Sunday, December 12, 2010

సురేఖ లేఖ వెనుక ఎవరున్నారు?

వైఎస్‌ తన ఆత్మగా చెప్పుకున్న కెవిపి రామచంద్రరావును బ్రోకర్‌ అంటూ ఎమ్మెల్యే కొండ సురేఖ ఎందుకు లేఖ రాసినట్లు? అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే లేఖాస్త్రం సంధించడం వెనుక ఎవరి హస్తం ఉంది? ఈ సందేహాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్‌లో చర్చనీయాంశమయ్యాయి. సురేఖ లేఖపై ఇంతగా చర్చ జరగడానికి ఆరున్నరేళ్ల గత చరిత్రే కారణం. అదృశ్యశక్తి, భేతాళమాంత్రికుడు, ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు సూత్రధారి, జల (ధన)యజ్ఞానాకి రథసారధి, కలెక్షన్‌ కింగ్‌..ఇలా రాసుకుంటూ పోతే ప్రతిపక్షాలు, పత్రికలు కెవిపికి ఇచ్చిన బిరుదులు చాలానే ఉన్నాయి. ఎప్పుడూ వైఎస్‌ వెన్నంటి ఉండే ఆయన 'ఆత్మ'పై కాంగ్రెస్‌ నేతల నుండి సైతం విమర్శలొచ్చాయి. మంత్రివర్గం ఎంపిక నుండి ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులకు టిక్కెట్లిచ్చే వరకూ, కార్పొరేషన్‌ పదవుల పందేరం దగ్గర నుండి పార్టీలో గల్లీ పదవుల వరకూ కెవిపి చక్రం తిప్పారంటారు కాంగ్రెస్‌ నేతలు. స్నేహమంటే ఇదేరా అన్న స్టయిల్‌లో వైఎస్‌, కెవిపి మైత్రిని ఫ్రెండ్‌షిప్‌డే రోజు పలు పత్రికలు ఫొటోలు వేసి మరీ ఆకాశానికెత్తాయి.

వైఎస్‌ హఠన్మరణం, తదుపరి జగన్‌ చేపట్టిన ఓదార్పు యాత్రను పార్టీ అధిష్టానం అడ్డుకున్న తర్వాత కెవిపి పాత్ర అంతుబట్టకుండా తయారైంది. తొలిరోజుల్లో జగన్‌తో కెవిపి తరచూ మంతనాలు జరిపేవారు. రెండో విడత శ్రీకాకుళం, తూర్పుగోదావరి ఓదార్పు యాత్రలు జగన్‌ చేపట్టక ముందు, తర్వాత కూడా కెవిపి, జగన్‌ మధ్య భేటీలు జరిగాయి. వైఎస్‌ వర్ధంతి తర్వాత ప్రారంభమైన మూడో విడత ఓదార్పు యాత్ర తర్వాతనే కెవిపి, జగన్‌ మధ్య దూరం పెరగనారంభించింది. రోశయ్యను మార్చి కిరణ్‌కుమార్‌రెడ్డిని సిఎం చేయడం, జగన్‌ పార్టీని వీడటం జరిగిపోయాయి. జగన్‌ సరే.. పార్టీకి, ఎమ్మెల్యేగిరీకి రాజీనామా చేసిన వైఎస్‌ సతీమణి విజయమ్మతోనైనా కెవిపి ఎందుకు మాట్లాడలేదు? భార్యను అర్థాంగిగా చెబుతారు. వైఎస్‌లో సగం విజయమ్మ. వైఎస్‌ ఆత్మ కెవిపి. వైఎస్‌లో సగం అయిన విజయమ్మను ఆత్మ ఎందుకు విస్మరించినట్లు?

జగన్‌కు మద్దతిచ్చి మంత్రి పదవికి సైతం రాజీనామా చేశారు సురేఖ. యువనేత పార్టీని వీడాక కూడా తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. జగన్‌ వెంట నడిచిన అత్యంత కీలక నేతల్లో ఆమె ఒకరు. కెవిపినుద్దేశించి విమర్శలు చేస్తూ రాసిన లేఖ తన వ్యక్తిగతమని, జగన్‌కు సంబంధం లేదని సురేఖ చేసిన ప్రకటనను ఎవరు నమ్ముతారు? జిల్లా రాజకీయాల నేపథ్యంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ఇబ్బంది పెట్టడానికే లేఖ రాశారనుకున్నా అందుకు కెవిపిని ఎందుకు ఎంచుకున్నట్లు? ఒక సీనియర్‌ మంత్రి అసెంబ్లీలో పిచ్చాపాటీ మాట్లాడుతూ సురేఖ లేఖ వెనుక జగన్‌ ఉండే అవకాశం లేదన్నారు. అక్కడితో ఆగలేదు. పార్టీలో, ప్రభుత్వంలో ఒక ముఖ్య నేత సురేఖ చేత లేఖ రాయించారని బల్లగుద్ది చెప్పారు.

ఒకవేళ జగనే సురేఖ చేత లేఖ రాయించి ఉంటే చనిపోయిన వైఎస్‌ బదనాం అవుతారన్న విషయాన్ని మర్చిపోయారా? ఏదో ఆశించి లేఖ రాయిస్తే ఏదో జరిగిందనుకుంటున్నారా? ఎప్పుడు ఏ డైరెక్షన్‌ నుండి ఎవరిపై లేఖాస్త్రాలొస్తాయో భయపడి చస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు, మంత్రులు. అమెరికాకు వికీలీక్స్‌ వలే అధికారపార్టీ నేతలకు 'సురేఖ'ల ఫోబియా పట్టుకుంది. కాగా ప్రతిపక్షాలకు, ప్రజలకు ఇటువంటి లేఖలు లాభం. ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు ఏదో రూపంలో బహిర్గతం కావడబం ప్రజాస్వామ్యానికి కొద్దిపాటి ఊరట. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఎవరు లేఖ రాసినా సూమోటోగా స్వీకరించి సమగ్ర విచారణకు ఆదేశిస్తేనే ప్రజల విశ్వాసం పొందుతుంది. లేకపోతే అవినీతికి ప్రభుత్వమే కొమ్ముకాసినట్లవుతుంది.

1 comment:

  1. సురేఖ లేఖ వెనుకే కాదు ఎవరి లేక వెనుకైనా ఒక పి.ఏ ఒక డిటిపి ఆపరేటర్, ఒక కొరియర్ బాయ్ ఉంటారు.

    ReplyDelete