Wednesday, March 16, 2011

కోత కాదు రిలీఫ్‌

అదేదో సినిమాలో హీరో మహేష్‌బాబు 'బుల్లెట్‌ దిగిందా లేదా అన్నదే ముఖ్యం' అన్నట్లుగా కరెంట్‌ కట్‌ అవుతుందా లేదా అన్నది మాత్రమే ప్రజలకు కావాలి. విద్యుత్‌ కోతపై మంగళవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలు వింటే మహేష్‌బాబు సినిమాలోని పై డైలాగ్‌ గుర్తుకొస్తుంది. రాష్ట్రంలో ఎడాపెడా కరెంట్‌ కోతలు పెడుతున్నారు. రాజధాని హైదరాబాద్‌లోనే అధికారికంగా గంటసేపు కట్‌ అమల్లో ఉంది. హైదరాబాద్‌ శివారు మున్సిపాలిటీల్లో రోజుకు 2-3 గంటలు కోత కోస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో మూడు గంటలు, మండల కేంద్రాల్లో ఐదారు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో పది గంటల విద్యుత్‌ కోత అమలవుతోంది. ట్రాన్స్‌కో, డిస్కం అధికారులు అధికారికంగా కోతల వేళలు ప్రకటించారు.

ముఖ్యమంత్రి మాత్రం అసలు రాష్ట్రంలో కరెంట్‌ కోత ఉందా అన్నట్లు అసెంబ్లీలో అమాయక ఫేస్‌ పెట్టారు. చివరికి అవి కోతలు కావు రిలీఫ్‌లంటూ మసిపూసే ప్రయత్నం చేశారు. డిమాండ్‌ పెరిగినప్పుడు లోడ్‌ రిలీఫ్‌ తప్పనిసరని సెలవిచ్చారు. కరెంట్‌ వైర్లకు రిలీఫ్‌ ఇవ్వడమంటే కోత పెట్టడమే కదా? కోతలను ఒప్పుకోకుండా ఈ రిలీఫ్‌ మాయ ఏమిటో అర్థం కాదు. విద్యుత్‌ కోత వల్ల మండుతున్న ఎండలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. రైతులు ఎప్పుడు కరెంటు ఉంటుందో తెలీక అవస్థలు పడుతున్నారు. పంటలు ఎండుతున్నాయి. పరిశ్రమలు మూతబడుతున్నాయి. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

వేసవిలో డిమాండ్‌ ఉంటుందని తెలిసినప్పుడు పొరుగు రాష్ట్రాల నుండి విద్యుత్‌ను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ముందస్తు చర్యలు చేపట్టలేదు. కేంద్రం మనకు ఇచ్చే వాటాలో కోత విధించినా కాంగ్రెస్‌ ఎంపీలు నోరు మెదపట్లేదు. మనవాడు జైపాల్‌రెడ్డి ఇంధన మంత్రిగా ఉన్నా గ్యాస్‌ సరఫరా నిలిచిపోయింది. ప్రాంతీయ గొడవల్లో కాలుదువ్వే మన రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలు ఇటువంటి విషయాల్లో మౌనమే మా భాష అంటారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు సిఎం రిలీఫ్‌ మంత్రం జపిస్తున్నారు. చంద్రబాబును నిత్యం తిట్టిపోసే కాంగ్రెస్‌ నేతలూ రిలీఫ్‌ సమయంలో కరెంట్‌ తీగలపై బట్టలు ఆరేసుకోవచ్చన్న సంగతి మర్చిపోకండి...

9 comments:

  1. కరెంట్ కట్ చెయ్యాల్సిన అవసరం ఎందుకు వస్తున్నది? అనవసర విద్యుత్ వాడకం!! అవిరామంగా 24 గంటలూ దాదాపు ప్రతి ఇంట్లోనూ మోగుతున్న టివి, అవసరం ఉన్నా లేకున్నా, అందులో ఉంచాల్సిన వస్తువులు ఉన్నా లేకున్నా, పూర్తిగా ఖాళీగా ఉన్నా సరే 365 రోజులూ వాడబడుతున్న రిఫ్రిజిరేటర్లు.

    నాకు చాలా ఆశ్చర్యం కలిగేది ఏమంటే, సోలార్ ఎనర్జీ విషయంలో మనం ఎంతో ఎనర్జీ రిచ్. ప్రభుత్వం కాని, ఆ సోలార్ ఎనర్జీ సంస్థలు కాని, ఈ అద్భుత సౌకర్యాన్ని అందరి ఇళ్ళల్లో ఏర్పరచటానికి ఏ విధమైన చర్యలూ తీసుకోవటంలేదు. అవును, సోలార్ ఎనర్జీ ఖర్చుతో కూడుకున్న విషయమే కాని ముందు పెట్టవలసిన పెట్టుబడి అతి తక్కువ కాలంలో రాబట్టుకోవచ్చు. ఆ పైన మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఇళ్ళల్లోనూ సోలార్ ఎనర్జీ వాడకం చెయ్యగలిగితే, వాటికి కావల్సిన వస్తువుల ధరవరలు తగ్గే అవకాశం ఉన్నది.

    ఈ విషయంలో కొన్ని సూచనలు:

    1. బట్టల కొట్లవాళ్ళకు బయటి కరెంటు కనెక్షన్ ఇవ్వ కూడదు. వాళ్ళు తప్పనిసరిగా సోలార్ ఎనర్జీనే వాడాలి. ఒక్క మీటరు గుడ్డ అమ్మటానికి వాళ్ళు ఎన్నెన్ని లైట్లు వేస్తారు. ఆ ఖర్చంతా ఎవరు పెడుతున్నారు? మీరూ నేనూ, గుడ్డ కొన్నాప్పుడల్లా!!!
    2. అన్ని ట్రాఫిక్ లైట్లు సోలార్ ఎనర్జీతోనే నడవాలి.
    3. హోర్డింగులకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి లైట్లు అమర్చటం నిషేధించాలి. వాళ్ళు అవసరం అనుకుంటే సోలార్ ఎనర్జీని మాత్రమే వాడాలి.
    4. వీధి దీపాలు కూడా చాలావరకు సోలార్ ఎనర్జీని వాడుకునే ఏర్పాటు చెయ్యాలి. రాత్రి పన్నెండు దాటిన తరువాత, వీధి దీపాలు ఒకటి విడిచి మరొకటి మాత్రమే వెలిగే ఏర్పాటు చెయ్యాలి. మైళ్ళ కొద్దీ ఖాళీ రోడ్లకు అటు ఇటూ వందల కొద్ది విద్యుత్ దీపాలు రాత్రంతా వేసి ఉంచాల్సిన అవసరాన్ని ఒకసారి రివ్యు చేసి నిర్ణయం తీసుకోవాలి.
    5. గృహాల్లో టి.వి, రిఫ్రిజిరేటర్లకు తప్పనిసరిగా సోలార్ ఎనర్జీనే వాడాలి. విద్యుత్ వాడకాన్ని ఈ ఉపకరణాలకు నిషేధించాలి. కాదని వాడిన వాళ్ళకు భారీగా జరిమానా విధించి, విద్యుత్ కనెక్షన్ ఆరు నెలలు తీసెయ్యాలి. దీంతో లంచగొండితన ఇబ్బడి ముబ్బడి అయ్యి, లంచాలు ఇచ్చేబదులు, ఆ సోలార్ ఎనర్జీ వాడటమే నయం అనుకుని అందరూ మాట వింటారు. జరిమానా భారీగా ఉంచటంలో రహస్యం అది. ఇక్కడ లంచగొండులను మనం పాసిటివ్‌గా వాడుకోవచ్చు అంటే వాళ్ళ బూచిని చూపించి, ప్రజలను సవ్యమైన మార్గానికి మళ్ళించవచ్చని నా అభిప్రాయం.

    ఇవన్నీ కొంచెం కష్టతరమైన పనులైనా, ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం పాకులాడకుండా మంచి ప్లాన్ తో అమలు పరిస్తే పెద్ద విషయం ఏమీ కాదు. ఉచిత విద్యుత్ ఇస్తానని పనికిరాని చెత్త వాదనలు చేసే కంటే , సోలార్ ఎనర్జీ అమర్చుకున్న వాళ్ళకు సబ్సిడీ ఇస్తామని అంటే సమస్య శాశ్వతంగా పరిష్కరించినట్లవుతుంది.

    మనం మనకున్న అద్బుత స్వాభావిక వనరు సూర్య రశ్మి, ముఖ్యంగా వేసవిలో హాయిగా వాడుకోవచ్చు ఎంత వాడినా తరిగిపోదు.

    ReplyDelete
  2. మరొక్క సూచన

    పత్రికలు, మాగజైన్లు, టి వి చానెళ్ళు వారి వారికున్న సైజు, శక్తిని బట్టి కనీసం 50 శాతాన్నుంచి 100 శాతం వరకు సోలార్ ఎనెర్జీనే వాడి వాళ్ళ పనులు చేసుకోవాలి. ఇదేదో పత్రికా స్వాతంత్రం మీద దెబ్బ మా హక్కులు అని అల్లరి చెయ్యకుండా ఒక మంచి పని చేసి చూపిస్తే, సమాజానికి దారి చూపిన వాళ్ళు అవుతారు.

    ReplyDelete
  3. శివగారి ఆలోచనలు బాగున్నాయి. మరి అంత సోలార్ ఎనర్జీకి ఎంత ఖర్చు అవుతుంది? ఆఖర్చును వినియోగదారులమీద రుద్దరా? సోలార్ ఎనర్జీ ఫ్రీనే కాని పెట్టుబడి చాలా ఎక్కువ అని నా ఆలోచన.

    ReplyDelete
  4. @ Snkr

    వినియోగదారుడే ఆ ఖర్చు పెట్టుకోవాలి. అలా ఆ ఖర్చు పెట్టుకుని ఈ సమస్య నుండి శాశ్వతంగా బయటపడేట్టుగా ప్రభుత్వం ప్రోత్సహించాలి. అవసరమైతే సబ్సిడీలు ఇవ్వాలి. మనం పెట్టే చెత్త ఖర్చులు కొన్ని తగ్గించుకుంటే, సోలార్ ఎనెర్జీని ప్రతి ఇంట్లోనూ ఏర్పరుచుకోవటం పెద్ద కష్టమేమీకాదు. ఒక 50-60 సంవత్సరాల తరువాత ఎలాగూ ప్రపంచం మొత్తం సూర్యరశ్మి మీదనే ఆధారపడాలి. ఆ కారణాన, మన దేశం, ఆఫ్రికా దేశాలు ఇతర దేశాలనుండి (ఈ వనరు లేని దురదృష్టవంతులు) దాడులను కూడ ఎదుర్కోవాలేమో కూడ.

    ReplyDelete
  5. North India లో ఒక వూళ్ళో సోలార్ పెనల్స్ తయారు చేసే చిన్న పరిశ్రమ లాటిది ఒకాయన చాలా ఏళ్ళ క్రిందట మొదలు పెట్టారు. ఆయన సామాన్య గృహుణిలను తీసుకుని దానిలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ వూళ్ళలో వీటి వ్యాప్తికి దోహదం చేస్తున్నారు. ఈయన విదేశాల వారికి కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఆ వ్యాసం నాకు గుర్తు లేదు. మీకు ఎవరికైనా గుర్తుంటే తెలిపితే we can start from there and start something like Kiva.org to promote solar energy in Andhra Pradesh.

    ReplyDelete
  6. అన్నిటికన్నా ముఖ్యమంత్రిగారు, ఓల్డ్ సిటీ వారి చేత కరెంటు బిల్లులు కట్టించే
    ఏర్పాటు చేయండి అని ఒవైసీ గ్రూపు ఎమ్.ఎల్.ఏ లను అభ్యర్దించడం విచిత్రంగా
    వుంది!! బిల్లులు కట్టకపోతే సప్లై ఆపించేయవచ్చు కదా?!

    ReplyDelete
  7. SurEkha gaaroo. Good question. But where are the guts for any Government to do that. If its done what happens to the secular credentials of the Country!!

    తెలుగులో మనకి ఓ సామెత ఉన్నది ఆయనే ఉంటే ...... అని.

    ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించగలిగితే అంటే రాజకీయ దృష్టి లేకుండా, అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయి.

    ReplyDelete
  8. Some info on Solar energy:

    http://manchupallakee.blogspot.com/2010/05/blog-post_17.html

    please feel free to contact me if you want more info.

    ReplyDelete
  9. Let us form a solar energy group and prepare to do it without depending upon the government. At least we can show the way. I am ready.

    ReplyDelete