవుతాయి. అది వేరే సంగతి. ఇప్పటి విషయానికొద్దాం. జగన్‌ ఏ యాత్ర ప్రారంభించినా కాంగ్రెస్‌లో తొలుత స్పందించేది కడప జిల్లాకు చెందిన మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి. జగన్‌, ఆయన మద్దతుదార్లపై నిప్పులు చెరగడానికి, కౌంటర్లు ఇవ్వడానికే ఆయన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారనిపిస్తుంటుంది. హరిత యాత్ర ప్రారంభమైన రోజున ప్రభుత్వం తరఫున డిఎల్‌ రవీంద్రారెడ్డి విచిత్రంగా స్పందించారు. జగన్‌కు క్విజ్‌ పోటీ పెట్టారు. తన ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చేస్తామని సవాల్‌ కూడా చేశారు.

టీవీ యాంకర్లు ప్రభాకర్‌, సాయికుమార్‌, సుమ తదితరుల వలే మీడియా ముందు మంత్రి తన ఫెర్మార్మెన్స్‌ చూపారు. అసలు పోలవరం ఏ నదిపైన నిర్మిస్తున్నారో జగన్‌కు తెలుసా? మొదటి పునాదిరాయి ఎవరు ఎప్పుడు వేశారో ఎరుకేనా? ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఎంత? ఎన్ని అనుమతులు కావాలి?... అంటూ ప్రశ్నలు సంధించారు. హరిత యాత్ర చేపట్టిన జగన్‌ తన ఈ ప్రశ్నలకు కరెక్టుగా సమాధానం చెప్పాలన్నారు. సరైన జవాబులిస్తే ముఖ్యమంత్రి పీఠం ఇస్తానని వాగ్దానం చేశారు. 

 జగన్‌ గ్రూపు నేత అంబటి రాంబాబు ఊరుకుంటారా? ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పెద్ద పరీక్షే పెట్టారు. వందేమాతరం లేదా జనగణమనలను తప్పుల్లేకుండా ముఖ్యమంత్రి చదివితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ చేశారు.

ఈ ప్రశ్నలకే సిఎం పదవి దక్కేట్లయితే కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌ కోసం నిరుద్యోగులు రోజుల తరబడి ప్రిపేర్‌ అవ్వాల్సిన పని లేదు. ఒక వేళ ఉద్యోగం వచ్చినా వెనకేసుకొనేది తక్కువే. ఎం చక్కా ఒక్కసారి సిఎం అయిపోతే నెల రోజులు పదవిలో ఉన్నా చాలు పది తరాలకు సరిపడ ఎడా పెడా రెండు చేతుల్తో సంపాదించేయవచ్చు.

No comments:

Post a Comment