Monday, February 21, 2011

జగన్‌ 'ఫీజు పోరు'కు జనం పలచన

వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌లో చేపట్టిన 'ఫీజు పోరు' దీక్షకు జనం పలచబడ్డారు. గతంతో పోల్చితే ఎమ్మెల్యేల సంఖ్య కూడా తగ్గింది. ఫీజురీయింబర్స్‌మెంట్‌కు నిధులు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఈ నెల 18 నుండి వారం రోజులపాటు ఇందిరాపార్క్‌లో జగన్‌ దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌ శివార్లలో వరలక్ష్మి అనే ఇంజనీరింగ్‌ కాలేజి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో చేపట్టిన దీక్ష కావడంతో వేదికకు 'వరలక్ష్మి ప్రాంగణం' అని పేరుపెట్టారు. వరలక్ష్మి మరణించిన తొలి రెండు మూడు రోజుల్లోనే దీక్ష చేపట్టినట్లయితే ఊపు వచ్చేది. కాని అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాక ఒక రోజు దీక్ష చేయాలనుకున్నారు జగన్‌. ఆయన ఎత్తుగడ తీవ్రంగానే ఉంది. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు దీక్ష చేస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చనుకున్నారు. 17 నుండి సమావేశాలు జరుగుతున్నాయని, 23న బడ్జెట్‌ పెడతారని వార్తలొచ్చాక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు 18 నుండి వారంపాటు దీక్ష చేస్తానన్నారు. అంటే బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మరుసటి రోజు వరకూ జగన్‌ దీక్ష కొనసాగుతుందన్నమాట.

తొలుత ఒకరోజుకే పోలీస్‌ పర్మిషన్‌ తీసుకున్నారు. ఆ తర్వాత వారం రోజులకు దీక్షను పొడిగించారు. అయినా పోలీసులు జగన్‌ను వ్యూహాత్మకంగానే అరెస్టు చేయలేదు. అరెస్టు చేస్తే తమకే మంచిదని, మంచి పబ్లిసిటీ వస్తుందని జగన్‌ మద్దతుదార్లు అంటున్నారు. పబ్లిసిటీ జగన్‌కు ఎందుకు రావాలని ప్రభుత్వం అరెస్టు చేయట్లేదు. 22,23 తేదీల్లో తెలంగాణ జెఎసి 48 రోజుల బంద్‌కు పిలుపునిచ్చింది. ఉస్మానియా జెఎసి 21న అసెంబ్లీ ముట్టడి అంటూ హడావిడి చేసింది. బడ్జెట్‌ 23న ప్రవేశపెడుతున్నందున బంద్‌ నేపథ్యంలో జగన్‌ను అరెస్టు చేయవచ్చని పోలీసులంటున్నారు.

అరెస్టు సంగతి ఎలా ఉన్నా జగన్‌ దీక్షకు భారీగా ఏర్పాట్లు చేశారు. కలర్‌ఫుల్‌ కార్పెట్లు, జనం కూర్చోడానికి టెంట్లు, మంచినీళ్ల ప్యాకెట్లు తదితరాలను భారీగా అందుబాటులో ఉంచారు. కాని జగన్‌ దీక్షకు తొలిరోజు ఉదయం, మధ్యాహ్నం జనం వచ్చినప్పటికీ సాయంత్రం నుండి తగ్గారు. సాయంత్రం జగన్‌ మాట్లాడుతున్నప్పుడు అంతగా జనం లేరు. రెండో రోజు నుండి మరీ పలచబడ్డారు. రోజుకు రెండు నియోజకవర్గాల నుండి జనాన్ని, కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడి విద్యార్థులను తీసుకురావాలనుకున్నా సంఖ్య పలచగానే ఉంది.

జగన్‌ వెంట తొలి రోజుల్లో పాతిక మందికి తగ్గకుండా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎందుకనో పోలవరం యాత్రకొచ్చేసరికి గణనీయంగా తగ్గారు. ఫీజుపోరుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 16 మంది మాత్రమే హాజరయ్యారు. పిఆర్‌పి ఇద్దరు, టిడిపి ఎమ్మెల్యే ఒకరు పాల్గొన్నారు. అసెంబ్లీ జరుగుతుండటమో లేక ముఖ్యమంత్రి, పార్టీ అధిష్టానం బుజ్జగింపు చర్యలవల్లనో ఎమ్మెల్యేలు దూరం జరుగుతున్నారు. కొంత మంది ముఖ్యమంత్రి మీటింగ్‌కూ హాజరవుతున్నారు జగన్‌ శిబిరంలోనూ కనబడుతూ 'డ్యాన్సింగ్‌' ఆడుతున్నారు.

అయితే అసెంబ్లీలో ఫీజురీయింబర్స్‌మెంట్‌పై టిడిపి, లెఫ్ట్‌ ప్లకార్డులు పట్టుకున్నప్పుడు జగన్‌కు మద్దతుగా 14 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇద్దరు పిఆర్‌పి ఎమ్మెల్యేలు, ఒక టిడిపి ఎమ్మెల్యే ప్లకార్డులు ప్రదర్శించడం గమనార్హం. ఈ విధంగా అసెంబ్లీలో జగన్‌ మద్దతుదార్లు వ్యవహరించడం కాంగ్రెస్‌కు, ముఖ్యమంత్రికి ఇబ్బందికరమే. ఏది ఏమైనా జగన్‌ ఫీజు పోరుకు జనాలు పలచబడటానికి కారణాలేమిటనేదానిపై జగన్‌ వర్గం ఆలోచనలో పడింది.

No comments:

Post a Comment