Tuesday, July 12, 2011

ఎన్ని రోజులీ రాజీడ్రామాలు?


రాజీనామాలంటే రాజకీయపార్టీలకు కామెడీ అయిపోయింది. చీమ చిటుక్కుమంటే రిజైన్‌ లెటర్‌తో మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రెడీ అవుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్‌ నేతలు తమకు తాము డెడ్‌లైన్‌ విధించుకొని రాజీనామా చేశారు. వారిని చూసి తెలుగుదేశం వారు రాజీనామా చేశారు. ప్రత్యేక ఉద్యమంపై ఎక్కడ పేటెంట్‌ పోతుందోనని టిఆర్‌ఎస్‌ వారు రాజీనామాలకు సై అన్నారు. తెలంగాణ మంటలపై బొగ్గులేరుకోడానికి ప్రయత్నిస్తున్న బిజెపి సరేసరి. విశాలాంధ్ర పేపరు నడుపుతున్న సిపిఐ వారిదీ రాజీనామాల బాటే. వందకుపైగా ఎమ్మెల్యేలు, పదికిపైగా ఎంపీలు రాజీనామా చేస్తే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం రావాలి. కాని అలా జరగట్లేదు. విచిత్రమేంటంటే రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయడం. నిర్ణయం తీసుకోవాల్సిన వారే రాజీనామాలు చేయడమేంటి? ఈ ఆలోచన సగటు ప్రజలకు ఎక్కడొస్తుందోనని కాంగ్రెస్‌ నేతలు రోజుకో విన్యాసం మొదలుపెట్టారు.

రాజీనామాలు చేసిన వారు ఇంట్లో కూర్చోవాలి లేదా ప్రజల్లో తిరగాలి. అలాకాకుండా సమస్యపై తేల్చండంటూ ఢిల్లీ పెద్దల చుట్టూ తిరిగారు. అక్కడి నుండి హైదరాబాద్‌కొచ్చి రోజుకో భేటీ వేసి ఏదేదో మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు రాజీనామా చేయగా సీమాంధ్రలో సమైక్య రాష్ట్రం కోసం కాంగ్రెస్‌ నేతలే ఉద్యమిస్తున్నారు. కెకె, యాష్కీ, విహెచ్‌, వివేక్‌, జానారెడ్డి తెలంగాణాలో గొంతెత్తగా, లగడపాటి, రాయపాటి, దగ్గుబాటిలు సీమాంధ్రలో స్వరం పెంచారు. వారి వారి ప్రాంత ప్రజలను మభ్య పెడుతున్నారు. ఒక్క కాంగ్రెసే కాదు తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ 'గోపి'లుగానే వ్యవహరిస్తున్నాయి.

ఇంతమంది కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేం లేదంటున్నారు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గులాంనబి ఆజాద్‌. వారికి ఆ విశ్వాసం ఎలా ఏర్పడింది? రాష్ట్రపతి పాలన విధించరు. రాజీనామాలు ఆమోదించరు. తెలంగాణ సమస్యపై స్పష్టమైన వైఖరి చెప్పరు. ఏదొక నిర్ణయం తీసుకోరు. ఏ రోటికాడ ఆ పాట పాడుతుంటారు. వీరి విన్యాసాలు చూసి కార్యకర్తలు చొక్కాలు చించుకుంటున్నారు. బంద్‌లు, రాస్తారోకోలు, రైలురోకోలతో ప్రజలు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గ్యాస్‌, డీజిల్‌, కిరోసిన్‌ ధరలు పెరిగితే వాటి గురించి ప్రజలు ఆలోచించేలోపే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి పార్టీలు. ఎన్ని రోజులీ అనిశ్చితి?

No comments:

Post a Comment