Sunday, February 6, 2011

పులి నోట్లో తల..బెస్ట్ ఆఫ్ లక్ చిరు

టాలీవుడ్‌లో పాతిక ముప్పై ఏళ్లపాటు ఎదురు లేకుండా మెగాస్టార్‌గా వెలుగొందిన చిరంజీవి రాజకీయాల్లో ఎక్‌స్ట్రా ప్లేయరని పేరు తెచ్చుకున్నారు. సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ, అవినీతిపై పోరాటం... ఇవి చిరంజీవి ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజారాజ్యం నినాదాలు. టిడిపికి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయమని ముందుకొచ్చింది పిఆర్‌పి. కాంగ్రెస్‌ అవినీతిపై ఎన్నికల ముందు నిప్పులు చెరిగిన చిరు అంతలోనే ఆ పార్టీకి దగ్గర కావడం రాజకీయ వ్యభిచారమే అవుతుందంటున్నారు పలువురు సీనియర్‌ నేతలు. సామాజిక న్యాయం, అవినీతిపై పోరాటం అని గొంతు చించుకోవడం వల్లనే ఎన్నికల్లో ఆ మాత్రం ఓట్లు, సీట్లు పిఆర్‌పికి వచ్చాయి. ఇప్పుడు ఆ నినాదాలను పక్కనబెట్టి కేవలం పదవుల కోసమే కాంగ్రెస్‌ పంచన చేరుతున్నారు మెగాస్టార్‌. ముఖ్యమంత్రి పదవిని ఆశించిన చిరంజీవి స్వయంగా తానే పాలకొల్లులో ఓటమిని చవిచూసి భంగపడ్డారు.

ఎన్నికల తర్వాత పిఆర్‌పిని నడపడం చిరంజీవికి తలకు మించిన భారమైంది. సినిమా పరిశ్రమలో సక్సెస్‌, నోట్లు లెక్కపెట్టుకోడానికే అలవాటు పాడిన చిరు, ఆయన కుటుంబానికి రాజకీయాలు ఎంతమాత్రం సూటు కాలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవడం బెటరనుకున్న మెగాస్టార్‌ ఏవో కొన్ని పదవులు, తాయిలాలకు తలొగ్గి కాంగ్రెస్‌తో దోస్తికి ఉవ్విళ్లూరుతున్నారు. రాష్ట్రంలో జగన్‌ వల్ల పార్టీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోడానికి పావులు కదుపుతోంది కాంగ్రెస్‌. బకరా కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్‌కు చిరంజీవి వాటంగా దొరికారు. అంతే చిరంజీవితో స్నేహానికి కాంగ్రెస్‌ తహతహలాడుతోంది.

కాంగ్రెస్‌ చరిత్ర తెలిసిన వారెవరైనా దానితో అంటకాగడానికి భయపడతారు. తన దగ్గరకొచ్చిన పార్టీలను మింగేయడం, నేతలను తమలో కలుపుకొని జీరోలుగా మార్చి తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడం, కుదుర్చుకున్న అగ్రిమెంట్లను తుంగలో తొక్కడం నూట పాతికేళ్ల కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ అనుభవం కళ్లముందు మెదులుతూనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి.

విలీనం/మద్దతు ఏదైనా సరే పిఆర్‌పి తెలిసి తెలిసి కాంగ్రెస్‌పై ఆధారపడటం అంటే 'కుక్క తోక పట్టుకొని గోదారి ఈదాలనుకోవడమే'. మరో విధంగా చెబితే పులి నోట్లో తల పెడుతున్నారు చిరంజీవి. బతికి బట్ట కడతారో లేక బలై పోతారో కాలమే నిర్ణయిస్తుంది. చిరూకి 'బెస్ట్‌' ఆఫ్‌ లక్‌ అవుతుందో బ్యాడ్‌ పిరియడ్‌ స్టార్ట్‌ అవుతుందో వేచి చూడాల్సిందే.

1 comment:

  1. డైరెక్టుగా జెండా పీకేస్తే పరువు పోతుందని ఇలా కలిపేస్తున్నారేమో?

    ReplyDelete