కాంగ్రెస్ మాజీ ఎంపి వైఎస్ జగన్ రెండు రోజుల లక్ష్య దీక్ష, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షలు ముగిశాయి. ఇద్దరిలో ఎవరి దీక్షకు రైతు సమస్యలపై చిత్తశుద్ధి ఉందనేది ప్రజలు ముఖ్యంగా రైతులు తేలుస్తారు. రైతులను ఉద్ధరించాలన్న మంచి ఉద్దేశం తమకుందంటే తమకుందని జగన్ మద్దతుదార్లు, టిడిపి నేతలు బజారునపడి వాదించుకుంటున్నారు. పాపం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌దే విచిత్ర సంకటం. అటు జగన్‌ను, ఇటు తెలుగుదేశాన్ని తిట్టాల్సివస్తే ఏరోజుకారోజు అప్పుడు ఎదురైన పరిస్థితులను బట్టి స్పందిస్తోంది. జగన్ ఇంకా పార్టీ పెట్టలేదు, కాని కాంగ్రెస్‌ను వీడారు కనుక టిడిపి, కాంగ్రెస్‌ను రాజకీయ ప్రత్యర్ధులుగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
లక్ష్య దీక్ష చివరిరోజున కాంగ్రెస్, టిడిపి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయని జగన్ ఆరోపించారు. దానిపై ఆ రెండు పార్టీలూ తీవ్రంగా స్పందించాయి. కడపలో వైఎస్ ప్రత్యర్ధి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అయితే జగన్ కంటే టిడిపి వంద రెట్లు బెటరన్నారు. వీళ్ల గొడవను పక్కనపెడితే ఎక్కువ మంది కాంగ్రెస్ ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం వివక్ష కొనసాగుతోంది.
రాష్ట్రంలో విపత్తులతో రైతులు నష్టపోయారు. జగన్ లక్ష్యదీక్ష చేయగా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నిరాహార దీక్షతో పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలు అన్నదాతను ఆదుకోవాలని ఆందోళనలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను పట్టించుకోకుండా మహారాష్ట్రకు కేంద్రం శుక్రవారం 600 కోట్ల సాయం ప్రకటించింది. కేంద్రం 400 కోట్లు, వ్యవసాయ మంత్రి శరద్ పవార్ 200 కోట్లు ప్రకటించారు. మహారాష్ట్రలో ఇక్కడివలే ఎలాంటి ఆందోళనలూ లేకపోయినా కేంద్రం ఆ రాష్ట్రానికి 600 కోట్ల మధ్యంతర సాయం ప్రకటించింది. రాష్ట్రానికి మాత్రం జైపాల్‌రెడ్డితో సహా ఎంపీలు ప్రధానిని కలిస్తే ఇస్తానంది 400 కోట్లు. అదీ అడ్వాన్సు. అంటే వచ్చే సంవత్సరంలో ఇచ్చే నిధులను ముందుగా ఇస్తారంతే. అదనంగా ఇచ్చిందేమీ లేదు. ఇప్పుడొక్కటే సందేహం. ఆ 400 కోట్లు కూడా జగన్ దీక్ష వల్ల ప్రకటించారా లేక చంద్రబాబు దీక్షకు భయపడి ఇస్తామన్నారా?.. ఈ విషయాన్ని తేలాల్సి ఉంది.
సోనియాగాంధీ దర్శనం కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీ టెన్ జన్‌పథ్ వద్ద చలిలో ఎలా పడిగాపులు పడ్డారో ఇటీవల మీడియాలో వచ్చాయి. కాంగ్రెస్ నేతలు, ఎంపీలు ఆ 400 కోట్లు సాధించలేదనేది మాత్రం స్పష్టం.
please watch
ReplyDeletehttp://bookofstaterecords.com/
for the greatness of telugu people.