Tuesday, March 1, 2011

ఉప్పు, నిప్పు ఒకటయ్యాయా?

ఉప్పు, నిప్పు ఒకటి కావడం విన్నారా కన్నారా? రాజకీయాల్లో మాత్రం ఇది నిజం అవుతుంది. అంతేకాదు ఎవరు ఎప్పుడు ఉప్పు, నిప్పుగా మారతారో కూడా అర్థం కాకుండా ఉంది. తెలంగాణాలో ఉప ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ వరంగల్‌ జిల్లాలో ఓదార్పు యాత్రకు మహబూబాబాద్‌ బయలు దేరిన రోజు చోటు చేసుకున్న ఘటనలను ఇంకా జనం మర్చిపోలేదు. వారి కళ్లెదుట కదలాడుతూనే ఉన్నాయి. అప్పుడు జగన్‌ కాంగ్రెస్‌లోనే ఎంపీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి అడ్డం నిలువు వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని టిఆర్‌ఎస్‌ గతంలో విమర్శలు చేసింది. వారికి కాంగ్రెస్‌లోని తెలంగాణ సీనియర్‌ లీడర్లు కొందరు వంత పాడారు. 

పచ్చి సమైక్యవాది కుమారుడైన జగన్‌ను తెలంగాణాలో తిరగనియ్యబోమని టిఆర్‌ఎస్‌ భీష్మ ప్రతిజ్ఞ చేసింది. మహబూబాబాద్‌ రణరంగమైంది. చివరికి జగన్‌ను పోలీసులు మధ్యలోనే అరెస్టు చేశారు. జగన్‌ ఆ విధంగా మహబూబాబాద్‌ వెళ్లడం తప్పని సోకాల్డ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్లు విమర్శలు చేశారు. లోక్‌సభలో జగన్‌ సమైక్యవాద ప్లకార్డు చూపినందుకు టిఆర్‌ఎస్‌, అదే సోకాల్డ్‌ సీనియర్లు తీవ్రంగా మండి పడ్డారు.

సీన్‌కట్‌ చేస్తే... ఇప్పుడు జగన్‌, టిఆర్‌ఎస్‌ మధ్య భావసారూప్యం ఏర్పడినట్లు కన్పిస్తోంది. ఆ మధ్య ఒకానొక టీవీ ఛానల్‌లో ఒక సర్వే ప్రసారమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే సీమాంధ్రలో జగన్‌, తెలంగాణాలో కెసిఆర్‌ లాభపడతారన్నది ఆ సర్వే సారాంశం. ఆ సర్వే నిజం కావొచ్చు. ఏదేని ఉద్దేశం కడుపులో పెట్టుకొని సర్వే చేసి ఉంటే ఆ ఛానల్‌ అంచనా నిజం కాకపోవచ్చు. కాని ఆ సర్వే ప్రసారమైన దగ్గర నుండి పరిణామాలను గమనిస్తే టిఆర్‌ఎస్‌, జగన్‌ మధ్య ఐక్యత ఏర్పడినట్లు అనుమానం కలుగుతోంది. ఒకప్పటి ఉప్పు, నిప్పు కాస్తా ఉప్పు, నీరైనట్లు తెలుస్తుంది.

అంతగా జగన్‌, కెసిఆర్‌లో పరివర్తన ఎందుకొచ్చిందో స్పష్టం కాకపోయినప్పటికీ ఇద్దరికీ ప్రస్తుతం కాంగ్రెసే ఉమ్మడి శత్రువు కాబట్టి శత్రువు, శత్రువు కలిసి మిత్రులు అయి ఉండొచ్చు. అయితే కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉన్నందున ఇస్తే గిస్తే అదే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి. గతం నుండి చూస్తే సోనియాగాంధీ, కేంద్రం తమకు అనుకూలంగా ఉన్నట్లు, రాష్ట్రంలోని సీమాంధ్ర నేతల సారధ్యంలోని ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యతిరేకం అన్నట్లు టిఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. అలాంటప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న జగన్‌తో దోస్తీ కడితే టిఆర్‌ఎస్‌కే నష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇంతకాలం తెలంగాణాలోని కాంగ్రెస్‌ సీనియర్లు కెసిఆర్‌ను అడ్డుపెట్టుకొని జగన్‌ను సాధించారు. ఇప్పుడు కెసిఆర్‌, జగన్‌ ఒక్కటయ్యేసరికి వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. కెసిఆర్‌తో దోస్తీ కటీఫ్‌ చేయాలనే ఆలోచనలో ఆ నేతలు ఉన్నట్లు కనబడుతుంది. కెసిఆర్‌తో దోస్తీ కటీఫ్‌ చేస్తే మరుసటి రోజు నుండి తెలంగాణాలో ఛీత్కారాలు, నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. టిఆర్‌ఎస్‌తో తిగిరితే జగన్‌తో తిరుగుతున్నారని భావించి కాంగ్రెస్‌ అధిష్టానం ఎక్కడ మందలిస్తుందోనన్న భయం.

వైఎస్‌ను, జగన్‌ను తిట్టడం వల్లనే అధిష్టానం వద్ద పలుకుబడి, పదవులు సంపాదించిన నేతలకు ఈ పరిస్థితి మింగుడు పడట్లేదు. ఇక జగన్‌ను ఎదగనివ్వకూడదన్న ఆలోచనతో కిరణ్‌కుమార్‌ సర్కార్‌పై అంతగా దూకుడుగా పోవద్దనుకున్న టిడిపికి టిఆర్‌ఎస్‌, జగన్‌ భావసారూప్యత ఇబ్బంది పెడుతుంది. తెలంగాణాలో ఇప్పటికే ఇరకాటంలో ఉన్న టిడిపికి ఈ పరిణామం మరింత ఇరకాటంలో నెడుతుంది. ఇదీ సంగతి. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తులు, అవకాశ వాదం...

3 comments:

  1. జై తెలంగాణా...!
    జై జై తెలంగాణా ...!!

    జోర్‌ సే బోలో... ప్యార్‌ సే బోలో...
    జై తెలంగాణా... జై తెలంగాణా...!

    మా నీళ్లు ... మాకు గావాలె.
    మా ఉద్యోగాలు ... మాకు గావాలె !!
    మా నిధులు ... మాకు గావాలె !!
    మా తెలంగాణా ... మాకు గావాలె !!!!!

    ఔర్‌ ఏక్‌ ధక్కా........ తెలంగాణా పక్కా...!

    ఆగదు ఆగదు ఆగదు తెలంగాణా పోరు ఆగదు
    సాగదు సాగదు సాగదు ఆంధ్రోళ్ల పాలన ఇక సాగదు

    వాడెవ్వడు వీడెవ్వడు...? తెలంగాణాకు అడ్డెవ్వడు...??
    తెలంగాణాకు అడ్డొస్తే ... అడ్డంగా నరికేస్తాం...!!

    జోహార్‌ తెలంగాణా విద్యార్థి అమరవీరులకు..
    జోహార్‌ జోహార్‌!

    ReplyDelete
  2. రాజకీయ ఎత్తుగడలు పన్నాగాలూ ఎన్ని ఉన్నా వైయస్ తెలంగాణాకు తీవ్ర వ్యతిరేకి. జగన్ దీ అదే బాట. ఇప్పుడు పార్టీ మారినా జగన్ పందా మారితే అది అవకాశవాదమే తప్ప తెలంగాణా మీద ప్రేమ కాదు. జగన్ తో కెసిఆర్ దోస్తీ ప్రభుత్వాన్ని ఇరకాట పెట్టడానికే అయినా తెలంగాణా వాదులకు అది ఏమాత్రం నచ్చని విషయం.

    ReplyDelete
  3. జగన్ టిఆరెస్‌తో సీట్ల సర్దుబాటు చేసుకుని తెలంగాణాలో పోటీ చేయాలి :P
    మీరు వర్డ్ వెరిఫికేషన్ తీసేస్తే బాగుంటుందేమో.

    ReplyDelete