Tuesday, December 28, 2010

ఎందుకీ దీక్షల డ్రామా?!

సంవత్సర కాలంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, ఉద్యమకారులపై నమోదైన పోలీస్‌ కేసుల ఎత్తివేతకు కాంగ్రెస్‌ ఎంపీలు చేపట్టిన నిరవధిక దీక్షలు కామెడీ షోను తలపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేరే పార్టీ చేతిలో ఉంటే ఆందోళన చేపడితే అర్థం చేసుకోవచ్చు. రెండు చోట్లా అధికారంలో తామే ఉండి తామే కేసుల ఎత్తివేతకు దీక్షలు చేపట్టడం వెనుక మతలబు ఎంటనేది ప్రశ్న. పొలిటికల్‌ మైలేజ్‌ కోసమే ఈ డ్రామా అని విమర్శలొస్తున్నాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కేసుల ఎత్తివేత కోసం టిఆర్‌ఎస్‌ ఆందోళన చేసింది. 

Monday, December 27, 2010

కూచిపూడి జయహో

 మన కూచిపూడి నృత్యానికి 'గిన్నీస్‌' శోభ. ఇదో అరుదైన ఆవిష్కరణ.

Sunday, December 26, 2010

జగన్‌ భయపడుతున్నారేమో!

జగన్మోహనరెడ్డి కడప, పులివెందుల ఉప ఎన్నికలపై భయపడుతున్నారా? ఎందుకంటే జగన్‌ కాంగ్రెస్‌ను వీడినప్పటి నుండి తన చిన్నాన్న వివేకానందరెడ్డితో సయోధ్య కోసం పలుమార్లు ప్రయత్నిస్తుంటే సహజంగా ఎవరికైనా ఈ డౌటు వస్తుంది. తన కుటుంబాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్‌ చీల్చిందని జగన్‌ ఆరోపిస్తుంటే అదేం లేదు నేనే సోనియాకు మాటిచ్చానంటున్నారు వివేకా. వైఎస్‌ ఆశయాలు సాధించడం కోసమే మంత్రి పదవి తీసుకున్నానన్నారు. ఇప్పటికి వివేకాతో పలుమార్లు భేటీలు జరిగాయి. జగన్‌ మామ గంగిరెడ్డి ఇంట్లో మూడు నాలుగు తడవలు సమావేశాలు జరిగాయి. వివేకాకు జగన్‌కు మధ్య సయోధ్య కుదిరిందని మీడియాలో స్క్రోలింగ్‌లు రాగా కొద్దిసేపటికే వివేకా ఆ వార్తలను ఖండించడం జరిగింది.

Saturday, December 25, 2010

ఆ 400 కోట్లు ఎవరి దీక్ష పుణ్యం?

కాంగ్రెస్‌ మాజీ ఎంపి వైఎస్‌ జగన్‌ రెండు రోజుల లక్ష్య దీక్ష, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షలు ముగిశాయి. ఇద్దరిలో ఎవరి దీక్షకు రైతు సమస్యలపై చిత్తశుద్ధి ఉందనేది ప్రజలు ముఖ్యంగా రైతులు తేలుస్తారు. రైతులను ఉద్ధరించాలన్న మంచి ఉద్దేశం తమకుందంటే తమకుందని జగన్‌ మద్దతుదార్లు, టిడిపి నేతలు బజారునపడి వాదించుకుంటున్నారు. పాపం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌దే విచిత్ర సంకటం. అటు జగన్‌ను, ఇటు తెలుగుదేశాన్ని తిట్టాల్సివస్తే ఏరోజుకారోజు అప్పుడు ఎదురైన పరిస్థితులను బట్టి స్పందిస్తోంది. జగన్‌ ఇంకా పార్టీ పెట్టలేదు, కాని కాంగ్రెస్‌ను వీడారు కనుక టిడిపి, కాంగ్రెస్‌ను రాజకీయ ప్రత్యర్ధులుగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

Wednesday, December 22, 2010

ఆ ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా?

వైఎస్‌ జగన్‌ విజయవాడలో ప్రారంభించిన లక్ష్య దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా? అసెంబ్లీలో కాంగ్రెస్‌, బయట జగన్‌ అంటున్న ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపు చట్టం వర్తిస్తుందా? ఈ ప్రశ్నలు రాష్ట్ర ప్రజానీకాన్ని, మరీ ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులను, మరీ మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌ నేతలను బుర్రలు బద్దలు కొడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఓదార్పుయాత్ర చివరిరోజు రాజమండ్రిలో జరిగిన జగన్‌ బహిరంగసభలో 20 మందికిపైగా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇప్పుడు విజయవాడలో కూడా ఒకరిద్దరు పెరిగినా తగ్గినా 25 మంది ఎమ్మెల్యేలైతే పక్కాగా మంగళవారంనాటి లక్ష్యదీక్షకు మద్దతిచ్చారు. నలుగురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సరేసరి. 

Sunday, December 19, 2010

కృష్ణభగవాన్‌ 'ఫుల్లు' కొట్టారు

తెలుగు సినిమాల్లో కామెడీ సెటైర్లకు పెట్టింది పేరు కృష్ణభగవాన్‌. సినిమాల్లో సెటైర్లు వేసి ప్రేక్షకులకు నవ్విస్తారు. కృష్ణభగవాన్‌ ఉంటే కామెడీ పండుతుంది. కామెడీ సినిమా అయితే ఇక చెప్పనక్కర్లేదు. సహజ దర్శకుడు వంశీ సినిమా అనగానే గోదావరి, కృష్ణభగవాన్‌ గుర్తుకొస్తారు. ఎంతటివారైనా ఎక్కడోక్కడ తప్పులో కాలేస్తారని, నిజ జీవితంలోనూ నవ్వులపాలవుతారన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ కూడా కృష్ణభగవానే. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలోని ఒక ప్రైవేట్‌ కాలేజీకెళ్లారాయన. సినిమా యాక్టర్‌ తన ఫ్రండ్‌ కదా అని కాలేజీ యజమాని విద్యార్థులకు పర్సనాలిటీ డెవప్‌మెంట్‌పై పాఠాలు చెప్పించడానికి పిలిచారు. విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పాల్సిన ఈ అతిథి 'మత్తు' మాటలు చెప్పారు.

Saturday, December 18, 2010

వైఎస్‌ తొలి సంతకం దేనిపై పెట్టారు?

రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలి సంతకం ఏ ఫైల్‌పై పెట్టారు? 2004 మే 16న ఎల్బీ స్టేడియంలో మొదటిసారి సిఎంగా ప్రమాణం చేసిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై వైఎస్‌ తొలి సంతకం పెట్టారు. 2009 మే 20న ఎల్బీ స్టేడియంలో రెండోసారి సిఎంగా ప్రమాణం చేశాక ఉచిత విద్యుత్‌ను ఏడు గంటల నుండి తొమ్మిది గంటలకు పెంచుతూ వైఎస్‌ తొలి సంతకం చేశారు. ఈ విషయాన్ని ఆ రోజు సభకు హాజరైన జనాలకు చెప్పారు. ప్రజల సమక్షంలోనే ఫైల్‌పై సంతకం చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో రెండే కొత్త హామీలిచ్చారు. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌, రేషన్‌ బియ్యం నాలుగు కిలోల నుండి ఆరు కిలోలకు పెంపు. ఈ రెండింటినీ త్వరలో అమలు చేస్తానని చనిపోవడానికి కొద్దిరోజుల ముందు జర్నలిసల్టులు అడిగిన ప్రశ్నకు వైఎస్‌ చెప్పారు.

Friday, December 17, 2010

మౌనమేలనోయి వివేకా!

అసెంబ్లీలో ఆరు రోజులుగా రైతుల గురించి చర్చ జరగడమో లేక ఆ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు ఆందోళన చేయడమో జరిగాయి. మూడు రోజుల పాటు చర్చించాక ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి సమాధానం చెప్పారు. విశేషమేంటంటే రైతుల సమస్యపై వ్యవసాయ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మాత్రం నోరు తెరవలేదు. సహజంగా రైతుల గురించి వ్యవసాయ మంత్రి మాట్లాడతారు. ఒకవేళ రెవెన్యూ మంత్రి, సిఎం మాట్లాడినప్పటికీ వ్యవసాయ మంత్రి ఏదోక సమయంలో జోక్యం చేసుకోవడం ఆనవాయితీ. వివేకా విషయంలో ఆ సంప్రదాయం అటకెక్కింది. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు రసవత్తరంగా సభలో చర్చ జరుగుతుంటే వ్యవసాయ మంత్రి కానరాలేదు. జీరోఅవర్‌ సమయంలో శాసనసభలో తచ్చాడిన ఆయన ఆ తర్వాత మాయమయ్యారు. ఎమ్మెల్సీ అయిన వివేకాను కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా శాసనమండలిలో పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా నియమించింది. అందుకే మండలిలో ఆయన బిజీగా ఉన్నారేమోననుకుంటే పొరపాటే. మండలిలో రైతులపై ప్రత్యేకంగా చర్చించలేదు. 

Thursday, December 16, 2010

శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పబోతోంది?

ప్రత్యేక తెలంగాణ, సమైక్య రాష్ట్ర ఆందోళనల నేపథ్యంలో కేంద్రం నియమించిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ తుది రాష్ట్ర పర్యటన నేడు. హైదరాబాద్‌లో రోజంతా కమిటీ బిజీ బిజీ. గవర్నర్‌, సిఎం, అధికారులు, రాజకీయపార్టీలు, మీడియాతో వరుస భేటీలు. సాయంత్రానికే ఢిల్లీ పయనం. నేటి శ్రీకృష్ణ పర్యటన లాంఛనం. ఇంతవరకూ తమ అధ్యయనానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి పరిమితం. డిసెంబర్‌ 31న నివేదిక ఇస్తామని కమిటీ ఎప్పుడో ప్రకటించింది. డిసెంబర్‌ 31 తర్వాత ఏం జరుగుతుంది అని గవర్నర్‌ను ప్రశ్నిస్తే జనవరి 1 వస్తుంది అని తాపీగా జవాబైతే చెప్పారు. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొంటామని డిజిపి అరవిందరావు అంటుంటే, కేంద్రం, కాంగ్రెస్‌ అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పైకైతే చెప్పారుకాని లోపల్లోపల మాత్రం సిఎం, ప్రభుత్వం ఆందోళనగానే ఉంది.

Wednesday, December 15, 2010

ఇప్పటి దాకా ఎంపీలు చేసింది మౌనదీక్ష కాదా?!

విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ పార్లమెంట్‌లో శీతాకాల సమావేశాల చివరి రోజున మౌనదీక్ష చేపట్టారంటూ మీడియాలో అమితంగా ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దాదాపు ఆరున్నరేళ్లుగా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు ఇంతకాలం చేసింది మౌనవ్రతమేకదా? కేంద్ర మంత్రులుగా ఉన్న ఎంపీలు సైతం అదే చేశారు. పొరుగు రాష్ట్రాలు ఇబ్బడిముబ్బడిగా నిధులు, రైల్వేలైన్లు, ఇతరత్రా పథకాలను, ప్యాకేజీలను తన్నుకుపోతుంటే మన ఎంపీలు, కేంద్ర మంత్రులు చోద్యం చూస్తున్నారు. మరీ సంవత్సరకాలంగా అయితే రాష్ట్రంలోనే సీమాంధ్ర, తెలంగాణా అంటూ విడిపోయి పైకి దుమ్మెత్తి పోసుకుంటున్నారు. లోపల తమ స్వప్రయోజనాలు, లబ్ది చూసుకుంటున్నారు. ఎక్కడ తమ ప్రాంతంలో ఓట్లు పోతాయోనని తప్ప ఎంపీలు చేస్తున్న ప్రాంతీయ 'ఉద్యమాల్లో' ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడుతున్నట్లు పైకి ఫోజు పెడుతున్నారు. కాంగ్రెస్‌ వేదికలమీద తామంతా ఒకటేనని, సోనియా నాయకత్వమని బృందగానం ఆలపిస్తున్నారు. వీళ్లని ఎవరు నమ్ముతారు?

Monday, December 13, 2010

కిరణ్‌కు మెచ్యురిటీ కొరత!

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు నాలుగు తడవలు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాజకీయంగా మెచ్యురిటీ కాలేదనిపిస్తోంది. ఎమ్మెల్యేగా, చీఫ్‌విప్‌గా, స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించినా సరిగ్గా రాజకీయాలు వంటబట్టించుకోలేదు. బాధ్యతాయుత స్థానంలో ఉన్న నేత ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడుతున్నారు. సీనియర్‌ రాజకీయవేత్త నల్లారి అమర్‌నాథ్‌రెడ్డి వారసుడైనప్పటికీ ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో కాంగ్రెస్‌ నేతలకే అంతుబట్టకుండా ఉంది. వైఎస్‌ ఉన్నంత కాలం తండ్రిచాటు బిడ్డలా పదవుల్లో ఒదిగిపోయిన కిరణ్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం ఊహించని రీతితో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే అసెంబ్లీలో, బయట మీడియా ముందు ఆయన స్పందిస్తున్న తీరులో మెచ్యురిటీ లోపిస్తోంది. స్పీకర్‌గా సంవత్సరంన్నర పని చేసి అందరి చేత అధ్యక్షా అని పిలిపించుకున్న కిరణ్‌, తాను సిఎం స్థానం నుండి మాట్లాడాల్సి వచ్చే సరికి ఆ మాట మర్చిపోయారు. నేరుగా టిఆర్‌ఎస్‌, ఎంఐఎం ఎమ్మెల్యేలనుద్దేశించి మాట్లాడారు.

Sunday, December 12, 2010

సురేఖ లేఖ వెనుక ఎవరున్నారు?

వైఎస్‌ తన ఆత్మగా చెప్పుకున్న కెవిపి రామచంద్రరావును బ్రోకర్‌ అంటూ ఎమ్మెల్యే కొండ సురేఖ ఎందుకు లేఖ రాసినట్లు? అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే లేఖాస్త్రం సంధించడం వెనుక ఎవరి హస్తం ఉంది? ఈ సందేహాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్‌లో చర్చనీయాంశమయ్యాయి. సురేఖ లేఖపై ఇంతగా చర్చ జరగడానికి ఆరున్నరేళ్ల గత చరిత్రే కారణం. అదృశ్యశక్తి, భేతాళమాంత్రికుడు, ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు సూత్రధారి, జల (ధన)యజ్ఞానాకి రథసారధి, కలెక్షన్‌ కింగ్‌..ఇలా రాసుకుంటూ పోతే ప్రతిపక్షాలు, పత్రికలు కెవిపికి ఇచ్చిన బిరుదులు చాలానే ఉన్నాయి. ఎప్పుడూ వైఎస్‌ వెన్నంటి ఉండే ఆయన 'ఆత్మ'పై కాంగ్రెస్‌ నేతల నుండి సైతం విమర్శలొచ్చాయి. మంత్రివర్గం ఎంపిక నుండి ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులకు టిక్కెట్లిచ్చే వరకూ, కార్పొరేషన్‌ పదవుల పందేరం దగ్గర నుండి పార్టీలో గల్లీ పదవుల వరకూ కెవిపి చక్రం తిప్పారంటారు కాంగ్రెస్‌ నేతలు. స్నేహమంటే ఇదేరా అన్న స్టయిల్‌లో వైఎస్‌, కెవిపి మైత్రిని ఫ్రెండ్‌షిప్‌డే రోజు పలు పత్రికలు ఫొటోలు వేసి మరీ ఆకాశానికెత్తాయి.

Friday, December 10, 2010

వివేకాకు ఆదిలోనే అవమానం?

వైఎస్‌ వివేకానందరెడ్డిని అప్పుడే కాంగ్రెస్‌ అవమానించిందా? సచివాలయంలో ఆయన కోరుకున్న ఛాంబర్‌ ఎందుకు కేటాయించలేదు? ఛాంబరే ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో వైఎస్‌ఆర్‌ లేని కాంగ్రెస్‌లో వివేకానందను తక్కువగా చూస్తారా? ఈ ప్రశ్నలు వైఎస్‌ అభిమానులను, కాంగ్రెస్‌ నేతలను, చివరికి సాధారణ పరిపాలనాశాఖను సైతం వేధిస్తున్నాయి. వైఎస్‌ జగన్‌కు చెక్‌ పెట్టేందుకు ఆయన కుటుంబాన్నే చీల్చింది కాంగ్రెస్‌. వైఎస్‌, వివేకానంద కుటుంబాల మధ్య దశాబ్దాలుగా ఉన్న విభేదాలను పార్టీ సొమ్ము చేసుకుందనే చెప్పాలి. ఒత్తి పెడితే ఏదోక రోజు ఎదురు కొడుతుంది, పిల్లిని గదిలోపెట్టి కొడితే దాడి చేస్తుంది అనే సామెతలు ఉండనే ఉన్నాయి. అలాగే దశాబ్దాలుగా అణిగిమణిగి ఉన్న వివేకా ఒక్కసారిగా జూలు విదిలించి జగన్‌కు వ్యతిరేకంగా మారి ఉంటారు. వైఎస్‌ కుటుంబ గొడవలెలా ఉన్నా జగన్‌ మాత్రం తనను దెబ్బకొట్టడానికి తమ కుటుంబంలో సోనియాగాంధీ చిచ్చు పెట్టారని మదనపడి కాంగ్రెస్‌ను వీడినట్లు బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

Saturday, December 4, 2010

డిప్యూటిపై నాన్చుడెందుకు?

కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? ఈ ప్రశ్న రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళనలు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు జరిగింది. కిరణ్‌కుమార్‌రెడ్డి అనుకోకుండా సిఎం అయ్యారు. సీమాంధ్రకు చెందిన కిరణ్‌ సిఎం కనుక తెలంగాణాకు డిప్యూటి సిఎం పదవి ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ మీడియా ముఖంగా ప్రకటించారు. కేబినెట్‌ కూర్పుపై కసరత్తు కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి సైతం 'డిప్యూటి' తెలంగాణాకు ఇస్తామని స్పష్టం చేశారు. దామోదర్‌ రాజనర్సింహ 'డిప్యూటి' అని మీడియాకు లీకులొదిలారు. మంత్రుల ప్రమాణస్వీకారం సమయంలో 'డిప్యూటి' మాట ఎత్తలేదు. అదేంటంటే రాజ్యాంగంలో డిప్యూటి అనే పదం ఎక్కడా లేదంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. డిప్యూటి సిఎం ప్రత్యేకంగా ప్రమాణస్వీకారం చేయాల్సిన అవసరం లేదన్నారు. 
 

Friday, December 3, 2010

జగన్‌ సక్సెస్‌ అవుతారా?

ఆన్సర్‌ మై క్వచ్చన్‌.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ తనయుడు జగన్‌ కొత్త పార్టీ పెట్టడం ఖాయంగా కనబడుతోంది. పులివెందుల అసెంబ్లీ, కడప లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికల్లోపు పార్టీ పెడతారని, త్వరలో ప్రకటన ఉంటుందని జగన్‌ మౌత్‌పీస్‌ అంబటి రాంబాబు పేర్కొన్నారు. జగన్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడిన మరుక్షణం నుండి ఆయన పెట్టబోయే పార్టీపై ఊహాగానాలోస్తున్నాయి. 'వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌' పార్టీని ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్‌ చేయించుకున్న వ్యక్తి ఆ పేరును జగన్‌కు అంకితమిస్తానంటున్నారు. జగన్‌ కొత్త పార్టీ పేరేంటి, అది ఎలా ఉండబోతోందన్న విషయాలు  రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పేరు దాదాపు ఖరారైందంటున్నారు. 'వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌'లో వైఎస్‌ఆర్‌ అంటే వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనుకోవచ్చు లేదా 'యువజన శ్రామిక రైతు' అయినా అనుకోవచ్చు.  రెండు అర్థాలొచ్చేటట్లు పేరు పెట్టారంటున్నారు.