Tuesday, March 15, 2011

ఆ బుద్ధి ముందే ఉండాలి

అధికారపక్ష సభ్యులై ఉండి ప్రతిపక్షం వారి వలే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం మంచి పద్ధతి కాదని ఇక నుండి సమావేశాలకు హాజరు కావాలని తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఇన్నాళ్లకు తెలిసొచ్చింది. ఈ బుద్ధి బహిష్కరించక ముందు ఏమైంది? తాము అధికారపక్షమో ప్రతిపక్షమో తెలీని స్థితిలో ఎమ్మెల్యేలున్నారా? ట్యాంక్‌ బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీలు కేకే, మధుయాష్కీకి జరిగిన ఘోర పరాభవం తర్వాత టి-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు బుద్ధి వచ్చిందనుకోవాలా? పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర బిల్లు, రాష్ట్ర శాసనసభలో తీర్మానం పెట్టేంత వరకూ అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు టి-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గత నెల 25న ప్రకటించారు. అధికారపక్షమే సమావేశాలను బహిష్కరిస్తుంటే మనమెందుకు సభకెళ్లాని టిఆర్‌ఎస్‌ కూడా అసెంబ్లీని బహిష్కరించింది. ఆ రెండు పార్టీలూ బహిష్కరిస్తే నేను తక్కువ తిన్నానా అని తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు సైతం బహిష్కరించారు.

టి-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లొచ్చారు. మంత్రులకు సోనియా అప్పాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ హైకమాండ్‌ చెప్పిందంటున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వ బిల్లుల సమయంలో అధికారపక్ష ఎమ్మెల్యేలు ఉండాలన్న ఉద్దేశంతో పిసిసి అధ్యక్షుడు డిఎస్‌, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నచ్చజెప్పి టి-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను మళ్లీ అసెంబ్లీలో హాజరయ్యేటట్లు చేసినట్లు బయటికి కలర్‌ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికల వల్ల కూడా టి-కాంగ్రెస్‌ తన బహిష్కరణను విరమించుకుంది.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోతున్నారు కనుక రేపోమాపో టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు పార్టీలదీ ఎత్తులు పైఎత్తులే తప్ప అసెంబ్లీ బహిష్కరణపై స్పష్టత లేదు. ఇదో డ్రామా.. అంతే. అన్ని పార్టీలూ అసెంబ్లీకి వెళుతున్నాయి కనుక తానూ అసెంబ్లీకి వెళతానని టిఆర్‌ఎస్‌ సైతం రాజకీయ ఎత్తుతో గతంలో తీసుకున్న బహిష్కరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నా ఆశ్చర్యం లేదు. అందరూ రాజకీయ డ్రామాలకు అలవాటు పడ్డవారే కదా?

ఇంతకీ టి-కాంగ్రెస్‌కు కేంద్రం నుండి ఏం హామీ వచ్చింది? ఎందుకు బహిష్కరణను విరమించుకొని ఎమ్మెల్యేలు బుద్ధిగా అసెంబ్లీలో కూర్చుంటున్నారు? స్పష్టమైన హామీ లేకుండా అసెంబ్లీకొచ్చేటట్లయితే ఆ బుద్ధి ముందే ఉంటే బాగుండేది కదా? ఎందుకీ డ్రామాలతో ప్రజలను వంచించి రాజకీయ పబ్బం గడుపుకుంటారు? ప్రజల్లో భావోద్వేగాలు, హింస, అశాంతిని సృష్టించడం ఎందుకు?

No comments:

Post a Comment