Wednesday, March 9, 2011

కాంగ్రెస్‌ అవకాశవాదం.. రాష్ట్రంలో అనిశ్చితికి కారణం

తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్‌ హైకమాండ్‌, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? ఏ పరిష్కారాన్ని కనుగొంటుంది? నిన్నగాక మొన్న ఎఐసిసి ప్రతినిధి ఒకరు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉంది, అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గరకొచ్చేసరికి ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుంది అని డబుల్‌ మీనింగ్‌ డైలాగులు చెప్పారు. అంటే కాంగ్రెస్‌ విధానం ఒకటి, కాంగ్రెస్‌ సారధ్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం వేరొకటి అయినట్లు చెప్పుకొచ్చారు. అంటే యుపిఎ భాగస్వామ్య పక్షాలను దోషులుగా చూపి తాను తప్పించుకొనే యత్నానికి కాంగ్రెస్‌ ఒడిగట్టింది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి సైతం తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్‌, కేంద్ర ప్రభుత్వ విధానం వేర్వేరుగా ఉన్నాయని పేర్కొన్నారు.

కేంద్ర హౌం మంత్రి చిదంబరం ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలంగాణ రాష్ట్రంపై నిర్ణయం రాత్రి రాత్రి తీసుకునేది కాదని, విస్తృత స్థాయిలో చర్చలు, ఏకాభిప్రాయం కావాలన్నారు. అంతకుముందు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంపై నిర్ణయం ఏకాభిప్రాయం, పరస్పర సంప్రదింపులతోనే సాధ్యమవుతుందని సెలవిచ్చారు. పార్లమెంట్‌లో మంగళవారం హౌంశాఖ సహాయ మంత్రి గురుదాస్‌ కామత్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై గడువు చెప్పలేమన్నారు. ఏకాభిప్రాయం సాధించాలన్నారు. 'శ్రీకృష్ణ కమిటీ'కి ఖర్చు రూ.20 కోట్లు అయిందన్నారు.

ప్రధాని, కేంద్ర హౌం మంత్రి, సహాయ మంత్రి, ముఖ్యమంత్రి వీరందరూ ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరు తెలంగాణ రాష్ట్రంపై గడువు చెప్పలేమని, సంప్రదింపులని, ఏకాభిప్రాయమని, విస్తృత చర్చలని అంటూ ఉండగా... కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ నేతలు తామేదో ఢిల్లీలో సాధిస్తామంటూ ఫోజు పెట్టడం దేనికి? పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకూ అసెంబ్లీ సమావేశాలను టి-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బహిష్కరించడం ఎందుకు? ప్రణబ్‌, ఆంటోని, అహ్మద్‌పటేల్‌, గులాంనబి ఆజాద్‌, వీరప్ప మొయిలీ, చిందంబరం వంటి కాంగ్రెస్‌ సీయర్‌ నేతలతో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఢిల్లీలో వేస్తున్న భేటీలో టి-కాంగ్రెస్‌ ప్రజాప్రతనిధులు ఏం చేస్తున్నారు? మరోపక్క సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు సైతం తాము కాంగ్రెస్‌ పార్టీ అనే విషయాన్ని మర్చిపోయి సమైక్య రాష్ట్రం అంటూ ఎందుకు పార్లమెంట్‌లో పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు? రాష్ట్ర అసెంబ్లీలో ఎందుకు సమైక్యరాష్ట్రం అంటూ నినాదాలు చేస్తున్నారు?

ఒకే పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ప్రాంతాలవారీగా విడిపోయి గొడవ పడుతుంటే కాంగ్రెస్‌ హైకమాండ్‌, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయమూ స్పష్టం చేయలేని పరిస్థితిలో ఎందుకుంది? అవకాశవాదం, రాజకీయ లబ్ధి, ఓట్లు, సీట్లు ఇదీ కాంగ్రెస్‌ ఎజెండా. తనకు లాభం చేకూరుతుందనుకుంటే రాష్ట్రాన్ని విడగొడుతుంది లేకపోతే కలిపి ఉంచుతుంది. రెండు ప్రాంతాల్లోనూ తానే ఆందోళనలు చేస్తుంది. అనిశ్చితికి తెర తీస్తుంది. ఇదీ కాంగ్రెస్‌ దుర్నీతి. దీన్ని అన్ని ప్రాంతాల్లోని ప్రజలూ అర్థం చేసుకోవాలి.

No comments:

Post a Comment