Tuesday, July 12, 2011

మెగా ఆశాభంగం

కేంద్ర మంత్రి పదవి కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న మెగాస్టార్‌ చిరంజీవికి కాంగ్రెస్‌ మరోసారి చెయ్యి ఇచ్చింది. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం ప్రతిపాదన తీసుకొచ్చిన ఎకె ఆంటోని కప్పు కాఫీ తాగి వెళ్లిపోయారు. అనంతరం దఫదఫాలుగా సోనియాగాంధీని, ఇతర కాంగ్రెస్‌ పెద్దలను ఢిల్లీకి పోయి కలిసొచ్చిన చిరంజీవి తనకు మంత్రి పదవి ఖాయమని సన్నిహితుల వద్ద చెప్పినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. కొన్ని పత్రికలు ఒక అడుగు ముందుకేసి చిరంజీవికి నౌకాయాన శాఖ ఇస్తున్నట్లు వార్తలు రాశాయి. చిరంజీవికి మంత్రి పదవి ఇవ్వట్లేదని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబి అజాద్‌ మంత్రివర్గ విస్తరణకు ఒక రోజు ముందే కూశారు. అదే జరిగింది. చిరుకు మరోసారి ఆశాభంగం ఎదురైంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రాంతీయ గొడవల వల్లనే చిరంజీవికి పదవి ఇవ్వలేదని సర్దిచెపుతున్నారు కాంగ్రెస్‌, పిఆర్‌పి నేతలు.

రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికెవరికైనా చిరంజీవికి కేంద్రంలో పదవి రాదని ఇట్టే అర్థమవుతుంది. చిరంజీవి మంత్రి కావాలంటే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలి. మంత్రి పదవి ఇచ్చాక ఆర్నెల్ల వరకూ రాజ్యసభకు నామినేట్‌ చేయకున్నా ఇబ్బందేమీ లేదు. కాని ఆర్నెల్లలో ఆయన్ని రాజ్యసభకు పంపడం తప్పనిసరి. లేదంటే మంత్రి పదవి ఊడుతుంది.

రాష్ట్రంలో రాజ్యసభ సీటు ఖాళీ కావాలి. ఈ ఇబ్బందులన్నింటినీ అధిగమించి ఒక వేళ రాజ్యసభకు చిరును పంపితే తిరుపతి ఎమ్మెల్యేగిరీకి రాజీనామా చేయాలి. ఆయన రాజీనామాతో ఖాళీ అయ్యే తిరుపతిలో ఉప ఎన్నికలొస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి తిరుపతిలో గెలవడం కష్టం. సిఎం కిరణ్‌కుమార్‌ స్వంత జిల్లా చిత్తూరులో కాంగ్రెస్‌ పరిస్థితి గడ్డుగా ఉంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్‌ మద్దతుదారు గెలుపొందారు. సిఎంకు సవాల్‌ విసురుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తలుచుకుంటే కిరణ్‌కుమార్‌ ప్రతిపాదించే కాంగ్రెస్‌ అభ్యర్థి తిరుపతిలో గెలవలేరు. ఇక వైఎస్సార్‌ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డికి తిరుపతిలో మంచి పట్టు ఉంది. తెలుగుదేశమో, వైఎస్సార్‌ పార్టీయో తిరుపతిలో గెలుస్తుంది తప్ప కాంగ్రెస్‌ అభ్యర్థి దాదాపు గెలిచే పరిస్థితి లేదు. ఈ ఇబ్బందులను కాంగ్రెస్‌ కొని తెచ్చుకునే పరిస్థితి లేదు.

ఏతావాతా రాష్ట్ర మంత్రివర్గంలోనే చిరుకు పదవి ఇచ్చే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అనుమానమే. కావున మరికొంతకాలం చిరుకు పదవీయోగం లేదు. అయినా కాంగ్రెస్‌తో పిఆర్‌పి విలీనం అంటే దృతరాష్ట్ర కౌగిలి వంటిది. ఇతర పార్టీలను కాంగ్రెస్‌ మింగేస్తుంది. తన లాభం తాను చూసుకుంటుంది. ఈ కాంగ్రెస్‌ నీతిని చిరంజీవి ముందుగా ఊహించలేదా లేక పిఆర్‌పిని నడపలేక ఏవో కొన్ని ప్రలోభాలకు లొంగిపోయారో మెగాస్టార్‌ చెబితేనే బాగుంటుంది.

No comments:

Post a Comment