Tuesday, February 15, 2011

వాలైంటైన్స్‌ డే ఫిలాసఫీ

అదేదో సినిమాలో ఎల్‌బి శ్రీరాం 'ఎయిడ్స్‌ డే, వాలైంటైన్స్‌ డే, మదర్స్‌డే..' వంటి 'డే'లపై తనదైన శైలిలో ఉతికి పారేశాడు. ఈ దిక్కుమాలిన 'డే'ల వల్ల ఏ 'డే' ఖాళీ లేదంటాడు ఆ కమెడియన్‌. తన బర్త్‌డే రోజున ఎయిడ్స్‌డే వచ్చిందని, అందుకే బర్త్‌డే చేసుకోనంటూ నిరసన తెలుపుతాడు. ఎల్‌బి శ్రీరాం అన్నట్లుగా ఈ 'డే'ల సంస్కృతి విసృంఖలత్వాన్ని సంతరించుకుంది. మహాకవి శ్రీశ్రీ 'కాదేదీ కవితకు అనర్హం' అన్నారు. ఇప్పుడు రోజులు మారాయి. గ్లోబలీకరణ ఊపందుకున్నాక మహాకవి కవితకు అర్థం మార్చేశారు. ఇప్పుడు 'కాదేదీ వ్యాపారానికి అనర్హం' అంటున్నారు. వాలైంటెన్స్‌ చనిపోయిన రోజు ఫిబ్రవరి 14. ఆ ప్రేమికుని డెత్‌డేని ఎంతో ఆర్భాటంగా ప్రేమికుల రోజు పేర జరుపుకుంటోంది యావత్‌ ప్రపంచం. అదేదో సంస్థ జరిపిన సర్వేలో దేశంలో వాలైంటైన్స్‌ డే వ్యాపారం అక్షరాల పన్నెండు వేల కోట్ల రూపాయల పైమాటేనని తేలింది.

ప్రేమికుడు లేదా ప్రేమికురాలు తన ప్రేమను వ్యక్తం చేయడానికి ఖర్చు చేస్తున్న సొమ్ము కనిష్టంగా ఐదు వేలు గరిష్టంగా లక్షన్నర అట. గ్రీటింగ్‌ కార్డుల నుండి డైమండ్‌ రింగ్స్‌ వరకూ ఖరీదైన వస్తువులను గిఫ్టుగా ఇస్తేనే ప్రేమ అనుకుంటోంది యువత. యువతలోని బలహీనతను అనుకూలంగా మార్చుకోడానికి చూస్తున్నాయి పెద్ద వ్యాపార సంస్థలు. ఒక టీవి చానల్‌ అయితే వాలైంటైన్స్‌డే ప్రధానమా లేక మదర్స్‌డే ముఖ్యమా అని రెండు 'డే'లకూ పోటీ పెట్టి యువతీయువకులను ఇంటర్వ్యూలు చేసింది. సినిమా పాటలు, స్పెషల్‌ ప్రొగ్రామ్స్‌, యాడ్స్‌, స్పెషల్‌ ఫీచర్స్‌తో ముంచెత్తుతున్నాయి చానల్స్‌, పత్రికలు. మానవ సంబంధాలు, నైతిక విలువలు వస్తువుల అమ్మకాల్లో మాడి మసై పోతున్నాయి. యూత్‌ను వ్యాపార సూత్రాలు తమ వైపునకు పరుగులు తీయిస్తున్నాయి.

ఈ కృత్రిమ వ్యవస్థకు పూర్తి భిన్నమైంది కాషాయ మూకల పైశాచికం. పార్కుల్లో, సినిమా హాళ్లలో జంటలు కనబడితే చాలు పాశ్చాత్య సంస్కృతి అంటూ వెంబడించి పెళ్లి చేస్తున్నాయి విహెచ్‌పి, భజరంగ్‌దళ్‌ వంటి సంస్థలు. జంటలు ప్రేమికులో కాదో తెలుసుకొనే తీరిక ఓపిక వారికి లేదు. కేవలం మీడియాలో ప్రచారం కోసమే కాషాయ మూకలు ఇలా చెలరేగిపోతున్నాయి. సంస్కృతి అంటూ గొంతు చించుకుంటున్నాయి.

పోలీసులైతే ప్రేమికులకు రక్షణ కల్పించాలో లేక కౌన్సెలింగ్‌ ఇవ్వాలో తెలీక తికమక పడుతున్నారు. పర్సనల్‌ విషయాల్లోకి ఇతరుల జోక్యం కూడదంటుంది మన రాజ్యాంగం, చట్టం. ఇదే సమయంలో మన సంప్రదాయాలను పాటించాలని కూడా చెబుతుంది. సరుకుల అమ్మకాలు, ఎస్సెమ్మెస్‌ ఛార్జీల కోసమే పెట్టిన 'డే'ల వల్ల ప్రేమలు వికసించడం, మనసులు కలుస్తాయనుకోవడం భ్రమ. అదో పొరపాటు ధోరణి.

ఏ పనిలోనైనా స్వచ్ఛత, చిత్తశుద్ధి, విసృఖలత్వం లేకుండా చూసుకోవడమే సమాజం ముందున్న విధి. కోరి ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా అసలేంటి, ఆకర్షణ ఏంటి, నకిలీ ఏమిటి తెలుసుకొని సమకాలీన సమాజానికి తగ్గట్లు మెలగడమే యువతీ యువకుల ముందున్న కర్తవ్యం.

2 comments:

  1. actually valentines day is misunderstood in India. valentines day is celebrated to express the love between family and friends, here in USA they sell the valentines day greeting cards for parents and grand parents, teachers etc,...

    ReplyDelete
  2. 'POTLURI040'gariki thanks. good information post chesaru

    ReplyDelete