Friday, March 11, 2011

అయ్యో మహాత్ములారా?!

ఈ ఘోరం గురించి ఏం రాస్తాం. ఏం మాట్లాడతాం. 'మహాత్ములారా క్షమించండి' అని పశ్చాతాప పడి నివాళులర్పించడం తప్ప... గురువారం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై జరిగిన విధ్వంస చర్యలు అత్యంత బాధాకరం. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు యావత్‌ తెలుగు జాతి తలదించుకునే కిరాతక, ఆటవిక చర్యలకు తెలుగువాళ్లే పాల్పడటం విచారకరం. విశ్వ శాంతిని మానవాళికి ప్రబోధించిన తథాగతుని సాక్షిగా పైశాచిక హింస చోటు చేసుకోవడం దారుణం. తెలుగు వైతాళికుల విగ్రహాలు నేల కూల్చడమంటే అదేదో ప్రాణం లేని విగ్రహాలను పడగొట్టడంగా జమ కట్టడం అనాగరికం. చరిత్రను ధ్వంసం చేయబూనుకోవడం, ఆనవాళ్లను శిథిలం చేయడం, వారసత్వ సంపదను విచ్ఛిన్నం చేయడం ఘోరాతి ఘోరం. తెలుగుజాతికి 2011 ఫిబ్రవరి 10 దుర్దినం, బ్లాక్‌డే. అన్నింటికీ మించి సిగ్గుపడాల్సిన రోజు. తలదించుకోవాల్సిన రోజు.

ఈ సాంస్కృతిక విషాదానికి తిలా పాపం తలా పిడికెడన్నట్లు రాష్ట్రంలోని అత్యధిక రాజకీయపార్టీలకు బాధ్యత ఉంది. ముఖ్యంగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ ఎక్యూజ్డ్‌ నెంబర్‌ వన్‌. ఈ దారుణానికి ఒడిగట్టిన సంఘ విద్రోహశక్తులను, వారిని రెచ్చగొట్టిన వారిని, ధ్వంస రచనకు కుట్ర చేసిన రాక్షస మూకను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. తెలుగు వెలుగులపై దాడికి ఏ ఉద్యమకారుడూ, ఏ తెలంగాణ వాది ప్రోత్సహించడు. దుండగులు, అనాగరికులే ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడతారు. మహనీయుల విగ్రహాల ధ్వంసం, మీడియా, ప్రజా ప్రతినిధులపై దాడులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుజాతి మొత్తం ముక్తకంఠంతో ఖండించాలి.

ప్రజాస్వామిక వాదులు, చరిత్రకారులు, రాజకీయ పార్టీలు, ప్రతి ఒక్కరూ నిరసించాలి. ఇప్పటికైనా శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఇటువంటి భావోద్వేగ, హింసాత్మక చర్యలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

No comments:

Post a Comment