Wednesday, December 15, 2010

ఇప్పటి దాకా ఎంపీలు చేసింది మౌనదీక్ష కాదా?!

విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ పార్లమెంట్‌లో శీతాకాల సమావేశాల చివరి రోజున మౌనదీక్ష చేపట్టారంటూ మీడియాలో అమితంగా ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దాదాపు ఆరున్నరేళ్లుగా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు ఇంతకాలం చేసింది మౌనవ్రతమేకదా? కేంద్ర మంత్రులుగా ఉన్న ఎంపీలు సైతం అదే చేశారు. పొరుగు రాష్ట్రాలు ఇబ్బడిముబ్బడిగా నిధులు, రైల్వేలైన్లు, ఇతరత్రా పథకాలను, ప్యాకేజీలను తన్నుకుపోతుంటే మన ఎంపీలు, కేంద్ర మంత్రులు చోద్యం చూస్తున్నారు. మరీ సంవత్సరకాలంగా అయితే రాష్ట్రంలోనే సీమాంధ్ర, తెలంగాణా అంటూ విడిపోయి పైకి దుమ్మెత్తి పోసుకుంటున్నారు. లోపల తమ స్వప్రయోజనాలు, లబ్ది చూసుకుంటున్నారు. ఎక్కడ తమ ప్రాంతంలో ఓట్లు పోతాయోనని తప్ప ఎంపీలు చేస్తున్న ప్రాంతీయ 'ఉద్యమాల్లో' ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడుతున్నట్లు పైకి ఫోజు పెడుతున్నారు. కాంగ్రెస్‌ వేదికలమీద తామంతా ఒకటేనని, సోనియా నాయకత్వమని బృందగానం ఆలపిస్తున్నారు. వీళ్లని ఎవరు నమ్ముతారు?

కనీసం కేంద్రం నుండి ప్రకృతి వైపరీత్యాల నిధులు తీసుకురావడంలోనూ కాంగ్రెస్‌ ఎంపీలను నిర్లక్ష్యమే ఆవహించింది. ఈ ఆరేళ్లలో సంభవించిన విపత్తులకు 45 వేల కోట్లు సాయం చేయాలని రాష్ట్రం కేంద్రాన్ని అడిగితే ఇచ్చింది 1,900 కోట్లు. నిరుడు వరద ప్రాంతాల పర్యటనకొచ్చిన ప్రధాని తక్షణ సాయం కింద వెయ్యికోట్లు ప్రకటిస్తే వచ్చింది 600 కోట్లు. మన ఎంపీలు గొంతెత్తితే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉండేదా? రైల్వేలైన్లు, ఇతర పథకాలు ఇంత అధోగత స్థితిలో ఉండేవా? సంవత్సరాలపాటు పార్లమెంట్‌లో గొంతు పెగలని ఎంపీలుగా విమర్శలు మూటగట్టుకుంటుంటే, లగడపాటి పార్లమెంట్‌ సమావేశాల చివరిరోజు కొత్తగా మౌనవ్రతం దాల్చడం, ఆయన్ని కేంద్ర మంత్రి బన్సల్‌ సముదాయించడం, దానికి మీడియా 'స్పాన్సర్‌' ప్రచారం చేయడం ప్రజలను వంచించడానికే. లగడపాటి సమైక్యరాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌ గురించి ఇతరత్రా తన రాజకీయ ప్రచారం కోసం వెచ్చించే సమయంలో కొంత సమయాన్నయినా విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తే ప్రజలు బాగుపడతారు.

ఎన్నికలప్పుడు, పార్టీ మీటింగ్‌లప్పుడు, మంత్రులు, ముఖ్యమంత్రుల పర్యటనలప్పుడు తప్ప లగడపాటి ఎప్పుడూ విజయవాడకే పరిమితమవుతారు. లోక్‌సభ పరిధిలోని క్షేత్రస్థాయిల్లో తిరగడం చాలా తక్కువ. విజయవాడను పారిశ్రామిక హబ్‌గా మారుస్తానని, ఎంతో అభివృద్ధి చేస్తానని లగడపాటి హామీ ఇచ్చారు. ఇప్పుడు విజయవాడ పరిస్థితి ఏంటి? కొద్దివాన పడితే మోకాళ్లలోతు నీళ్లు ప్రధానరోడ్లపైనే ఉంటాయి. శానిటేషన్‌ లేదు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజి లేదు. రాజకీయాలకు చైతన్యం అని విజయవాడను వార్తల్లోనే చెపుతారు. విజయవాడ నగరం ఇంత అద్వానంగా తయారై రోజురోజుకూ అభివృద్ధికి దూరం జరుగుతుంటే ప్రజల్లో చైతన్యం ఏమవుతోంది? కృష్ణా జిల్లా కంచికచర్లలో రైతులు ఘోరావ్‌ చేయడం, జగన్‌ విజయవాడలో ధర్నాకు పిలుపునివ్వడంతో హడావిడిగా ఢిల్లీ వెళ్లిన లగడపాటి రైతుల సమస్యలపై మౌనదీక్ష అంటూ కొంతసేపు డ్రామా చేశారు. లగడపాటిలాంటి షో నాయకులు ఎంతకాలం ఇలాంటి 'మౌనవ్రతం' పట్టి ప్రజలను మోసం చేస్తారు? ఎంతకాలం ప్రజలు వారి మాటలకు దగా పడతారు?

No comments:

Post a Comment