దేశ ప్రధాని బాధ్యతల్లో ఉన్న వ్యక్తికి ప్రజలంటే ఇంత ఎకసెక్కెమేల? అసలు తాను ప్రధాన మంత్రినన్న విషయం గుర్తుందా? తాను పార్లమెంట్‌లో మాట్లాడుతున్నాన్న స్పృహ ఆయనకుందా? బుధవారం రాజ్యసభలో సెంట్రల్ విజిలెన్స్ చీఫ్ కమిషనర్ (సివిసి)గా థామస్ నియామకంపై ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పందించిన తీరు ప్రజలను, ప్రతిపక్షాలను అవహేళన చేసేవిధంగా ఉంది. చెవిలో పువ్వు పెట్టినట్లు అనుకోవాల్సి ఉంటుంది. సివిసిగా థామస్ నియామకంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం, ప్రభుత్వ నిర్వాకంపై ప్రతిపక్షాల నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో ఇప్పుడు తప్పును మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రధాని. రాజ్యసభలో ప్రధాని సమాధానమిస్తూ సివిసి నియామకంలో తన తప్పు ఉందని ఒప్పుకున్నారు. అంత వరకూ బాగానే ఉంది. అంతలోనే సివిసిపై గతంలో కేసు ఉన్న విషయం తనకు తెలీదని తప్పించుకొనే ప్రయత్నం చేశారు.
దేశంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా ప్రధానికి ప్రభుత్వ నిఘా వర్గాలు సమాచారం చేరవేస్తాయి. రాజకీయ నేతలపైనేతే నిఘా చెప్పనే అక్కర్లేదు. ఇటీవలికాలంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయన్న అపవాదు సైతం మన్మోహన్ సర్కార్ మూటగట్టుకుంది. ఉగ్రవాదులు, తీవ్రవాదుల కదలికలు, సీమాంతరంలో, అంతర్గతంగా భద్రత తదితర అంశాలూ ప్రధాని దృష్టికి వస్తాయి. అలాంటిది రాజ్యాంగబద్ధ అత్యున్నతస్థాయి నియామకాల సమయంలో ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉండాలి?
చిన్న ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటేనే అనేక రకాలుగా సమాచారం తెప్పించుకుంటుంది ప్రభుత్వం. ఐపిఎస్, ఐఎఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల నియామకం సమయంలో వారి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, క్రిమినల్ రికార్డ్‌ను నిఘా వర్గాలు సేకరిస్తాయి. సామాన్యులకు పాస్‌పోర్టు, వీసా కావాలంటేనే సవాలక్ష ఎంక్వరీలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. కాని సివిసిగా థామస్‌ను నియమించే ముందు ప్రభుత్వం కనీస సమాచారం కూడా తీసుకోలేదంటే ఎవరు నమ్ముతారు? గతంలో ఆయనపై కేసు ఉందో లేదో తమకు తెలీదని ప్రధాని అంతటి వ్యక్తి పార్లమెంట్ వేదికపై చెప్పడం క్షమించరాని నేరం. ఇటువంటి విన్యాసాల ద్వారా తప్పును కప్పిపుచ్చువాలనుకుంటే ప్రజలు అంత వెర్రి వెంగళప్పలు కాదని 'పెద్దలు' తెలుసుకుంటే మంచిది.
Well said. He is not only inefficient but irresponsible in giving such lame duck statements.
ReplyDeleteHe has done enough, now it is high time to serve country by taking retirement.