Friday, March 25, 2011

మొన్న పారిన పాచికలు నిన్న ఎందుకు పారలేదు?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పారిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాచికలు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పారలేదు? మొన్నటి ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలుచుకున్నప్పుడు వీరుడు సూరుడు అని సిఎంను ములగచెట్టు ఎక్కించిన మంత్రులు, నేతలు నిన్నటి ఎన్నికల్లో బొక్కబోర్లా పడిన అదే సిఎంను ఎందుకు తూలనాడుతున్నారు? కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆయనకు తొలి పరాభవం కాగా కాంగ్రెస్‌ను వీడిన జగన్‌కు తొలి విజయం. ఇక తెలుగుదేశం విషయానికొస్తే రెండు సీట్లు బోనస్‌గా వచ్చినందుకు సంతోషించాలో, కడప, చిత్తూరులో కాంగ్రెస్‌కు సహకరించినప్పటికీ జగన్‌ గెలిచినందుకు బాధ పడాలో తెలీని సంకట స్థితిలో ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు కూడా కడప జిల్లా మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి గెలుపు తమదేనన్నారు. ఇప్పుడేమో ఇవి చిన్న ఎన్నికలని, జగన్‌ డబ్బులు వెదజల్లారని మాట్లాడుతున్నారు. జగన్‌ డబ్బులు వెదజల్లారు సరే, కాంగ్రెస్‌ అసలు డబ్బులే ఖర్చు చేయలేదా? కడప సీటు కోసం అధిష్టానం పంపిన డబ్బు మొత్తాన్నీ డిఎల్‌ ఖర్చు చేయలేదని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

చిత్తూరు జిల్లా పరిస్థితి విచిత్రం. సిఎం సొంత జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమిని చవి చూడటంతో కిరణ్‌కుమార్‌ ప్రతిష్ట కాంగ్రెస్‌ అధిష్టానం వద్ద దిగజారింది. గంగాభవాని స్వయం కృతాపరాధం ఆమె ఓటమికి కారణమైంది. అనంతపురం, తూర్పుగోదావరిలో కాంగ్రెస్‌, జగన్‌ కీచులాట టిడిపికి కలిసొచ్చింది. పశ్చిమగోదావరిలోని ఒక సీటులో బలం ఉన్నందువల్ల టిడిపి గెలిచింది. జగన్‌ మూడు సీట్లతో బోణి కొట్టగా, కాంగ్రెస్‌ తొమ్మిది చోట్ల పోటీ చేసి మూడు దక్కించుకుంది. సిట్టింగ్‌ ఆరు సీట్లు మూడుకు దిగజారాయి.

సిఎం ఒంటెత్తు పోకడలే ఓటమికి కారణమంటున్నారు మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు. ఆ సంగతేమోకానీ, చిన్నా చితకా నేతలపై సస్పెన్షన్‌ వేటు వేసిన డిఎస్‌ ఇప్పుడు జెసి, పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకునే సాహసం చేస్తారా? అంత దమ్ము ఆయనకుందా? జానీకి కేటాయించిన ఓట్లను క్రాస్‌ చేశారంటున్న జగన్‌ గ్రూపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోగలరా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారందరిపైనా చర్య తీసుకోగలరా? అంత సీన్‌ డిఎస్‌కు, సిఎంకు, ఆ మాటకొస్తే అధిష్టానానికి సైతం లేదు. బలహీనత ఆ పార్టీని వెంటాడుతోంది. ఓటమిపై కాంగ్రెస్‌ 'పోస్టుమార్టం' ప్రజలను, పార్టీ శ్రేణులను మభ్యపెట్టడానికేనని తెలుస్తూనే ఉంది. ఎన్నికల్లో పరాభవం ఎదరైన సిఎం మున్ముందు మరిన్ని పరాభవాలు ఎదుర్కోక తప్పదని మంత్రులే అంటున్నారు. గురువారం అధిష్టానానికి కిరణ్‌ ఏం చెప్పినా పడిన మచ్చ చెరగిపోదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా అవే ఒకోసారి నేతల జాతకాలు మారుస్తాయి.

No comments:

Post a Comment