ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, ఫలితాలు ఒక్కో పార్టీకి ఒక్కో రకంగా గుణపాఠాలు నేర్పుతున్నాయి. ఖాళీ అయిన మూడు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలో ప్రోగ్రెసిట్ డెమక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) అభ్యర్ధులు విజయం సాధించారు. పట్టభద్రులు 46 శాతం మందే ఓటింగ్‌లో పాల్గొనడాన్నిబట్టి చదువుకున్న వారు ఎన్నికలపై నిరాసక్తత వ్యక్తం చేశారో లేక పోలింగ్ స్టేషన్‌కు వెళ్లడానికి బద్ధకించారో తెలీదుకాని 54 శాతం మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉండటంతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వెల వెలబోయింది. పోలైన ఓట్లలో పిడిఎఫ్ అభ్యర్ధులు గెలవడాన్నిబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రజా సమస్యలపై గళమెత్తే అభ్యర్ధులకు పట్టభద్రులు ఓటేశారని అర్థమవుతుంది. ఇక మూడు టీచర్ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో పిఆర్‌టియు బలపర్చిన ఇద్దరు అభ్యర్ధులు, యుటిఎఫ్ మద్దతుతో పిడిఎఫ్ అభ్యర్ధి ఒకరు గెలుపొందారు. ఏది ఏమైనా తమ సమస్యలపై పోరాడిన వారిని టీచర్లు ఎన్నుకున్నట్లు అనిపిస్తుంది.
ఎమ్మెల్సీ కోటాలో ఖాళీ అయిన పది ఎమ్మెల్సీల ఎన్నిక చివరి వరకూ రసవత్తరంగా జరిగింది. పది స్థానాలకు 12 మంది అభ్యర్ధులు పోటీలో ఉండటంతో పోలింగ్ అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో ఒక రకంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్, పిఆర్‌పి, ఎంఐఎం కలిపి ఏడుగురిని బరిలోకి దించగా, టిడిపి, లెఫ్ట్, లోక్‌సత్తా కలిపి నలుగురిని బరిలో నిలబెట్టాయి. టిఆర్‌ఎస్, బిజెపి కలిసి ఒక అభ్యర్థిని రంగంలోకి దించాయి. కాంగ్రెస్ ప్రతిపాదించిన ఏడుగురూ గెలుపొందారు. వీరిలో కాంగ్రెస్ ఐదుగురు, ఎంఐఎం ఒకరు, పిఆర్‌పి ఒకరు ఉన్నారు. టిడిపి నలుగురిని నిలబెడితే ముగ్గురే గెలిచారు. టిడిపి ఇద్దరు, సిపిఐ ఒకరు గెలిచారు. టిడిపికి చెందిన మరో అభ్యర్థి ప్రతిభా భారతి ఓడిపోయారు.
టిఆర్‌ఎస్ పరిస్థితి విచిత్రం. టిఆర్‌ఎస్‌కు బిజెపి కలిపి 13 ఓట్లు ఉన్నాయి. టిడిపి రెబల్ ఎమ్మెల్యే పోచారం టిఆర్‌ఎస్‌కే ఓటేస్తారని ప్రచారం జరిగింది. దీనితో 14 ఓట్లు టిఆర్‌ఎస్ అభ్యర్థికి పడాలి. కాని 11 ఓట్లే పడ్డాయి. బిజెపి తన రెండు ఓట్లూ టిఆర్‌ఎస్‌కే వేశానంటోంది. పోచారం సంగతి తెలీలేదు. ఒక వేళ బిజెపి టిఆర్‌ఎస్‌కు ఓటేసి ఉంటే టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 11 మందిలో ఇద్దరు ఎవరికి ఓటేశారు? అసలు బిజెపి నిజంగా టిఆర్‌ఎస్‌కే ఓటేసిందా?
ఇక జగన్ గ్రూపు ఎమ్మెల్యేలు కిరణ్ ప్రభుత్వానికి ఝలక్ ఇవ్వాలనుకున్నారు. కాని వారి వ్యూహం ఫలించలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి తాను ప్రతిపాదించిన ఏడుగురినీ గెలిపించుకున్నారు. జగన్ గ్రూపు ఎత్తు పారలేదు. పదవి కోసమో ఏమో బుద్ధిగా ఎన్నికల్లో పాల్గొని ఓటేశారు. ఇక టిడిపి బోల్తా పడింది. సంకీర్ణ ధర్మంలో సిపిఐకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి తన అభ్యర్థిని ఓడించుకుంది.
నిత్యం తెలంగాణ జపం చేసే టి-కాంగ్రెస్, టిడిపి తెలంగాణ ఫోరం ఎమ్మెల్యేలు చివరికి వారి పార్టీలకే ఓటేసుకున్నారు తప్ప టిఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటేయలేదు. ఓటేశానంటున్న బిజెపి నిజంగా టిఆర్‌ఎస్‌కు వేసిందో లేదో తెలీదు. బిజెపి ఓటేసి ఉంటే టిఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేసి ఉంటారు?
No comments:
Post a Comment