ఎస్‌హెచ్‌జిలకు వ్యవసాయ భూమిని లీజుకిచ్చే చట్టంపై వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వం ఆలోచించింది. అప్పటి నుండి గ్రామీణాభివృద్ధిశాఖ, సెర్ప్, న్యాయశాఖ అధికారులు బిల్లుపై కుస్తీ పడుతున్నారు. రోశయ్య సిఎం అయ్యాక బిల్లు తయారీ వేగవంతమైంది. ఈ ఏడాది జులైలో జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని సర్కార్ ప్రయత్నించింది. ఎందుకనో కుదరలేదు. అదే నెలలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో 'ఆంధ్రప్రదేశ్ మహిళా స్వయం సహాయక సంఘాలు (వ్యవసాయ భూమి కౌలు) బిల్ 2010' పేర ముసాయిదాను ఆమోదించారు. కేబినెట్ ఆమోదించిన బిల్లును వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టే అవకాశముంది.
అప్పుడు కుదరకపోతే వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనైనా బిల్లు వస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ నెల 15-17 మధ్య ఢిల్లీలో జరిగిన మైక్రో ఫైనాన్స్ ఇండియా శిఖరాగ్ర సదస్సును పరిశీలిస్తే 'తాము కేవలం చిన్న రుణాలకే పరిమితం కాదలుచుకోలేదు. అన్ని రకాల రుణాలూ ఇవ్వడానికి (మల్టిపుల్) క్రెడిట్ బ్యూరోలుగా 2011 ఏప్రిల్‌కల్లా మార్పు చెందుతాం' అని మైక్రోలు పేర్కొన్నాయి. అంటే గృహౌపకరణాలు, పాడి పశువుల కొనుగోలు తదితర చిన్న అవసరాలకు ఇప్పటి వరకూ అప్పులిస్తున్న సూక్ష్మ సంస్థలు ఇక గృహ నిర్మాణాలు, వ్యవసాయం తదితరాలకు పెద్ద మొత్తంలో రుణాలిస్తాయన్నమాట. మైక్రో సదస్సు నిర్వహించిన ఏక్సెస్ డెవలప్‌మెంట్ సర్వీస్ అనే సంస్థ 'అగ్రికల్చర్ బేస్డ్ లైవ్‌లీహుడ్స్ ఇండియా' పేర ఈ నెల 18న కాన్ఫరెన్స్ నిర్వహించింది.
దీనిలో 'మహిళలు- వ్యవసాయం' అన్న అంశంపై విస్తృత చర్చ జరిగింది. మహిళలకు సుస్థిర వ్యవసాయం నేర్పాలని, వారిని నిపుణులైన రైతులుగా తీర్చి దిద్దాలని ఏక్సెస్ సూచించింది. మహిళలను ఆదర్శ రైతులుగా తీర్చిదిద్దుతానంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కాని ఇక్కడే కిటుకుంది. మహిళా రైతులకు మైక్రో సంస్థల రుణాలు అంటగతారు. చట్టాన్ని అడ్డుపెట్టుకొని మహిళా రైతులకు రుణాలిచ్చే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ నుండి మైక్రోలు మొదలు పెడుతున్నాయి.
పురుషులకు రుణాలిస్తే వసూలు కావనే ఉద్దేశంతోనే మహిళలకు, అదీ గ్రూపు బాధ్యతపై మైక్రోలు రుణాలిస్తున్నాయి. ఇక మహిళా రైతులకూ రుణాలిచ్చి తమ వ్యాపారం అభివృద్ధి చేసుకోనున్నాయి. రాష్ట్రం తెస్తున్న 'ఎస్‌హెచ్‌జిలకు వ్యవసాయ భూమి లీజు' చట్టం మైక్రోలకు బాగా పనికొస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్‌హెచ్‌జిలు 9.35 లక్షలు. వాటిలో 120 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. గ్రూపులు ఏర్పడి సంవత్సరాలవుతున్నా బ్యాంకులు 4.3 లక్షల గ్రూపుల్లోని 62 లక్షల మందికి అదీ అరకొరగానే లింకేజి రుణాలిచ్చాయి. దీంతో ఎస్‌హెచ్‌జిలకు మైక్రోలు వలేస్తున్నాయి. అధిక వడ్డీలకు ఒక్కో మహిళకు నాలుగైదు రుణాలిచ్చి అప్పుల ఊబిలోకి దించుతున్నాయి.
మైక్రోలిచ్చే చిన్న చిన్న రుణాలతోనే మహిళలు ఇబ్బందులు పడుతుండగా ప్రభుత్వం తీసుకొచ్చే చట్టం వల్ల అనివార్యంగా మహిళా రైతులు మైక్రోలను ఆశ్రయిస్తారు. ప్రభుత్వ రంగంలోని జాతీయ బ్యాంకులు ఎస్‌హెచ్‌జిలకు సరిగ్గా అప్పులివ్వట్లేదు. కౌలు రైతులు జాయింట్ లయబిలిటీ గ్రూపు (జెఎల్‌జి)లుగా ఏర్పడినా బ్యాంకులు కనికరించట్లేదు. అందుకే ప్రభుత్వం 'మహిళా గ్రూపులకు వ్యవసాయ భూమిని లీజుకిచ్చే చట్టం' తెస్తోంది. ఈ చట్టం అమల్లోకొస్తే కౌలుదార్లకు, భూమి యజమానులకు మధ్య ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఎస్‌హెచ్‌జి, భూయజమాని ఇష్ట ప్రకారం రాత పూర్వక ఒప్పందం జరుగుతుంది. గ్రూపు బాధ్యతపై ఐదేళ్లకు తగ్గకుండా లీజు అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. ఒప్పందం పూర్తయ్యాక యజమాని అధీనంలోకి భూమి వెళుతుంది.
గ్రూపులో భూమి లేని సభ్యులకు ఒక ఎకరాకు లోపు మాత్రమే లీజుకిస్తారు. ఎస్‌హెచ్‌జి, భూయజమాని మధ్య విభేదాలొస్తే రెవెన్యూ కోర్టులు పరిష్కరిస్తాయి. లీజుదారు, భూయజమాని, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలను చట్టంలో పేర్కొన్నారు. చట్టంలో కొన్ని అంశాలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ భూమిని కౌలుకు తీసుకున్న గ్రూపులకు బ్యాంకుల నుండి సంస్థాగత రుణాలు ఇప్పిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వలేదు. అంటే మహిళా రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేటు అప్పులను ఆశ్రయించాలన్నమాట. తాను తీసుకొస్తున్న చట్టం వల్ల ఎస్‌హెచ్‌జిల్లో భూమి లేని 30 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వమే చెబుతోంది. వారికి బ్యాంకులు రుణాలివ్వకుంటే మహిళలు మైక్రోలను ఆశ్రయించటం ఖాయమని అధికారులంటున్నారు.
No comments:
Post a Comment