Sunday, March 27, 2011

ప్రజలే వెర్రి వెంగళప్పలు!

ప్రభుత్వ భూములను తమకు ఇష్టమైన వారికి అప్పనంగా పందేరం చేసిన వ్యవహారం ఉభయ సభలనూ కుదిపేస్తోంది. శాసనసభలోనైతే వారం రోజులుగా ఈ అంశంపై చర్చ లేకుండానే రగడ జరుగుతోంది. వాస్తవానికి వైఎస్‌ బతికుండగానే, గత శానసభలో చాలాసార్లు భూపందేరంపై చర్చ జరిగింది. అప్పటి స్పీకర్‌ సురేష్‌రెడ్డి మీద టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజున సుదీర్ఘంగా సాక్షిలో పెట్టుబడులపైనా చర్చ జరిగింది. మన 'ప్రజాస్వామ్యం'లో ఎన్ని చర్చలు జరిగినా దోషులపై పెద్దగా చర్యలుండవు. ఆ సంగతి ప్రజలకూ, పార్టీలకు తెలుసు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో మళ్లీ భూపందేరంపై చర్చకు టిడిపి పట్టుబట్టింది. జగన్‌కు హైకోర్టు, ఐటి నోటీసులు జారీ చేయడం, జగన్‌ కాంగ్రెస్‌ నుండి వీడటంతో మరొకసారి సెజ్‌లు, భూముల పందేరం తెరమీదికొచ్చింది. సమర్ధవంతంగా చర్చ జరిగి అక్రమార్కులను గుర్తించి చర్యలు తీసుకుంటే ఎవరూ కాదనరు. అలాగే ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తే అందరికీ సమ్మతమే. కాని ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం ప్రధాన పార్టీలు, నేతల పాకులాట రోత పుట్టిస్తోంది.

అసెంబ్లీ ప్రొసీజర్‌ తెలిసిన వారెవరికైనా చర్చ ఎలా జరుగుతుందో తెలుసు. ఒక అంశంపై ఏ నిబంధన కిందైనా చర్చకు స్పీకర్‌ అనుమతిస్తే దానిపై ప్రభుత్వం పక్షాన మంత్రి లేదా ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారు. లేదా అన్ని పార్టీల తరఫునా చర్చ పూర్తయ్యాక మంత్రి లేక సిఎం సమాధానం చెబుతారు. ఉప ప్రశ్నలు, క్లారిఫికేషన్స్‌కు పార్టీలకు అనుమతిస్తారు. అప్పటికీ ప్రతిపక్షాలకు ప్రభుత్వం చెప్పిన సమాధానం అసంతృప్తి కలిగిస్తే వాకౌట్‌, నిరసన వంటి కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి. ఒకవేళ చర్చను ప్రతిపక్షాలు సా..గదీస్తుంటే ప్రభుత్వమే ఆ అంశంపై చర్చను ముగించే వీలుంది. సిపిఐ, విజిలెన్స్‌, న్యాయవిచారణ, సభాసంఘం ఏదేని విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తే ప్రభుత్వం ఒప్పుకుంటే విచారణ జరుగుతుంది. విచిత్రంగా టిడిపి ఎటువంటి చర్చ లేకుండా వైఎస్‌ హయాంలో భూపందేరం, సాక్షిలో పెట్టుబడులపై సంయుక్త సభా సంఘాన్ని (జెఎల్సీ) వేయాలని పట్టుబడుతోంది. చర్చ అయ్యాక చూద్దామంటోంది ప్రభుత్వం. ఈ వరస వారం నుండి కొనసాగుతోంది. ఎటువంటి కార్యక్రమాలూ సభలో జరగట్లేదు. ఎలాగొలా చర్చ తర్వాత అప్పటికీ ప్రభుత్వ సమాధానంపై సంతృప్తి కలగకపోతే అప్పుడు సభాసంఘం వేస్తామని శుక్రవారం సర్కార్‌ మెట్టుదిగినట్లు నటించింది. నిజానికి ఈ మాట వారం క్రితమే అంటే ఇన్ని రోజులు గొడవ జరిగేదికాదు. ప్రజా సమస్యలపై చర్చ లేకుండా ఉంటే కాంగ్రెస్‌కే లాభం. అందుకే కాలం గడిపింది. ఇక జగన్‌ గ్రూపును కట్టడి చేయాలంటే టిడిపి వాళ్లు ఎంత గొడవ చేస్తే అంత తమకు మంచిదని కాంగ్రెస్‌ భావించింది.

సభాసంఘం వేస్తామని సర్కార్‌ సంకేతం ఇవ్వడంతో జగన్‌ గ్రూపు ఎమ్మెల్యేలు మరో రూట్‌లో సభను స్తంభింపజేశారు. బాబు హయాంలో జరిగిన భూపందేరాలనూ సభాసంఘం పరిధిలోకి తెచ్చి విచారించాలని పట్టుబట్టడంతో శనివారం కూడా సభ జరగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు జగన్‌ గ్రూపు సహకరించినందుకో ఏమో ఎంఐఎం ఎమ్మెల్యేలు వక్ఫ్‌ భూములపై సైతం విచారించాలని సభను స్తంభింపజేశారు. ఇక్కడ ఎంఐఎం, జగన్‌ గ్రూపు మ్యాచ్‌ ఫిక్స్‌ అయినట్లు స్పష్టమవుతుంది. తొలి వారం రోజులూ కాంగ్రెస్‌, టిడిపి మ్యాచ్‌ ఫిక్స్‌ చేసుకొని జగన్‌ను ఇబ్బంది పెట్టేందుకు సభను అడ్డుకున్నట్లు అర్థమవుతుంది. జగన్‌ గ్రూపు వ్యూహాత్మకంగా ఐఎంజి భారత, చిత్తూరు డైరీ- హెరిటేజ్‌ వ్యవహారం ముందుకు తెచ్చింది. ఈ అంశాలను గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సభలో చర్చకు తీసుకొచ్చారు. సభాసంఘం కూడా వేయించారు. ఇప్పుడు టిడిపి-కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ను బయట పెట్టడానికి జగన్‌ గ్రూపు ఆ అంశాలను ప్రస్తావిస్తోంది. అలాగే గత స్పీకర్‌ సురేష్‌రెడ్డిపై టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి రెండు అంశాలపై చంద్రబాబుపై దాడి చేశారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలో చంద్రబాబు ఇల్లీగల్‌గా స్థలం కొనుగోలు చేశారని ఆధారాలను సభలో చూపారు. అలాగే రజనీకాంత్‌ సినిమాలో వలే ఇతర దేశాల నుండి ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌కు ఇల్లీగల్‌గా నిధులొస్తున్నాయన్నారు.

కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ జగన్‌ ఆస్తులు, పెట్టుబడులు, భూపందేరంపై ఏ విచారణకైనా ఆదేశించవచ్చు. దీనికి టిడిపితో మ్యాచ్‌ ఫిక్స్‌ అయి సభను స్తంభింపజేయాల్సిన అవసరం లేదు. అలాగే తాము సచ్ఛీలురమని ప్రజలకు తెలియాలంటే జగన్‌ కాని, చంద్రబాబు కాని తమపై ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామన్న సంకేతం ఇవ్వాలి. ఇప్పుడు జగన్‌ ఆస్తులపై మాట్లాడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని చాలా మంది మంత్రులు భూపందేరం చేసిన వైఎస్‌ జమానాలో కూడా పని చేశారు. ఆ ఆక్రమాలకు ఆ మంత్రులూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. విచారణ అంటూ జరిగితే ఆ మంత్రులపైనా విచారణ జరగాలి. భూపందేరంపై నిజంగా విచారణ జరిపించే దమ్ము కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేదనే చెప్పాలి. ఆనాడు అన్నీ తానై షాడో సిఎంగా చక్రం తిప్పి ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలకు డబ్బు సూట్‌కేస్‌లు పంపిన కెవిపి రామచంద్రరావు ప్రస్తుతం జగన్‌ పక్కన లేరు. విచారణ జరిపితే కెవిపి కూడా దోషి అవుతారు. మంత్రులు దోషులవుతారు. ఆ మాటకొస్తే సూట్‌కేసులు తీసుకున్న ఢిల్లీ పెద్దలూ దోషులే. అందరూ దొంగలే అయితే ఇంకా చర్చ ఉండదు విచారణ అసలే ఉండదు దోషులు బయటకు రారు. సభలో పార్టీలు ఆడుతున్నది డ్రామా రాజకీయలబ్ధికి పాకులాట..అంతే! నేతల నాటకాలు చూస్తున్న ప్రజలే వెర్రి వెంగళప్పలు...

1 comment: