Sunday, December 26, 2010

జగన్‌ భయపడుతున్నారేమో!

జగన్మోహనరెడ్డి కడప, పులివెందుల ఉప ఎన్నికలపై భయపడుతున్నారా? ఎందుకంటే జగన్‌ కాంగ్రెస్‌ను వీడినప్పటి నుండి తన చిన్నాన్న వివేకానందరెడ్డితో సయోధ్య కోసం పలుమార్లు ప్రయత్నిస్తుంటే సహజంగా ఎవరికైనా ఈ డౌటు వస్తుంది. తన కుటుంబాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్‌ చీల్చిందని జగన్‌ ఆరోపిస్తుంటే అదేం లేదు నేనే సోనియాకు మాటిచ్చానంటున్నారు వివేకా. వైఎస్‌ ఆశయాలు సాధించడం కోసమే మంత్రి పదవి తీసుకున్నానన్నారు. ఇప్పటికి వివేకాతో పలుమార్లు భేటీలు జరిగాయి. జగన్‌ మామ గంగిరెడ్డి ఇంట్లో మూడు నాలుగు తడవలు సమావేశాలు జరిగాయి. వివేకాకు జగన్‌కు మధ్య సయోధ్య కుదిరిందని మీడియాలో స్క్రోలింగ్‌లు రాగా కొద్దిసేపటికే వివేకా ఆ వార్తలను ఖండించడం జరిగింది.

తాజాగా క్రిస్మస్‌ వేడుకల్లోనూ అంతే. జగన్‌కు వివేకా జై కొట్టారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. వివేకా ఆ వార్తలన్నీ తప్పని తేల్చి చెప్పారు. తన అన్న తుదిశ్వాస విడిచేంత వరకూ కాంగ్రెస్‌లోనే ఉన్నారని, తానూ అలాగే కాంగ్రెస్‌లో ఉంటానని కుండ బద్దలు కొట్టారు.

వివేకా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి ఉప ఎన్నికలు జగన్‌కు సెమీ ఫైనల్‌ అయితే తనకు ఫైనల్‌ అంటున్నారు. ఇంతకీ వివేకాతో సయోధ్యకు ఎందుకు జగన్‌ మద్దతుదార్లు వెంపర్లాడుతున్నారు? గతంలో ఎన్నికల సమయంలో వైఎస్‌ రాష్ట్రాన్ని చూసుకుంటే వివేకా జిల్లాను ముఖ్యంగా కడప, పులివెందులను చూసుకునేవారు. వివేకాకు ఎన్నికలు, పోలింగ్‌, ప్రచారం తదితరాలపై అన్నీ తెలుసు. అందుకే జగన్‌ భయపడుతున్నారా లేక నిజంగానే కుటుంబం అంతా ఒక్కటిగానే ఉండి కాంగ్రెస్‌ను ఢ కొంటే నైతిక బలం వస్తుందని నమ్మి వివేకాతో మైత్రిని కోరుకుంటున్నారా? డిఎల్‌ రవీంద్రారెడ్డి, తులసిరెడ్డి లాంటి కడప కాంగ్రెస్‌ నేతలు వివేకాను చూసి జగన్‌ భయపడుతున్నారంటున్నారు. లోగుట్టు జగన్‌, వివేకాకే ఎరుక.

2 comments:

  1. dnt underestimate jaggu,he is the son of a notorious politician nd grandson of a teritorious factionist...

    ReplyDelete
  2. జగన్ భయపడుతున్నాడని అనుకోలేం. కాకపోతే గత కొంతకాలం ఒకేమాట మీద వున్న ఫ్యామిలీలో విభజన రావడం, ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూవుంటే అది చూసేవారికి, కార్యకర్తలకు సంకటస్థితి. అందువల్ల తన వంతు కృషిగా ఆయనను తన కొత్త పార్టీలోకి తెచ్చుకుంటే విమర్శలను ధైర్యంగా ఎదుర్కోవచ్చనే వ్యూహం అయివుంటుందేమో....

    ReplyDelete