వైఎస్ వివేకానందరెడ్డిని అప్పుడే కాంగ్రెస్ అవమానించిందా? సచివాలయంలో ఆయన కోరుకున్న ఛాంబర్ ఎందుకు కేటాయించలేదు? ఛాంబరే ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో వైఎస్‌ఆర్ లేని కాంగ్రెస్‌లో వివేకానందను తక్కువగా చూస్తారా? ఈ ప్రశ్నలు వైఎస్ అభిమానులను, కాంగ్రెస్ నేతలను, చివరికి సాధారణ పరిపాలనాశాఖను సైతం వేధిస్తున్నాయి. వైఎస్ జగన్‌కు చెక్ పెట్టేందుకు ఆయన కుటుంబాన్నే చీల్చింది కాంగ్రెస్. వైఎస్, వివేకానంద కుటుంబాల మధ్య దశాబ్దాలుగా ఉన్న విభేదాలను పార్టీ సొమ్ము చేసుకుందనే చెప్పాలి. ఒత్తి పెడితే ఏదోక రోజు ఎదురు కొడుతుంది, పిల్లిని గదిలోపెట్టి కొడితే దాడి చేస్తుంది అనే సామెతలు ఉండనే ఉన్నాయి. అలాగే దశాబ్దాలుగా అణిగిమణిగి ఉన్న వివేకా ఒక్కసారిగా జూలు విదిలించి జగన్‌కు వ్యతిరేకంగా మారి ఉంటారు. వైఎస్ కుటుంబ గొడవలెలా ఉన్నా జగన్ మాత్రం తనను దెబ్బకొట్టడానికి తమ కుటుంబంలో సోనియాగాంధీ చిచ్చు పెట్టారని మదనపడి కాంగ్రెస్‌ను వీడినట్లు బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
జగన్ పార్టీలోనే ఉండి తమ మాట వినేటట్లు చేసుకోడానికి, నష్టాన్ని నివారించుకోడానికి వివేకాను కాంగ్రెస్ అధిష్టానం పావుగా ఉపయోగిస్తే చివరికి జగనే పార్టీని విడిచిపెట్టారు. కొత్తపార్టీ పెడుతున్నారు. జగన్‌తో సయోధ్య కుదరనప్పుడు ఇక వివేకాతో కాంగ్రెస్‌కు పెద్దగా పని లేదు. అయినా కడప జిల్లాలో జగన్ హవాను తగ్గించడానికి వివేకాకు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్. రైతు పక్షపాతిగా వైఎస్‌ఆర్‌కు ముద్ర పడినందువల్ల వ్యవసాయశాఖను వివేకాకు ఇచ్చినట్లుంది. విశేషమేంటంటే గతంలో వ్యవసాయం, ఉద్యానవనాలు ఒకరిదగ్గరే ఉండేవి. ఇప్పుడలా కాదు. వ్యవసాయం మాత్రమే వివేకాకు ఇచ్చారు. హార్టికల్చర్‌ను రాంరెడ్డి వెంకటరెడ్డికి కేటాయించారు. అంటే శాఖ తగ్గించారు. ఇక మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాతి రోజు జగన్ ఇంటికెళ్లి తమ మధ్య గొడవల్లేవని చెప్పి, నిరసనకారులకు తానూ సీమ బిడ్డనేననంటూ మీసం తిప్పారు వివేకా. పౌరుషం బానే చూపారు, ఆ ఊపులోనే తనకు సచివాలయంలోని డి బ్లాక్‌లో గతంలో కెవిపి రామచంద్రరావు ఉన్న ఛాంబర్ కావాలని నోరుతెరిచి అడిగారు. అందుకు సాధారణపరిపాలనాశాఖ ఒప్పులేదు. అదేంటంటే కెవిపి రాజీనామాను సిఎం ఆమోదించలేదని చెప్పి వివేకాకు ఎ బ్లాక్‌లోని మొదటి అంతస్తులో ఛాంబర్ కేటాయించింది. చేసేది లేక వివేకా శుక్రవారం ఎ బ్లాక్‌లోకి వెళుతున్నారు. ఇది వివేకాకు అవమానమేనని సచివాలయంలో గుసగుసలు వినపడుతున్నాయి.
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రైతులు అలో లక్ష్మణా అని ఆవేదన చెందుతున్నారు. ఈ సమయంలో వ్యవసాయ మంత్రి వివేకా అడ్రస్ గల్లంతైంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన వెంట రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి, ఇతర మంత్రులున్నారుకాని వివేకా లేరు. వ్యవసాయ మంత్రిని సిఎం ఎందుకు తన వెంట తీసుకెళ్లలేదో తెలీదు. వైఎస్‌ఆర్ పథకాలను మరింత సమర్ధవంతంగా అమలు చేయడానికే మంత్రి పదవి తీసుకున్నానని, రైతులకు మేలు చేస్తానని చెప్పిన వ్యవసాయ మంత్రి వివేకా ఎక్కడీ ఆయన్ని సిఎం, కాంగ్రెస్ అవమానించారా? లేక చిన్నగా పక్కన పెడుతున్నారా? కడప, పులివెందుల ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో వివేకా ఏమవుతారు? ఈ ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
కాన్గ్రేస్సుల్లో ప్రతివాడిది బానిసబతుకే మరి.
ReplyDelete