Thursday, February 10, 2011

అసెంబ్లీలో చిరంజీవి సీటెక్కడా ?

మెగాస్టార్‌ చిరంజీవికి పెద్ద చిక్కొచ్చి పడింది. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనమైతే ఇప్పుడున్న పిఆర్‌పి ఫ్లోర్‌ లీడర్‌ పదవి కంటే ఎక్కువ గౌరవం కలిగిన పెద్ద పదవొస్తుందని ఆశించారు చిరు. భవిష్యత్తులో కేంద్రంలోనో రాష్ట్రంలోనో ఆయన మంత్రి కావొచ్చు. పార్లమెంట్‌, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలున్నందున ఆయనకు పదవి రావడానికి కనీసం రెండు నెలలన్నా పడుతుంది. అప్పటి వరకూ చిరంజీవి హౌదా ఏమిటి అన్న సందేహం సహజంగా తలెత్తుతుంది. ఒక పార్టీలో మరో పార్టీ విలీనం కావాలంటే కొన్ని న్యాయ పరమైన, రాజ్యాంగ పరమైన చర్యలు చేపట్టాలి. పార్టీ మొత్తం మరో పార్టీలో విలీనం అవుతోంది కనుక ఆ పార్టీ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేయాలి. ఎమ్మెల్యేలందరూ అదే విధంగా తీర్మానం చేయాలి. పిఆర్‌పికి చిరంజీవితో సహా 18 మంది ఎమ్మెల్యేలుండగా 16 మంది కాంగ్రెస్‌లో విలీనం కావాలని తీర్మానం చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ సమావేశానికి హాజరు కాలేదు.

రాష్ట్ర కార్యవర్గం ఏకవాక్య తీర్మానం చేసింది. ఈ సమాచారం ఎన్నికల సంఘానికి ఇవ్వాలి. అప్పుడు విలీనం అయినట్లు కొన్ని రోజులు గడువిచ్చి ఎవరికీ అభ్యంతరాలు లేకపోతే విలీనం చేస్తారు. పిఆర్‌పి ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుగా పరిగణించాలని శాసనసభకు సమాచారం పంపుతారు. ఎన్నికల సంఘం నుండి సమాచారం వచ్చాక శాసనసభలో పిఆర్‌పి ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుగా మారిపోతారు. విలీన ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ చిరుతో సహా ఎమ్మెల్యేలందరూ పిఆర్‌పి కిందే లెక్క.

విలీనానికి కొంత సమయం పడుతుందంటున్నారు పరిశీలకులు. ఈ నెల 17 నుండి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాలు పూర్తయ్యాక పిఆర్‌పి ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుగా మారిపోతారా లేక అంతకుముందే మారతారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అసెంబ్లీలో సభ్యులకు సీట్ల కేటాయింపు ఒక క్రమ పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్న పార్టీ ఫ్లోర్‌ లీడర్‌కు మొదటి వరుసలో సీట్లు కేటాయిస్తారు.

అధికారపార్టీ విషయానికొస్తే ముఖ్యమంత్రి, ముఖ్యమైన శాఖలు నిర్వహించే సీనియర్‌ మంత్రులకు మొదటి వరుసలో సీట్లు కేటాయిస్తారు. జూనియర్‌ మంత్రులు, విప్‌లు, సిఎల్పీ ముఖ్య నేతలకు, రెండో వరుసలో సీట్లు కేటాయిస్తారు. మిగిలినవారికి పేరులోని మొదటి అక్షరం బట్టి, ఎమ్మెల్యేగా సీనియార్టీని బట్టి సీట్లు కేటాయిస్తారు. ప్రస్తుతం పిఆర్‌పి ఫ్లోర్‌ లీడర్‌గా చిరంజీవి ప్రతిపక్ష బెంచీల వైపు మొదటి వరుసలో కూర్చుకుంటున్నారు. కాంగ్రెస్‌లో చేరితే ఆయన బాగా జూనియర్‌ అవుతారు. మంత్రి పదవి ఇచ్చినా ఆర్థిక, శాసనసభా వ్యవహారాలు, రెవెన్యూ వంటి కీలక శాఖలు ఆయనకు ఇవ్వకపోతే రెండు, మూడో వరుసలోనే ఆయనకు సీటు కేటాయిస్తారు.

అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేంత వరకూ మంత్రివర్గ విస్తరణ ఉండదంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. పార్టీ విలీనం ఆ లోపు జరిగితే చిరంజీవి సీటు అధికారపక్షం వైపు చివరన ఉంటుంది. అధికారికంగా ఇసి పార్టీ విలీనాన్ని ప్రకటించకపోతే పిఆర్‌పి ఫ్లోర్‌ లీడర్‌ హౌదాలో ఇప్పుడు కూర్చుంటున్న ముందు వరుస సీట్లోనే ఆయన కూర్చుంటారు. ఈ సమావేశాలు అయ్యేంత వరకూ పార్టీ అధికారికంగా విలీనం కాకపోవడమే బెటరని, లేకపోతే చిరంజీవి పరువు పోతుందని పిఆర్‌పి నేతలు వాపోతున్నారు.

No comments:

Post a Comment