బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వాని గురువారం లోక్‌సభలో కెసిఆర్‌కు పెద్ద షాక్ ఇచ్చారు. లోక్‌సభలో బైఠాయించి సభకు అంతరాయం కలిగిస్తున్న టిఆర్‌ఎస్ ఎంపీలు కెసిఆర్, విజయశాంతి వైఖరిపై అద్వాని అసహనం వ్యక్తం చేశారు. ఈ రకంగా సభను అడ్డుకుంటే ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగే ఉద్యమానికి మద్దతిస్తున్న శక్తుల్లో వ్యతిరేక భావం ఏర్పడుతుందని పరోక్షంగా హెచ్చరించారు. బిజెపి ఫ్లోర్‌లీడర్ సుష్మ టిఆర్‌ఎస్ ఎంపీలకు మద్దతిస్తూ మాట్లాడగా అద్వాని అందుకు భిన్నంగా స్పందించడంతో కెసిఆర్ ఇరకాటంలో పడ్డారనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం బిల్లుకు బిజెపి మద్దతిస్తానంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముందుకొస్తే రాష్ట్రం ఏర్పడుతుందని కెసిఆర్ చెబుతూ వచ్చారు. ఇప్పుడు అద్వాని తమకు వ్యతిరేక భావం రాకుండా నడుచుకోవాలని కెసిఆర్‌కు పరోక్షంగా హెచ్చరిక చేశారు.
అద్వాని ఎందుకు అంతగా స్పందించారనేదానిపై భిన్నమైన వాదనలు వినపడుతున్నాయి. లోక్‌సభలో కెసిఆర్ ఆందోళకు ఒక్క బిజెపియే మద్దతిస్తే ఒక రకంగా ఉండేది. కెసిఆర్‌ను, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉపయోగించుకొని తెలంగాణలో బలపడాలని బిజెపి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ను ఎంతగా నిలదీస్తే అంతగా బిజెపికి లాభం. కాని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు మూకుమ్మడిగా లోక్‌సభలో కెసిఆర్ చేపట్టిన ఆందోళనకు మద్దతిస్తూ ఆందోళన చేయడంతో బిజెపి ఆత్మరక్షణలో పడింది. అందుకే అద్వాని కలగజేసుకోవాల్సి వచ్చింది.
కాంగ్రెస్‌తో కలిస్తే, బిజెపి మద్దతు ఉండదు అని ఆయన కెసిఆర్‌ను పరోక్షంగా హెచ్చరించారు. దేశంలో రెండు పెద్ద పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బిజెపి ఒకే అంశంపై కలిసి పని చేయడానికి ఇష్టపడవు. అందుకే రెండు పార్టీలు కలవకుండా విన్యాసాలు చేస్తున్నాయి. అణుఒప్పందం, వినాశకర ఆర్థిక సంస్కరణలు, అమెరికాతో అంటకాగే విషయంలో మాత్రం బిజెపి, కాంగ్రెస్ కలిసే పని చేస్తాయి. రాజకీయ లబ్ధి దగ్గరకొచ్చేసరికి 'తెలంగాణ'పై మాదిరిగా వ్యవహరిస్తాయి. అది ఆ పార్టీల నైజం.
కసిఆర్ సైతం 2009 ఎన్నికల్లో మహాకూటమిలో చేరినప్పుడు బిజెపి, కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగియగానే బిజెపి ర్యాలీకి హాజరయ్యారు. ఇక అద్వాని విషయం చెప్పుకోవాల్సి వస్తే కొంచెం చరిత్రలోకి వెళ్లాలి. ఎన్డీఎ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒకసారి కేంద్ర హౌం మంత్రి, ఉప ప్రధాని హౌదాలో హైదరాబాద్‌కు వచ్చారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ ఎన్డీఎ రాష్ట్రంలో ప్రచారం చేసినందువల్ల తెలంగాణ రాష్ట్రంపై మీ వైఖరేంటని విలేకర్లు అడిగినప్పుడు అద్వాని సమాధానమిస్తూ 'మేం ఏర్పాటు చేసిన మూడు కొత్త రాష్ట్రాలూ అంతకుముందు రాష్ట్ర రాజధానికి దూరంగా ఉండేవి. ఆంధ్రప్రదేశ్ రాజధాని తెలంగాణాలో ఉండగా ఇంకా ప్రత్యేక రాష్ట్రం ఎందుకు?' అని ఎదురు ప్రశ్నించారు.
టిడిపి మద్దతుపై ఆధారపడిన ఎన్డీఎ సర్కార్ అప్పుడు ఆ విధంగా మాట్లాడి ఉంటుంది. అద్వాని ఆనాడు చేసిన కామెంట్‌నే టిడిపి నేత చంద్రబాబు ఇప్పుడు గుర్తు చేశారు. అయితే అద్వాని ఆ రకంగా అప్పుడు ఎందుకు స్పందిచారు? ఇప్పుడు బిజెపి ఎందుకు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతోంది? అని ప్రశ్నించారు తప్ప అప్పుడు తన మద్దతుపై ఎన్డీఎ సర్కార్ నడిచిందని మాత్రం చెప్పలేదు. ఇదీ ఆయా పార్టీల రాజకీయాల వెనుకనున్న మర్మం.
No comments:
Post a Comment