ప్రత్యేక తెలంగాణ, సమైక్య రాష్ట్ర ఆందోళనల నేపథ్యంలో కేంద్రం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తుది రాష్ట్ర పర్యటన నేడు. హైదరాబాద్‌లో రోజంతా కమిటీ బిజీ బిజీ. గవర్నర్, సిఎం, అధికారులు, రాజకీయపార్టీలు, మీడియాతో వరుస భేటీలు. సాయంత్రానికే ఢిల్లీ పయనం. నేటి శ్రీకృష్ణ పర్యటన లాంఛనం. ఇంతవరకూ తమ అధ్యయనానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి పరిమితం. డిసెంబర్ 31న నివేదిక ఇస్తామని కమిటీ ఎప్పుడో ప్రకటించింది. డిసెంబర్ 31 తర్వాత ఏం జరుగుతుంది అని గవర్నర్‌ను ప్రశ్నిస్తే జనవరి 1 వస్తుంది అని తాపీగా జవాబైతే చెప్పారు. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొంటామని డిజిపి అరవిందరావు అంటుంటే, కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పైకైతే చెప్పారుకాని లోపల్లోపల మాత్రం సిఎం, ప్రభుత్వం ఆందోళనగానే ఉంది.
ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా నివేదిక రాకుంటే డిసెంబర్ 31 తర్వాత యుద్ధం జరుగుతుందంటున్న టిఆర్‌ఎస్, తెలంగాణా వాదుల సంగతి సరేసరి. శ్రీకృష్ణ నివేదికకు కట్టుబడి ఉంటామని చెబుతున్న మిగిలిన పార్టీలను నమ్మడానికి వీల్లేదు. ఏ రోటికాడ ఆ పాట పాడటం సదరు పార్టీలకు అలవాటే కాబట్టి ఇవాళ చెప్పిన మాటపై రేపు కట్టుబడతారన్న గ్యారంటీ లేదు. పార్టీల ఎత్తులు పైఎత్తులు, ప్రభుత్వ ముందస్తు చర్యలు, రెండు ప్రాంతాల్లోని సామాన్య ప్రజల ఆందోళన ఎలా ఉన్నా శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఏం చెప్పబోతోందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. తాము రాష్ట్రం విడిపోవాలి లేదా కలిసి ఉండాలని చెప్పబోమని, కేవలం ఆఫ్షన్లు మాత్రమే చెబుతామని శ్రీకృష్ణ కమిటీ అంటోంది.
తమ సుదీర్ఘ అధ్యయనంలోని సారాన్ని చెబుతుందన్నమాట. అంటే... ప్రభుత్వం ముందు కొన్ని పరిశీలనలను ఉంచబోతోంది. ఏ అంశాన్ని ఎంపిక చేసి అమలు చేయాలో నిర్ణయించాల్సింది కేంద్రం. మళ్లీ కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి 'బంతి' వెళుతుంది. కేంద్రం ఎటువైపు తంతుందనేది కేంద్రం ఇష్టం. అంటే కాంగ్రెస్ ఇష్టం. కాంగ్రెస్ 125 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే తన ప్రయోజనం కోసం ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది. ఏ నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్‌కు ప్రయోజనం కలుగుతుందో అప్పటి కాలాన్ని బట్టి ఉంటుంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ప్రజల పాత్ర నామమాత్రం. వారి ప్రయోజనం, లాభనష్టాలు, విస్తృత అభిప్రాయాలకు చోటు లేదు. అంతిమంగా నష్టపోయేది అత్యధిక సంఖ్యలోని ప్రజలు. లబ్ధి చేకూరేది కొంత మంది రాజకీయ నేతలకు, వారి కనుసన్నల్లో మెలిగే వారికి. అక్కడ ఇక్కడ అని కాదు ఏ ప్రాంతంలోనైనా జన బాహుళ్యానికి న్యాయం చేయాలని చిత్తశుద్ధి కలిగిన పార్టీలు బలపడిన రోజున, అస్తిత్వ రాజకీయాలకు బదులు అత్యధిక ప్రజల ప్రయోజనాలకు కట్టుబడే పార్టీలు నిర్ణయాత్మక పాత్ర పోషించిన రోజునే రాష్ట్రానికైనా దేశానికైనా ప్రపంచానికైనా మంచి జరుగుతుంది. అప్పటిదాకా అధోగతే...
ఏమీ చెప్పదు. గోడమీద పిల్లివాటంగా ఉండవచ్చు అని అనుకుంటున్నాను
ReplyDeleteOne thing is sure, if Congres(I) decides to give Telangana, then there will be no Congress(I) party in AP for the next 50 years.
ReplyDelete