Saturday, July 16, 2011

బాదుడుకు వేళాయె...

బాదుడుకు మంచి సమయం..ఆలస్యం చేసిన ఆశాభంగం... అనుకుంటున్నట్లుంది కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రాంతీయ గొడవకు ఆజ్యం పోసిన కాంగ్రెస్‌ ఆ మంటల్లో బొగ్గులేరుకుంటోంది. రాజకీయ పార్టీలు, ప్రజలు ప్రాంతాలవారీగా విడిపోయి భావోద్వేగాల్లో మునిగి ఉండగా బాదుడుకు ఇదే సరైన సమయం అనుకుంది ప్రభుత్వం. ఆర్టీసి బస్‌ ఛార్జీలను అమాంతం పెంచి ప్రజల వీపు విమానం మోత మోగించింది. మామూలు రోజుల్లో అయితే బస్‌ ఛార్జీలు పెరిగితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు పెల్లుబికేవి. విపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేసేవి. వారి ఆందోళనలకు మీడియాలో చోటు లభించేది. ప్రజలపై 500 కోట్ల రూపాయలను బాదినప్పటికీ ఈసారి పెద్దగా ప్రచారం రాలేదు. వామపక్షాలు మాత్రమే నిబద్ధతగా, సంప్రదాయ బద్ధంగా, తమ శక్తి మేరకు బస్‌ ఛార్జీల పెంపునకు నిరసగా ఆందోళనలు చేశాయి.

ప్రాంతీయ గొడవల్లో మునిగిన మిగిలిన పార్టీలు బస్‌ ఛార్జీలను పెద్దగా పట్టించుకోలేదు. వాటికి ఉన్న శక్తి మేరకు ఆందోళనలు చేయలేదు. అక్కడక్కడ మొక్కుబడిగా నిరసన ప్రదర్శనలు చేసి మీడియాలో ప్రచారం పొందాయి. అధికారపార్టీ నేతలు కనీసం పన్నెత్తి మాట్లాడలేదు. తమకు ఎన్నుకున్న ప్రజలను గాలికొదిలేశారు. రవాణ శాఖ మంత్రిగా, పిసిసి అధ్యక్షునిగా డబుల్‌ యాక్షన్‌ చేస్తున్న బొత్స సత్యనారాయణ తమ శాఖ పరిధిలోని ఆర్టీసి ప్రజలపై భారాలు మోపినా కిమ్మనట్లేదు. కాంగ్రెస్‌లో విభేదాలను సరిదిద్దే పనిలో బిజీ అయిన బొత్సకు ప్రజల గోడు పట్టించుకునే తీరిక ఓపిక లేదు.

తెలంగాణ, సీమాంధ్ర, సమైక్యాంధ్ర, మన్యసీమ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, గ్రేటర్‌ రాయలసీమ, రాయల్‌ తెలంగాణ అన్న చర్చ తప్ప పార్టీల్లో, ఒక స్థాయి ప్రజల్లో వేరే వ్యాపకం లేకపోయింది. ప్రజలు వేరే వ్యాపకంలో ఉన్న సమయాన్ని చూసుకున్న ప్రభుత్వం బస్‌ ఛార్జీలు పెంచేసింది. తమ నిర్ణయంపై ప్రజలు ఆలోచించే మూడ్‌లో లేరని తలచి బాదుడుకు అదను చూసుకుంది. ఈ మధ్య డీజిల్‌, పెట్రోలు, వంట గ్యాస్‌, కిరోసిన్‌ రేట్లను కేంద్రం పెంచింది. మోత భారీగా ఉన్నా, రాష్ట్రం భారీగా వ్యాట్‌ను గుంజుతున్నా ప్రధాన పార్టీలు వేర్పాటు మూడ్‌లో బిజీ అయ్యి పెద్దగా పట్టించుకోలేదు. ప్రజలను తప్పుదారి పట్టించాయి.

No comments:

Post a Comment