Thursday, March 3, 2011

ఈ డ్రామాకు తెర పడేదెప్పుడు?

నిర్ణయం తీసుకోవాల్సిన వారే బహిష్కరించడమేంటి? రాజ్యాన్ని పరిపాలించే రాజే సహాయ నిరాకరణ చేయడంలా లేదూ? కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని వెలగబెడుతున్న కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఎత్తుకున్న అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ నినాదాన్ని చూస్తుంటే పై ప్రశ్న, సమాధానం సహజంగా ఎవరికైనా స్పురిస్తాయి. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంపై తీర్మానం చేయాలని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని టి-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శాసనసభను బహిష్కరించారు. టి-కాంగ్రెస్‌ వాళ్లకు ధీటుగా తాము కూడా సభను బహిష్కరిస్తామంటున్నారు సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు. ప్రతిపక్షాలు సభను బారుకాట్‌ చేస్తే ఏదో అనుకోవచ్చు. ప్రభుత్వాన్ని నడుపుతున్నవారే సభను బహిష్కరించడం వింతల్లో వింత. విడ్డూరాల్లో విడ్డూరం. అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయి? మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ననుసరించి జరుగుతాయి. మంత్రివర్గంలో ఉన్నదెవరు? కాంగ్రెస్‌ శాసనసభ్యుల్లో నుండి మంత్రులైనవారు. తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాలకు చెందిన మంత్రులూ కూర్చొని ఫలాన తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు జరుపుదామని అనుకొని ఆ సమాచారాన్ని గవర్నర్‌కు తెలియజేసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంటే కాంగ్రెస్‌ ప్రభుత్వ సమిష్టి నిర్ణయం మేరకు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలుస్తూనే ఉంది. 
 
అంతలోనే సభను బహిష్కరించారు టి-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు. వారిని చూసి తామూ సభను బహిష్కరిస్తామంటున్నారు సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు. తామే సమావేశాలు ఏర్పాటు చేసి తామే వాటిని బహిష్కరిస్తామంటున్నారంటే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఏమనాలి? ఏదో రాజకీయ లబ్ధి, స్వప్రయోజనాలను ఆశించే రెండు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బహిష్కరణ మంత్రాన్ని జపిస్తున్నారనిపిస్తుంది.

అసెంబ్లీలో తీర్మానం పెట్టాలన్నా, పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలన్నా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పని చేయకుండా, తనదంటూ ఒక అభిప్రాయం చెప్పకుండా ఈ డ్రామాలెందుకన్నదే ప్రజల ప్రశ్న. ఏడాది క్రితం వలే ఇప్పుడు మళ్లీ రాజీనామాలకు తెర తీశారు మంత్రులు. ఇంతకాలం మంత్రివర్గంలో ఉండి కాంగ్రెస్‌ చేత అభిప్రాయం చెప్పించలేని వీళ్లు రాజీనామాల పల్లవి లంకించుకున్నారు. అందులో భాగంగానే జూపల్లి కృష్ణారావు మంత్రి పదవికి రాజీనామా చేశానంటున్నారు. రాజీనామా లేఖ అసలు ప్రతిని సోనియాగాంధీకి, జీరాక్స్‌ కాపీని ముఖ్యమంత్రికి పంపామంటున్నారు. మంత్రి రాజీనామాను ఆమోదించాల్సింది మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి. ఆమోదించే వరకూ ఎంచక్కా బుగ్గకారులో మంత్రి తిరుగుతారు. సకల సదుపాయాలు, సౌకర్యాలు అనుభవిస్తారు.

ఇక ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలు తలా ఒక నినాదం ఎత్తుకున్నారు. సీమాంధ్ర ఎంపీలు సమైక్యరాష్ట్రం, తెలంగాణ ఎంపీలు ప్రత్యేక రాష్ట్రం అంటున్నారు. సంవత్సరం క్రితం రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళానికి తెర తీసిన కాంగ్రెస్‌ పార్టీగా నోరు మెదపదు. ప్రతిపక్షాలపై నేరం మోపుతుంది. ప్రతిపక్షాలు ఏ నినాదం ఎత్తుకుంటే అంతకంటే హైపిచ్‌లో ఆ నినాదాన్ని ఆలాపించడం ద్వారా రాజకీయంగా తాము ఆ విషయంలో వెనుకబడలేదన్న సంకేతాలు ఇవ్వడానికి కాంగ్రెస్‌ తొక్కని అడ్డదారి లేదు. అధికారపార్టీయే అవకాశవాదంతో ఉంటే ప్రధాన ప్రతిపక్షం ఊరుకుంటుందా? అదీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రతిపాదించి అమలు చేస్తోంది. వీళ్లని చూసి టిఆర్‌ఎస్‌ తదితర పార్టీలు తమ అజెండాను మరింత ముందుకు తెస్తున్నాయి. అత్యధిక పార్టీలు కలిసి ప్రజలెదుర్కొంటున్న వాస్తవ సమస్యలను పట్టించుకోకుండా విన్యాసాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. వారిని 'మత్తు'లో పడేస్తున్నాయి. ప్రజలు 'మత్తు'లో ఉండటమే ప్రభుత్వాలకు కావాలి. సమస్యలపై నిలదీయకుంటే ఎం చక్కా తన 'పని' తాను చేసుకుపోవడానికి సర్కార్‌కు అవకాశం చిక్కుతుంది.

No comments:

Post a Comment