కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? ఈ ప్రశ్న రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళనలు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు జరిగింది. కిరణ్‌కుమార్‌రెడ్డి అనుకోకుండా సిఎం అయ్యారు. సీమాంధ్రకు చెందిన కిరణ్ సిఎం కనుక తెలంగాణాకు డిప్యూటి సిఎం పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ మీడియా ముఖంగా ప్రకటించారు. కేబినెట్ కూర్పుపై కసరత్తు కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి సైతం 'డిప్యూటి' తెలంగాణాకు ఇస్తామని స్పష్టం చేశారు. దామోదర్ రాజనర్సింహ 'డిప్యూటి' అని మీడియాకు లీకులొదిలారు. మంత్రుల ప్రమాణస్వీకారం సమయంలో 'డిప్యూటి' మాట ఎత్తలేదు. అదేంటంటే రాజ్యాంగంలో డిప్యూటి అనే పదం ఎక్కడా లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. డిప్యూటి సిఎం ప్రత్యేకంగా ప్రమాణస్వీకారం చేయాల్సిన అవసరం లేదన్నారు.
శాఖల కేటాయింపులో డిప్యూటీకి హౌం పోర్టుఫోలియో కేటాయిస్తామన్నారు. నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. శాఖల కేటాయింపులో హౌంను సబితాకు ఇచ్చినందున దామోదర్ బదులు ఆమె డిప్యూటి అవుతారనుకున్నారు. తీరా చూస్తే డిప్యూటి ఇవ్వనట్లే కనబడుతోంది. తానే హైకమాండ్ వద్ద చేతులు నలుపుతుండగా డిప్యూటి ఇచ్చి మరో 'పవర్' సెంటర్ తెరవడం ఎందుకనుకున్నారో ఏమో.. సిఎం ఇప్పుడు డిప్యూటి మాట ఎత్తట్లేదు. వీరప్ప అయితే మీడియాలో ఏవో వార్తలొస్తే వాటికి జవాబు చెప్పాలా అని ఎదురుదాడికి దిగారు. పిసిసి చీఫ్ డిఎస్ స్పందిస్తూ డిప్యూటి ఎప్పుడిచ్చినా తెలంగాణాకే, ఆర్నెల్లకిచ్చినా తెలంగాణాకే కదా అని వాదిస్తున్నారు. డిప్యూటి విషయంపై మంత్రి గీతారెడ్డి సోనియాను కలిశారు. డిప్యూటిపై మాటిచ్చి ఇవ్వకపోవడం సరికాదని సీమాంధ్ర మంత్రి బొత్స అన్నారు. మంత్రి పదవులు తీసుకున్నవారు శ్రీకృష్ణ కమిటీ నివేదికొచ్చాక రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ దామోదర్‌రెడ్డి హెచ్చరించారు. పదవుల కోసం కాంగ్రెస్ నేతలు బూట్లు నాకుతున్నారని కెసిఆర్ విమర్శించగా పదవులు తీసుకోవద్దని జెఎసి ఛైర్మన్ కోదండరామ్ నిరసన తెలుపుతున్నారు. గద్దర్ సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఇంతకీ డిప్యూటిపై నాన్చుడెందుకు? సెన్సిటివ్ అంశంపై ఆందోళనలు చెలరేగిన తర్వాత చూసుకుందాంలే.. సరైన సమయంలో డిప్యూటి కార్డు బయటికి తీద్దాంలే అనుకున్నట్లుంది. కాంగ్రెస్ రాజకీయాలు ఒక పట్టాన ఎవరికీ అర్థం కావు మరి!
No comments:
Post a Comment