వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ ప్రకటన ఈ నెల 10న తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ నోటి నుండి వెలువడింది. సరిగ్గా ఆ సమయంలోనే హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్‌పై జరిగిన మిలియన్ మార్చ్‌లో తెలుగు వైతాళికుల విగ్రహాల విధ్వంసం జరిగింది. మిలియన్ మార్చ్‌ను నిర్వహించిన తెలంగాణ రాజకీయ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం, టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సైతం విగ్రహాల విధ్వంసాన్ని తొలుత ఖండించారు. మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చిన బిజెపి, సిపిఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీతో పాటు మార్చ్‌కు సంపూర్ణ మద్దతు పలికిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు, తెలంగాణ టిడిపి ఫోరం నేతలు, సిపిఐ నేతలు సైతం విగ్రహాల ధ్వంసాన్ని తప్పుబట్టారు. ఆ పార్టీలతో పాటు మార్చ్‌కు దూరంగా ఉన్న పార్టీలు, నేతలు, కవులు, కళాకారులు అందరూ విగ్రహాల విధ్వంసంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీమాంధ్ర వారు ఒక రకంగా, తెలంగాణ వారు మరో రకంగా విగ్రహాల ధ్వంసంపై ఖండించారు. ఎందుకనో జగన్, ఆయన మద్దతుదార్లు విగ్రహాల విధ్వంసంపై పెదవి విప్పలేదు. ఒక వ్యక్తిగా జగన్ ఉన్నప్పుడు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్, కృష్ణా ట్రిబ్యునల్, రైతులు, చేనేత కార్మికులు, శ్రీకాకుళం జిల్లాలో పోలీస్ కాల్పులు తదితర అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. ఎందుకనో విగ్రహాల విధ్వంసంపై ఆయన మౌనం దాల్చారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన వెలువడిన జగ్గంపేటలోనే విగ్రహాల ధ్వంసంపై జగన్ తన అభిప్రాయం చెబితే బాగుండేది. ఆ పని చేయలేదు. తర్వాతిరోజు పార్టీ జెండా ఆవిష్కరణ రోజు ఇడుపాయలో కూడా స్పందించలేదు. పార్టీ ఏర్పాటు చేశాక రాష్ట్రంలో జరిగిన ఒక రాజకీయ అంశంపై స్పందించాల్సిన బాధ్యత జగన్‌పై ఉంది. ఇప్పటి వరకూ ఆయన మాట్లాడలేదు. ఆయన పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న అంబటి రాంబాబు సైతం నోరు మెదపలేదు.
ఇప్పటికే టిఆర్‌ఎస్, జగన్ ఒకటయ్యారని ప్రచారం జరుగుతోంది. జగన్ మద్దతుదారు బాజిరెడ్డి గోవర్ధన్ ఇటీవల తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ త్వరలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం జగన్ తెలంగాణాలో పాదయాత్ర చేస్తారని ప్రకటించారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో ఓదార్పుయాత్రను అడ్డుకున్న టిఆర్‌ఎస్ తెలంగాణాలో జగన్ పాదయాత్ర చేస్తారని చెప్పినా పట్టించుకోలేదు. దీన్నిబట్టి టిఆర్‌ఎస్, జగన్ మధ్య ఏదైనా అండర్‌స్టాండింగ్ జరిగిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణాలో టిఆఆర్‌ఎస్, సీమాంధ్రలో జగన్ స్వీప్ చేస్తారని కొన్నాళ్ల క్రితం కెసిఆర్ అన్నారు. జగనేమో టిఆర్‌ఎస్ పట్ల ఒకింత సానుకూలంగా ఉన్నట్లు కనబడుతోంది. వీరిద్దరి మధ్య సయోధ్య జరిగిందన్న అనుమానాలకు ఈ పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి.
No comments:
Post a Comment