Saturday, December 18, 2010

వైఎస్‌ తొలి సంతకం దేనిపై పెట్టారు?

రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలి సంతకం ఏ ఫైల్‌పై పెట్టారు? 2004 మే 16న ఎల్బీ స్టేడియంలో మొదటిసారి సిఎంగా ప్రమాణం చేసిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై వైఎస్‌ తొలి సంతకం పెట్టారు. 2009 మే 20న ఎల్బీ స్టేడియంలో రెండోసారి సిఎంగా ప్రమాణం చేశాక ఉచిత విద్యుత్‌ను ఏడు గంటల నుండి తొమ్మిది గంటలకు పెంచుతూ వైఎస్‌ తొలి సంతకం చేశారు. ఈ విషయాన్ని ఆ రోజు సభకు హాజరైన జనాలకు చెప్పారు. ప్రజల సమక్షంలోనే ఫైల్‌పై సంతకం చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో రెండే కొత్త హామీలిచ్చారు. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌, రేషన్‌ బియ్యం నాలుగు కిలోల నుండి ఆరు కిలోలకు పెంపు. ఈ రెండింటినీ త్వరలో అమలు చేస్తానని చనిపోవడానికి కొద్దిరోజుల ముందు జర్నలిసల్టులు అడిగిన ప్రశ్నకు వైఎస్‌ చెప్పారు.

రవాణ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ మాత్రం వైఎస్‌ తొలి సంతకం 9 గంటల విద్యుత్‌ ఫైల్‌పై ఎక్కడ పెట్టారని శుక్రవారం జర్నలిస్టులను ప్రశ్నించారు. సంతకం పెడితే ఆ ఫైల్‌ ఉండాలి కదా అని ఎదురుదాడి చేశారు. రెండుసార్లు వైఎస్‌ మంత్రివర్గంలో పని చేసిన బొత్స తర్వాత రోశయ్య, ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లోనూ మంత్రే. గతంలో వైఎస్‌కు సన్నిహితంగా ఉన్నట్లు కనబడిన బొత్స ఆయన చనిపోయాక యు టర్న్‌ తీసుకున్నారు. జగన్‌ రైతుల కోసం దీక్ష చేపడతానని ప్రకటించడం, విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కాంగ్రెస్‌ను వీడటంతో షాక్‌కు గురైన బొత్స జగన్‌ను విమర్శించబోయి వైఎస్‌ తొలిసంతకాన్ని వివాదాస్పదం చేసి నాలుక్కరుచుకున్నారు. వైఎస్‌ తమ ఆస్తి అని చెబుతున్న కిరణ్‌కుమార్‌ టీం కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలోని హామీలు అమలు చేస్తామని భరోసా ఇచ్చింది. గత ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో పెటిన రెండు వాగ్దానాలు 'తొమ్మిది గంటల విద్యుత్‌, రేషన్‌ పెంపు' అమలుపై కిరణ్‌ నోరువిప్పట్లేదు. బొత్స అడుగు ముందుకేసి పొలిటికల్‌ గజనీగా మారి '9 గంటల విద్యుత్‌'పై వైఎస్‌ తొలిసంతకం చేయలేదంటున్నారు. వైఎస్‌ సంతకం జగన్‌, బొత్స సొంత సమస్యకాదు. తొలి సంతకం చేశారో లేదో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. శనివారం బొత్స మాటమార్చి ఆర్థిక మాంద్యం వల్లనే తొమ్మిది గంటల విద్యుత్‌ అమలు చేయలేకపోయామంటున్నారు. బొత్స ఎందుకు మాట మార్చారు? ఇంతకీ వైఎస్‌ తొలి సంతకం ఏ ఫైల్‌పై పెట్టారు? తేల్చాల్సింది ప్రభుత్వమే కాదా?

1 comment:

  1. ఖచ్చితంగా... సొంత జిల్లాలో ఏర్పడిన సంక్షోభం దెబ్బకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది సత్తిబాబుకు. దాంతో ఏం మాట్లాడారో ఆయనకే తెలియదు. అది చివరికి ఆయన మెడకే చుట్టుకునే పరిస్థితి వచ్చేసరికి ప్లేట్ మార్చి ఈవేళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాజకీయాల్లో దిగజారుడుతనం వుంటుందని తెలుసుకానీ మరీ ఇంత దిగజారుడుతనమా? వైఎస్ ద్వారా బొత్సా పొందిన లబ్ది మరింకెవ్వరూ పొందివుండరేమో... ఏ ఎండకా గొడుగు పట్టేవారితో ఎప్పటికైనా ప్రమాదమే...

    ReplyDelete