Friday, July 15, 2011

ఎందుకీ చిందులు?


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేసి రెండు వారాలవుతున్నా అధిష్టానంలో సుయ్యి సయ్యి లేదు. రాజీనామాలు చేసి తమ సంగతి తేల్చమని ఢిల్లీకి చక్కర్లు కొట్టిన నేతలు అక్కడ గర్వభంగం కావడంతో హైదరాబాద్‌కొచ్చి పడ్డారు. ఇక్కడ సిఎం, పిసిసి అధ్యక్షుడు బొత్సతో ఎడతెరపి లేకుండా భేటీల మీద భేటీలు వేసిన వారు 48 గంటల నిరశన దీక్ష చేపట్టారు. బుధవారం ఉదయం 10గంటలకు ప్రారంభించిన దీక్షలను శుక్రవారం ఉదయం 10 గంటల వరకు కొనసాగిస్తే 48 గంటలవుతుంది. కాని అర్థంతరంగా 14 గంటలకు ముందే దీక్షలను విరమించారు. దీక్షల ముగింపులో నేతలు ఏదో సాధించేసినట్లు చిందులేశారు. విచిత్రంగా డ్యాన్సులు చేశారు. ఏం సాధించినందుకు డ్యాన్స్‌ చేశారు?



తెలంగాణ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులను ఎత్తేయాలని గతంలో ఎంపీలు దీక్ష చేపట్టారు. ఒక రోజన్నా గడవకముందే కేసులు ఎత్తేస్తామన్న హామీని ప్రభుత్వం నుండి పొంది దీక్షలు విరమించారు. ఇంకా ఆ కేసులు ఎత్తేయలేదన్న సంగతి కాసేపు పక్కన పెడదాం. ఈసారి కనీసం అటువంటి హామీ ఏం లేకుండానే దీక్షలు విరమించారు. కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు మొదలు పెట్టిన దగ్గర నుండి అధిష్టానం ఒక్కసారి కూడా వారికి అనుకూలంగా మాట్లాడలేదు సరి కదా రెచ్చగొట్టింది. మూడు పరిష్కారాలున్నాయని మనీష్‌ తివారీ, అభిషేక్‌ సింగ్వీ లాంటివారు చెప్పగా, ఇప్పటి వరకూ జరిగిందంతా తూచ్‌.. మళ్లీ జీరో నుండి మొదలు పెట్టాలని ఆజాద్‌ అన్నారు. దీన్నిబట్టి నేతల రాజీనామాలను పెద్దగా అధిష్టానం పట్టించుకోలేదనిపిస్తుంది.

నిజంగా అధిష్టానం పట్టించుకోలేదా? నిజంగా నేతలు రాజీనామాలు చేయలేదా? అన్న విషయాలు ప్రశ్నార్ధకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఒక వింతైతే వారి రాజీనామాలను పార్టీ పట్టించుకోకపోవడం మరో వింత. సీమాంధ్రలో అదే పార్టీకి చెందిన నేతలు సమైక్య రాష్ట్రం కోసం ఆందోళనలు చేయడం వింతల్లో వింత. ఇంతకీ ముందుగా ప్రకటించిన సమయం కంటే ముందే నేతలు ఎందుకు దీక్షలు విరమించినట్లు?

ముంబయి పేలుళ్ల నేపథ్యంలో కాస్త ముందుగా దీక్షలు విరమించామన్నారు కాంగ్రెస్‌ నేతలు. రెండో రోజు దీక్ష ప్రారంభానికి ముందు ముంబయి పేలుళ్లలో చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు. అంత వరకూ బాగానే ఉంది. ఆ తర్వాతి నుండి విజయోత్సవాల మాదిరిగా చిందేయడం ప్రారంభించారు. నిజంగా ముంబయి పేలుళ్లపై భయం, భక్తి, సంతాపం ఉంటే రోజల్లా నేతలు ఎందుకు చిందులేసినట్లు?

ఎప్పటి నుండో కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ విలీనం అవుతుందన్న పుకార్లు వినపడుతున్నాయి. ప్రతిపక్ష టిడిపి నేతలు చేపట్టిన బస్సు యాత్రపై టిఆర్‌ఎస్‌ నేతలు రాళ్లు రువ్వుతుండగా, అధికారంలో ఉండి దీక్షలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతల వద్దకు నేరుగా కెసిఆర్‌ వెళ్లి 2004ను గుర్తుకు తెచ్చారు. మరోసారి కెసిఆర్‌ కాంగ్రెస్‌ మూడు రంగుల కండువా కప్పుకొని దీక్షలకు సంఘీభావం తెలిపారు. అంతేకాదు కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ నేతలు చెట్టపట్టాలేసుకొని ఆటా పాటాలో పాల్గొని ధూంధాం చేశారు. రెండు వారాల్లో తెలంగాణ రాష్ట్రం వస్తుందని దీక్షా శిబిరం నుండి కెసిఆర్‌ గొంతెత్తారు. బహుశ కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ నేతల కలయిక వల్ల ఆనందం పట్టలేక ఇరు పార్టీల నేతలు చిందేసి ఉంటారు. ఇదిలావుంటే, ఎప్పటిలాగానే లగడపాటి వంటి కాంగ్రెస్‌ నేతలు తమ స్వంత పార్టీ నేతల చేష్టలను విమర్శించారు. ఒక పార్టీలో ఉండి ప్రాంతాలవారీగా విడిపోయిన అధికార కాంగ్రెస్‌ నాటకాలు ఇంకా ఎన్ని వీక్షించాలో?

No comments:

Post a Comment