ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? ఎన్నో ఏళ్లుగా రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నా, పడకేసినా, అటకెక్కినా ఎందుకు నోరు మెదపట్లేదు? గొంతు పెగలట్లేదా లేక మనకెందుకులే ఆ గొడవంతా అనుకొని, దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలని తమ 'పని' తాము చేసుకుపోతున్నారా? ప్రతి ఏడాదీ రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ప్రజలు ఆశించడం, షరా మామూలే అన్నట్లు వారికి ఆశాభంగం ఎదురు కావడం ఆనవాయితీగా మారింది. బడ్జెట్‌లో కనిపిస్తున్న రైల్వే లైన్ల పేర్లు ఇరవై ముప్పై ఏళ్లగా వింటున్నవే. ఎప్పటికప్పుడు కొత్తగా చెబుతున్నారు తప్ప పూర్తి చేయడం లేదు. పూర్తి చేయించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు, రాష్ట్రం నుండి కేంద్రంలో మంత్రులుగా ఉన్న పెద్ద మనుషులు గాలికొదిలేశారు.
Saturday, February 26, 2011
Friday, February 25, 2011
జగన్ స్వరం మారుతూ..వుంది
వైఎస్ జగన్ స్వరం మారుతోంది. కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిన కొన్ని రోజులకే అంటే గత ఏడాది నవంబర్ 25న కిరణ్ ప్రమాణస్వీకారం చేయగా 29న జగన్ పార్టీ నుండి బయటికొచ్చారు. ఆ తర్వాత ప్రతి మీటింగ్‌లోనూ తన తండ్రి కష్టపడి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టబోనని, 2014 ఎన్నికలు తన టార్గెట్ అని చెబుతూ వచ్చారు. అంతలోనే లక్ష్యదీక్ష, జలదీక్ష, ఫీజు పోరు, మధ్యలో జరిగిన ఓదార్పు యాత్రల్లో స్వరం మారుస్తూ వస్తున్నారు. ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని తొలుత విమర్శించారు. పేదలను, ప్రజలను, వైఎస్ పథకాలను అమలు చేయని ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. ఫీజుపోరు దీక్ష ప్రారంభించిన తొలి రోజు జగన్ ప్రసంగిస్తూ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపితే అపచారం చేసినట్లవుతుంది, గంగా, కృష్ణా, గోదావరి లాంటి పుణ్యనదులు బంగాళాఖాతంలో కలుస్తున్నాయని, ప్రభుత్వాన్ని కలిపితే నదులు అపవిత్రం అవుతాయని 'దాడి'ని తీవ్రతరం చేశారు. అదే సభలో కొంచెం ముందుకెళ్లి ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం తమకు లేదన్నారు.
Wednesday, February 23, 2011
వినీల్‌కృష్ణ విడుదల
మల్కనగిరి జిల్లా కలెక్టర్ వినీల్‌కృష్ణను మంగళవారం రాత్రి మావోయిస్టులు విడుదల చేశారు. ఆయన్ని గత మంగళవారం మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. వినీల్‌కృష్ణను విడుదల చేయాలంటే తమ డిమాండ్లను నెరవేర్చాలని మావోయిస్టులు కోరారు. అందుకు ఒడిశా ప్రభుత్వం అంగీకరించింది. మధ్యవర్తుల చర్చలు ఫలించాయి. ఎట్టకేలకు మావోయిస్టులు వినీల్‌ను విడుదల చేశారు. ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినీల్ విడుదలతో ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజుల సస్పెన్స్‌కు తెర పడింది. వినీల్‌ను విడిపించడానికి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు బాగానే స్పందించాయి. అవసరమైన చర్యలు చేపట్టాయి. అలాగే ఇచ్చిన మాట ప్రకారం మావోయిస్టులు వినీల్‌ను, మరో అధికారిని విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, మావోయిస్టులకు, వినీల్ కిడ్నాపైన దగ్గర నుండి ఆందోళనలు, సంఘీబావ ర్యాలీలు నిర్వహిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు.
సర్కార్‌కు మేలు..ప్రజలకు కీడు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరపకుండా తీర్మానం సభ ఆమోదం పొందడం ఇదే తొలిసారి. టిఆర్‌ఎస్, టిడిపి తెలంగాణ ఫోరం ఎమ్మెల్యేలు సభలో గొడవ చేస్తూనే ఉన్నారు. ఈ నెల 18న గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, దానికి టిడిపి, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఐదుగురు వారం రోజుల పాటు సస్పెన్షన్ కావడం జరిగిపోయాయి. శని, ఆదివారాలు అసెంబ్లీకి శెలవు. శుక్ర, సోమ, మంగళవారాల్లో సభ సమావేశమైనా టిఆర్‌ఎస్. టిడిపి సభ్యుల లొల్లితో ఎటువంటి చర్చా లేకుండానే వాయిదా పడింది. నిబంధనల ప్రకారం గవర్నర్ ప్రసంగానికి అసెంబ్లీ ధన్యవాదాలు తెపాలి. ప్రసంగంలోని అంశాలపై అన్ని పార్టీలూ చర్చించాలి.
Monday, February 21, 2011
జగన్ 'ఫీజు పోరు'కు జనం పలచన
వైఎస్ జగన్ హైదరాబాద్‌లో చేపట్టిన 'ఫీజు పోరు' దీక్షకు జనం పలచబడ్డారు. గతంతో పోల్చితే ఎమ్మెల్యేల సంఖ్య కూడా తగ్గింది. ఫీజురీయింబర్స్‌మెంట్‌కు నిధులు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఈ నెల 18 నుండి వారం రోజులపాటు ఇందిరాపార్క్‌లో జగన్ దీక్ష చేపట్టారు. హైదరాబాద్ శివార్లలో వరలక్ష్మి అనే ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో చేపట్టిన దీక్ష కావడంతో వేదికకు 'వరలక్ష్మి ప్రాంగణం' అని పేరుపెట్టారు. వరలక్ష్మి మరణించిన తొలి రెండు మూడు రోజుల్లోనే దీక్ష చేపట్టినట్లయితే ఊపు వచ్చేది. కాని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాక ఒక రోజు దీక్ష చేయాలనుకున్నారు జగన్. ఆయన ఎత్తుగడ తీవ్రంగానే ఉంది. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు దీక్ష చేస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చనుకున్నారు. 17 నుండి సమావేశాలు జరుగుతున్నాయని, 23న బడ్జెట్ పెడతారని వార్తలొచ్చాక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు 18 నుండి వారంపాటు దీక్ష చేస్తానన్నారు. అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు వరకూ జగన్ దీక్ష కొనసాగుతుందన్నమాట.
Sunday, February 20, 2011
వినిల్‌కృష్ణను విడుదల చేయాలి
ఒడిషా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ వినిల్‌కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేయడం బాధాకరం. విజయవాడకు చెందిన వినిల్ ఐఎఎస్ ఒడిషా కేడర్‌లో పోస్టింగ్ రావడంతో ఆయన అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. యువ ఐఎఎస్ ఆఫీసర్ అయిన వినిల్‌ను మావోయిస్టులు విడుదల చేయాలి. ఆయనకు ఎటువంటి హాని తలపెట్టొద్దు. వినిల్‌తో పాటు కిడ్నాపైన మరో అధికారిని కూడా విడుదల చేయాలి. మావోయిస్టులు పెట్టిన డిమాండ్లలో కొన్ని కేవలం ఒడిషాకే పరిమితమై లేవు. గ్రీన్‌హంట్ నిలిపివేత అనేది కేంద్రం పరిధిలో ఉంది.
Saturday, February 19, 2011
బొత్సపై క్రిమినల్ కేసు పెట్టాలి
ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌కు కావల్సినన్ని నిధులు ఇవ్వాల్సింది పోయి హైదరాబాద్ శివార్లలో ఆత్మహత్య చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థిని వరలక్ష్మి మరణాన్ని రాజకీయం చేయడం దుర్మార్గం. వరలక్ష్మి చదువుతున్న విజ్ఞాన్ కాలేజీ యాజమాన్యం పెట్టిన వత్తిళ్ల వల్లనే ఎస్సీ అయిన వరలక్ష్మి వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రస్తుతం రవాణాశాఖ బాధ్యతలు చూస్తున్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీలో రవాణ శాఖ మంత్రిని ఎందుకు నియమించారో తెలీదు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రో, ఉన్నత విద్యశాఖ మంత్రో, ఆర్థిక మంత్రో, ముఖ్యమంత్రో వరలక్ష్మి హత్యపై స్పందిస్తే ఏదోలే అనుకోవచ్చు. పిలవని పేరంటానికి వచ్చినట్లు రవాణ శాఖ మంత్రి బొత్స వరలక్ష్మిది ఆత్మహత్యకాదు, గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంలో చనిపోయిందని అవాకులు చవాకులు పేలారు.
Friday, February 18, 2011
అసెంబ్లీలో ముష్టిఘాతాలు.. ప్రజాస్వామ్యానికి బ్లాక్‌డే
అసెంబ్లీలో గురువారం నాటి పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని మరోసారి పరిహాసం ఆడాయి. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇదో దుర్దినం. బ్లాక్ డే. చీకటి రోజు. ఎవరి నిర్ణయాలపైనైనా సమీక్షించి తమ అభిప్రాయం చెప్పే భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రతి పౌరుడికీ రాజ్యాంగం ఇచ్చింది. చట్ట సభల్లోనూ ప్రతి సభ్యునికీ తన అభిప్రాయం చెప్పే హక్కు ఉంది. ఏదేని నిర్ణయాలకు, విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి అనేక పద్ధతులున్నాయి. అందుకు భిన్నంగా వీధి రౌడీలు, అనాగరికుల మాదిరిగా వ్యవహరించారు కొంత మంది శాసనసభ్యులు. దాదాపు రెండు లక్షల మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు తమ బాధ్యతలు నిర్వహించకుండా పశువుల్లా చట్టసభల్లో ప్రవర్తించడం ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, విలువలకు అవమానం, గొడ్డలిపెట్టు.
Thursday, February 17, 2011
ప్రధాని చెప్పినా టి-కాంగ్రెస్‌కు అర్థం కాలేదా?
పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణ బిల్లుపై కేంద్రం, పార్టీ అధిష్టానంతో అమీ తుమీ తేల్చుకునేందుకు ఢిల్లీలో మకాం చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇంకా అక్కడ ఎందుకు ఉన్నట్లు?... పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని ప్రధాని మన్మోహన్‌సింగ్ బుధవారం ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం విషయంపై అడిగిన ప్రశ్నకు ప్రధాని జవాబు చెబుతూ చర్చలు, ఏకాభిప్రాయంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కుండబద్దలు కొట్టారు. కేంద్ర నిర్ణయంపై అడిగిన మరో ప్రశ్నకు ఏకాభిప్రాయం సాధిస్తే బ్రిడ్జిని ఎలా దాటాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందని తాపీగా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనపై ఊహాజనీత ప్రశ్నలు వేయొద్దన్నారు. ప్రధాని ఈ విషయాలు చెప్పినాగాని ఇంకా టి-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఇంకా ఢిల్లీని వదలకుండా కాలం గడుపుతూ డ్రామా చేస్తున్నారు.
Wednesday, February 16, 2011
కృష్ణా ట్రిబ్యునల్ తీర్పునకు వైఎస్సే బాధ్యుడా?
కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం ఏర్పాటు చేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసే విధంగా ఉందనే విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండనక్కర్లేదు. ట్రిబ్యునల్ తీర్పు ఇలా రావడానికి వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం ఉందనే విషయాన్ని కూడా కాదనలేం. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తమ వైఫల్యాన్ని అంగీకరించింది. మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సిఎం ప్రభుత్వ చేతగాని తనాన్ని ఒప్పుకున్నారు. ఇక్కడే తిరకాసుంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ట్రిబ్యునల్ ముందు ప్రభుత్వ వాదనలు దాదాపు ముగిశాయని, అందువల్ల వైఫల్యం ఆయన సర్కార్‌దేననే అర్థం వచ్చేటట్లు మాట్లాడుతున్నారు సిఎం.
Tuesday, February 15, 2011
వాలైంటైన్స్ డే ఫిలాసఫీ
అదేదో సినిమాలో ఎల్‌బి శ్రీరాం 'ఎయిడ్స్ డే, వాలైంటైన్స్ డే, మదర్స్‌డే..' వంటి 'డే'లపై తనదైన శైలిలో ఉతికి పారేశాడు. ఈ దిక్కుమాలిన 'డే'ల వల్ల ఏ 'డే' ఖాళీ లేదంటాడు ఆ కమెడియన్. తన బర్త్‌డే రోజున ఎయిడ్స్‌డే వచ్చిందని, అందుకే బర్త్‌డే చేసుకోనంటూ నిరసన తెలుపుతాడు. ఎల్‌బి శ్రీరాం అన్నట్లుగా ఈ 'డే'ల సంస్కృతి విసృంఖలత్వాన్ని సంతరించుకుంది. మహాకవి శ్రీశ్రీ 'కాదేదీ కవితకు అనర్హం' అన్నారు. ఇప్పుడు రోజులు మారాయి. గ్లోబలీకరణ ఊపందుకున్నాక మహాకవి కవితకు అర్థం మార్చేశారు. ఇప్పుడు 'కాదేదీ వ్యాపారానికి అనర్హం' అంటున్నారు. వాలైంటెన్స్ చనిపోయిన రోజు ఫిబ్రవరి 14. ఆ ప్రేమికుని డెత్‌డేని ఎంతో ఆర్భాటంగా ప్రేమికుల రోజు పేర జరుపుకుంటోంది యావత్ ప్రపంచం. అదేదో సంస్థ జరిపిన సర్వేలో దేశంలో వాలైంటైన్స్ డే వ్యాపారం అక్షరాల పన్నెండు వేల కోట్ల రూపాయల పైమాటేనని తేలింది.
Monday, February 14, 2011
సూరి హత్య..జగన్‌కు లింక్ పెట్టేందుకు శోధన?
మద్దెలచెర్వు సూరి హత్య జరిగి నలభై రోజులైంది. సూరి అంటే సాదా సీదా వ్యక్తి కాడు. పెద్ద ఫ్యాక్షనిస్టు. జూబ్లీహిల్స్ కారు బాంబు కేసులో 34 మంది అమాయకుల మరణానికి కారణమై శిక్ష అనుభవించిన వ్యక్తి. టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు. అనంతపురం, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో అనధికారిక సెటిల్‌మెంట్లు జరిపిన మాఫీయా కం ఫ్యాక్షన్ లీడర్. ఇంత నేర చరిత్ర ఉన్న సూరిని ఆయన అనుచరుడు భానుయే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డులో అదీ పట్టపగలు హత్య చేసి పారిపోతే ఇంకా పోలీసులు భానును అరెస్టు చేయలేకపోతే ఏమనుకోవాలి? ఇందులో పోలీసుల వైఫల్యం ఉందా? లేక మరేదైనా కారణం ఉందా? ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విదేశీ ఉగ్రవాదులను సైతం పట్టుకున్న పోలీసులు సూరిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ప్రత్యేక బృందాలని, దర్యాప్తని ఎందుకు సా..గదీస్తున్నారు?
Sunday, February 13, 2011
పేరుకే టాలీవుడ్..అదొక నేర సామ్రాజ్యం
గతంలో టాలీవుడ్ అంటే 'రాముడు మంచి బాలుడు' అన్న పేరుండేది. రాను రాను టాలీవుడ్ సైతం బాలీవుడ్ సరసన చేరిపోతోంది. సమీప భవిష్యత్తులో బాలీవుడ్‌ను మించిపోయే ప్రమాదం ఉంది. టాలీవుడ్ నేరస్తులకు అడ్డాగా మార్పు చెందుతోంది. భూకబ్జాల దగ్గర నుండి వ్యభిచారం, డ్రగ్స్ వరకూ అన్ని రకాల క్రైమ్‌లకూ ఆలవాలమైంది. పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెలచెర్వు సూరి ఇటీవల హైదరాబాద్‌లో హత్యకు గురయ్యాడు. సూరి హత్య కేసును తొవ్వినకొద్దీ తెలుగు సినిమా పరిశ్రమ నుండి నేరస్తులు ఒక్కొక్కరు బయటికొస్తున్నారు. సూరిని హత్య చేసిన భాను టాలీవుడ్ కేంద్రంగా సాగించిన దాందాలకు అడ్డూ అదుపు లేదు. భానుకు పలువురు సినిమా ప్రముఖులు వెన్నంటి ఉన్నారు.
Saturday, February 12, 2011
కెసిఆర్ 'అవిశ్వాసం'... ఇదో డ్రామానా?
మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో అవిశ్వాస తీర్మానం అంశం తెరమీదికొచ్చింది. జగన్ వెంట కొంత మంది ఎమ్మెల్యేలు నడుస్తుండటంతో కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 'అవిశ్వాస' భయం వెంటాడుతోంది. అందుకే కాంగ్రెస్ నేతలు ఎంఐఎం, పిఆర్‌పితో అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. పిఆర్‌పినైతే విలీనం చేసుకున్నారు. ఇప్పుడు టిఆర్‌ఎస్ కూడా కాంగ్రెస్‌లో కలుస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను టిడిపి నేతలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ భవన్, గాంధీ భవన్‌కు బ్రాంచి కార్యాలయంగా మారిందని దేవేందర్‌గౌడ్ వంటి సీనియర్ నేతలు దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తామంటూ కేకే నివాసంలో ఇటీవల కెసిఆర్ చేసిన ప్రకటనను సాక్ష్యంగా చూపిస్తున్నారు.
Friday, February 11, 2011
విలీనం..జగన్ నెత్తిన పాలు
తమను గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలని పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను కోరారు మెగాస్టార్ చిరంజీవి. 'ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం' అన్నట్లు ఇంకా విలీనం కాకముందే తమ తమ ఎమ్మెల్యేలను అధికారపార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రాధేయపడ్డారు చిరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారో, అధికారుల నుండి వారికి ఎటువంటి 'ట్రీట్‌మెంట్' ఉంటుందో దాన్ని తమకూ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అధికారికంగా విలీనం కావడానికి ఇంకా నెల రోజులు పడుతుందని చెబుతున్న చిరునే అప్పుడే తమకు అధికారపార్టీ హౌదా కావాలని, జిల్లా అధికారులకు ఆ విధంగా ఆదేశాలివ్వాలని సిఎంను అడుగారు.
Thursday, February 10, 2011
'సూక్ష్మ' నిత్యావసరాల దందా!
- అప్పుపై సరుకులు డోర్ డెలివరీ
- వడ్డీ 396%
- పేద మహిళల అవసరాలపై వ్యాపారం
- నిలువు దోపిడీ
- మైక్రో చట్టం ఉల్లంఘన
- వడ్డీ 396%
- పేద మహిళల అవసరాలపై వ్యాపారం
- నిలువు దోపిడీ
- మైక్రో చట్టం ఉల్లంఘన
సూక్ష్మ రుణ సంస్థలు నగదు రూపంలో అప్పులిచ్చే దశ నుండి నిత్యావసర సరుకుల వ్యాపారంలోకి అడుగు పెట్టాయి. నగదు రూపంలో తీసుకున్న అప్పులపై 60 శాతం వరకూ వడ్డీని వసూలు చేసిన సంస్థలు నిత్యావసర వస్తువులను సరఫరా చేసి అత్యధికంగా 396 శాతం వడ్డీని పేద మహిళల నుండి గుంజుతున్నాయి. నూటికి మూడు రూపాయల వడ్డీ అంటేనే వామ్మో అనుకుంటాం. ఇప్పుడు మైక్రో సంస్థలు ఏకంగా నూటికి 33 రూపాయల వడ్డీని మహిళల నుండి ముక్కు పండి మరీ వసూలు చేస్తున్నాయి. నగదు రూపంలో తీసుకున్న రుణాలను తిరిగి వసూలు చెల్లించడానికి ఏడాది, రెండేళ్ల గడువిస్తున్న మైక్రోలు నిత్యావసర వస్తువుల విషయానికొచ్చే సరికి నిబంధనలను సమూలంగా మార్చాయి. తాము సరఫరా చేసే వస్తువుల విలువలో సగాన్ని అడ్వాన్స్‌గా తీసుకుంటున్నాయి. నెల రోజుల్లో మిగిలిన మొత్తాన్నీ చెల్లించాలంటున్నాయి. రోజుకో తీరుగా ధరలు పెరుగుతున్న తరుణంలో నిత్యావసర సరుకులు కొనలేక పేదలు అవస్థలు పడుతున్నారు. ఇదే అదనుగా మహిళల తక్షణావసరాలపై దృష్టి సారించాయి 'సూక్ష్మ' సంస్థలు.
అసెంబ్లీలో చిరంజీవి సీటెక్కడా ?
మెగాస్టార్ చిరంజీవికి పెద్ద చిక్కొచ్చి పడింది. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనమైతే ఇప్పుడున్న పిఆర్‌పి ఫ్లోర్ లీడర్ పదవి కంటే ఎక్కువ గౌరవం కలిగిన పెద్ద పదవొస్తుందని ఆశించారు చిరు. భవిష్యత్తులో కేంద్రంలోనో రాష్ట్రంలోనో ఆయన మంత్రి కావొచ్చు. పార్లమెంట్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలున్నందున ఆయనకు పదవి రావడానికి కనీసం రెండు నెలలన్నా పడుతుంది. అప్పటి వరకూ చిరంజీవి హౌదా ఏమిటి అన్న సందేహం సహజంగా తలెత్తుతుంది. ఒక పార్టీలో మరో పార్టీ విలీనం కావాలంటే కొన్ని న్యాయ పరమైన, రాజ్యాంగ పరమైన చర్యలు చేపట్టాలి. పార్టీ మొత్తం మరో పార్టీలో విలీనం అవుతోంది కనుక ఆ పార్టీ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేయాలి. ఎమ్మెల్యేలందరూ అదే విధంగా తీర్మానం చేయాలి. పిఆర్‌పికి చిరంజీవితో సహా 18 మంది ఎమ్మెల్యేలుండగా 16 మంది కాంగ్రెస్‌లో విలీనం కావాలని తీర్మానం చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ సమావేశానికి హాజరు కాలేదు.
Wednesday, February 9, 2011
ఇదేంటి చిరంజీవా?
ఐపిఎల్, ఆదర్శ్, కామన్వెల్త్, 2జి స్ప్రెక్ట్రం, తాజాగా ఎస్- బ్యాండ్ వరుస కుంభకోణాలతో కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటోంది కాంగ్రెస్. వాటి నుండి ఎలా బయట పడాలా అని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మదన పడుతుంన్నారు. ఈ సమయంలో సోనియా నాయకత్వంలో అవినీతిపై పోరాడతామంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. అదేంటంటే... సోనియా అవినీతిని ప్రక్షాళన చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆదర్శ్ కుంభకోణం వెలుగు చూడగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చేశారని, మరికొన్ని స్కాంలపై సిబిఐ విచారణ జరిపిస్తున్నారని పేర్కొన్నారు. 2జి స్ప్రెక్ట్రం, ఎస్-బ్యాండ్ సంగతేమిటి అనడిగితే, జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఏర్పాటునకు సుముఖంగా ఉన్నారని, అందుకే ప్రతిపక్ష నేతలతో చర్చలు జరుపుతున్నారని సమర్ధించుకున్నారు. జెపిసికి ఇన్నాళ్లెందుకు పట్టిందని అంటే జవాబు దాటేశారు.
Tuesday, February 8, 2011
జగన్‌కు మంత్రి డిఎల్ క్విజ్...గెలిస్తే సిఎం పీఠం!
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు సాధనకు సోమవారం నుండి హరిత యాత్ర ప్రారంభించారు. సహజంగా పోలవరం అనగానే గుర్తుచ్చేది వైఎస్సార్ పేరు. ఎందుకంటే అప్పట్లో పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రచ్చ అయింది. ఇప్పటికీ ఆ వివాదం కొనసాగుతోంది. పోలవరాన్ని ప్రతిపాదిత ఎత్తులో నిర్మిస్తే గిరిజన గ్రామాలు ముంపునకు గురవుతాయి. అది వేరే సంగతి. ఇప్పటి విషయానికొద్దాం. జగన్ ఏ యాత్ర ప్రారంభించినా కాంగ్రెస్‌లో తొలుత స్పందించేది కడప జిల్లాకు చెందిన మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి. జగన్, ఆయన మద్దతుదార్లపై నిప్పులు చెరగడానికి, కౌంటర్లు ఇవ్వడానికే ఆయన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారనిపిస్తుంటుంది. హరిత యాత్ర ప్రారంభమైన రోజున ప్రభుత్వం తరఫున డిఎల్ రవీంద్రారెడ్డి విచిత్రంగా స్పందించారు. జగన్‌కు క్విజ్ పోటీ పెట్టారు. తన ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చేస్తామని సవాల్ కూడా చేశారు.
Monday, February 7, 2011
'చేతి'లో 'సూర్యుడు'..జెండా పీకిన చిరు
'చేతి'లో 'సూర్యుడు'.. హస్తమించిన సూర్యుడు.. పట్టాలపై రైలొచ్చింది... 18 బోగీలతో కదిలింది..ఆ పట్టాలపై ఆ రూపంలో మళ్లీ కనబడదు... 'మార్పు' కోసం ఆ రైలు మరో రైలుకు తోకగా 'మార్పు' చెందింది.
- 2008 ఆగస్టు 17 ఆదివారం మధ్యాహ్నం. సమయం రెండున్నర. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం.46లోని తన కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారి రాజకీయ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. త్వరలో పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు బహిరంగంగా వెల్లడించారు.
Sunday, February 6, 2011
పులి నోట్లో తల..బెస్ట్ ఆఫ్ లక్ చిరు
టాలీవుడ్‌లో పాతిక ముప్పై ఏళ్లపాటు ఎదురు లేకుండా మెగాస్టార్‌గా వెలుగొందిన చిరంజీవి రాజకీయాల్లో ఎక్‌స్ట్రా ప్లేయరని పేరు తెచ్చుకున్నారు. సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ, అవినీతిపై పోరాటం... ఇవి చిరంజీవి ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజారాజ్యం నినాదాలు. టిడిపికి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయమని ముందుకొచ్చింది పిఆర్‌పి. కాంగ్రెస్ అవినీతిపై ఎన్నికల ముందు నిప్పులు చెరిగిన చిరు అంతలోనే ఆ పార్టీకి దగ్గర కావడం రాజకీయ వ్యభిచారమే అవుతుందంటున్నారు పలువురు సీనియర్ నేతలు. సామాజిక న్యాయం, అవినీతిపై పోరాటం అని గొంతు చించుకోవడం వల్లనే ఎన్నికల్లో ఆ మాత్రం ఓట్లు, సీట్లు పిఆర్‌పికి వచ్చాయి. ఇప్పుడు ఆ నినాదాలను పక్కనబెట్టి కేవలం పదవుల కోసమే కాంగ్రెస్ పంచన చేరుతున్నారు మెగాస్టార్. ముఖ్యమంత్రి పదవిని ఆశించిన చిరంజీవి స్వయంగా తానే పాలకొల్లులో ఓటమిని చవిచూసి భంగపడ్డారు.
Saturday, February 5, 2011
తెలంగాణాలో మరో కొత్తపార్టీ?
తెలంగాణాలో మరో కొత్త పార్టీ రూపు దిద్దుకోబోతోందా? టిడిపి, కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌లోని అసంతృప్తి నేతలు కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారా?...కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి (కాకా) నేరుగా సోనియాగాంధీపై ఆరోపణలు చేయడం, టిడిపి అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేత నాగం జనార్ధనరెడ్డి ధిక్కారస్వరం వినిపించడం, టిఆర్‌ఎస్‌లో కెసిఆర్ వైఖరి నచ్చని నేతలతో ఆయన మేనల్లుడు హరీష్‌రావు మంతనాలు జరపడం... ఒకటి తర్వాత ఒకటి జరిగిపోయాయి. ఇవన్నీ వేర్వేరుగా ఆయా పార్టీల్లో జరిగిన సంఘటనలైనప్పటికీ వీటికి ఒకే రకమైన పోలిక ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ సంఘటనల నేపథ్యంలో ఆయా పార్టీల అధినేతలు ధిక్కారస్వరం వినిపించిన నేతలతో చర్చలు జరిపి అంతా బాగుందని, మనస్పర్ధలు సద్దుమణిగాయని పైకి కలర్ ఇచ్చారు.
Friday, February 4, 2011
కిరణ్ సర్కార్‌కు జగన్ గుబులు
రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టి పీడిస్తోంది. పైకి జగన్‌కు భయపడేది లేదని, అతనో బచ్చా అని తీసి పారేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎందుకనో ఉలిక్కి పడుతున్నారు. విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ పథకానికి ప్రభుత్వం నిధులివ్వట్లేదని, త్వరలో ఆ సమస్యపై ధర్నా చేస్తానని జగన్ ప్రకటించారు. ఆ వెంటనే ప్రభుత్వంలో, రాజకీయంగా ఒక్కసారిగా కదలికొచ్చింది. కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆ సమస్యపై మేల్కొని ప్రభుత్వానికి డిమాండ్లు చేయనారంభించాయి. అంతలోనే హైదరాబాద్ శివారుల్లో ఒక విద్యార్థిని ఫీజురీయింబర్స్‌మెంట్ అందక, కాలేజీ యాజమాన్యం వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త మీడియాలో వచ్చింది. జగన్‌కు చెందిన పత్రికలో కాస్త ప్రముఖంగా ప్రచురితమైంది. విద్యార్థిని ఆత్మహత్యలపై స్పందించిన జగన్ తాను 18న హైదరాబాద్‌లో ఫీజురీయింబర్స్‌మెంట్‌పై ధర్నా చేస్తానని తేదీ సమయం సైతం ప్రకటించారు. అంతే.. ప్రభుత్వంలో వణుకు మొదలైంది.
Thursday, February 3, 2011
రాజా అరెస్టు సరిపోదు
దాదాపు 1.76 లక్షల కోట్ల రూపాయలకు పైబడిన 2జి స్పెక్ట్రం స్కామ్ నుండి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎలాగొలా గండం గట్టెందుకు పావులు కదుపుతోంది. కుంభకోణం సమయంలో టెలికం మంత్రిగా ఉన్న డిఎంకె నేత ఎ. రాజాను పదవి నుండి తప్పించినా ప్రతిపక్షాలు ఊరుకోలేదు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)ని ఏర్పాటు చేసి సమగ్రంగా విచారించాలని అవి పట్టుబట్టాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జెపిసి ఏర్పాటుకు ప్రభుత్వం నిరాకరించింది. ప్రతిపక్షాలు జెపిసి కోసం పట్టుబట్టడంతో సమావేశాలు జరగలేదు. ఒక సెషన్ మొత్తం ఈ విధంగా అంతరాయాలతో ముగియడం పార్లమెంట్ చరిత్రలో రికార్డు. ఈ నెలలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. జెపిసిపై ప్రతిపక్షాలు మరింతగా పట్టుబట్టడం ఖాయం. ఈ గండం నుండి ప్రభుత్వం గట్టే క్రమంలో మాజీ మంత్రి రాజా అరెస్టు బుధవారం జరిగింది.
కాక(కా).. అంతలోనే కూల్!
కాంగ్రెస్ సీనియర్ నేత జి. వెంకటస్వామి (కాకా) ఎందుకు అంతగా రెచ్చిపోయారు? అంతలోనే ఎందుకు చల్లబడ్డారు?.. వైఎస్‌పై, జగన్‌పై ఒంటికాలిపై లేచే కాకా ప్రతి సమయంలోనూ పార్టీ హైకమాండ్‌కు విధేయుడిగా మెలిగారు. రాష్ట్రపతి పదవిని ఆశించి భంగపడ్డాక కూడా తనకు పదవి రాకపోవడానికి వైఎస్సే కారణమన్నారు తప్ప అధిష్టానంపై ఒక్క మాట మాట్లాడలేదు. బుధవారం కాకా ఏకంగా సోనియాగాంధీపై విమర్శలు సంధించి సంచలనం సృష్టించారు. తక్షణం పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె వల్లనే పార్టీ ప్రతిష్ట దిగజారిపోతోందని నిప్పులు చెరిగారు. అంతేకాదు అవినీతి పెరిగిందన్నారు. కెవిపి ద్వారా వైఎస్ ఎఐసిసి సభ్యులకు డబ్బు సంచులు పంపారని ఆరోపించారు. ఈ విమర్శలు కేవలం చిరంజీవి కాంగ్రెస్‌తో కలవడం ఇష్టలేకనే చేసినవి కావనిపిస్తోంది.
Wednesday, February 2, 2011
కాంగ్రెస్‌లో 'చిరు' తుఫాన్
కాంగ్రెస్ తన తలపై తానే నిప్పులు పోసుకుంటోందా? జగన్‌కు చెక్ పెట్టేందుకు అది చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీతో పొత్తు లేదా విలీనం ఏదైనా సరే ఈ ప్రతిపాదన ముందుకొచ్చిన ప్రతిసారీ కాంగ్రెస్‌లో దుమారం లేస్తూనే ఉంది. తాజాగా సోమవారం చిరంజీవిని కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ కలవడం, సోనియాను కలవాలని ఆహ్వానించడం కాంగ్రెస్‌లో కలకలం సృష్టించింది. చిరంజీవి ప్రస్తావన వచ్చినప్పుడల్లా పార్టీలో సుడులు తిరుగుతూ పెనుతుపాన్ బీభత్సం సృష్టించడం పరిపాటైంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, టిడిపికి తాను ప్రత్యామ్నాయమంటూ ప్రజల ముందుకొచ్చారు మెగాస్టార్. తీరా ఎన్నికల ఫలితాలొచ్చేసరికి చతికిలపడ్డారు. కేవలం 18 ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చిరంజీవి సిఎం అవుతారన్న ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లడంతో పిఆర్‌పిని నడపడం చిరుకు పను సవాలైంది.
Tuesday, February 1, 2011
నమ్మమంటారా సిఎం సారూ...!
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ మధ్య నమ్మలేని నిజాలు మాట్లాడుతున్నారు. వాటిని ఎలా నమ్మాలో మాత్రం చెప్పట్లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డికి మాజీ ప్రధాని పివి నర్సింహారావు నుండి అప్పాయింట్‌మెంట్ తానే ఇప్పించానన్నారు కిరణ్‌కుమార్. అంతేకాదు వైఎస్‌కు పావలావడ్డీ ఐడియా ఇచ్చింది కూడా తానేనని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తామని 1999 ఎన్నికల్లో వైఎస్ హామీ ఇచ్చినా ఓట్లు రాల్లేదని విశ్లేషించారు. వైఎస్ ఒక్కరి వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని, తనలాంటి వారందరూ ఒక్కో ఇటుక పేర్చడం వల్లనే రెండుసార్లూ అధికారం దక్కిందని వెల్లడించారు. జగన్ విషయం అసలు తమకు పెద్ద విషయమే కాదని కొట్టి పారేశారు. జగన్ పక్కన ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా తమ ప్రభుత్వానికి ఢోకా లేదని ఢంకా భజాయిస్తున్నారు. దమ్ముంటే రాజీనామా చేయాలని ఆ ఎమ్మెల్యేలకు సవాల్ కూడా చేశారు. పరిటాల రవి హత్య కేసులో జగన్‌ను రక్షించడానికి తాను అసెంబ్లీలో చర్చలో పాల్గొన్నట్లు చెప్పుకొచ్చారు. ఇన్ని నమ్మలేని నిజాలు చెబుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి తాను జూబ్లీహిల్స్‌లో ఆక్రమంగా ఆక్రమించిన స్థలం గురించి మాత్రం నీళ్లు నములుతున్నారు. సక్రమంగానే భూమిని స్వాధీనం చేసుకున్నానని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున మీడియాతో వాదించారు. ఈ నమ్మలేని నిజాలను ప్రజలు నమ్ముతారంటారా?
Subscribe to:
Posts (Atom)