Monday, November 15, 2010

సంక్షోభంపై 'మైక్రో' గగ్గోలు

- రంగంలోకి విదేశీ మీడియా
-దా'రుణా'లకు మసిపూత
- బ్యాంక్‌ అప్పులకు వల
-15న ఢిల్లీలో సమ్మిట్‌
-ఆర్డినెన్స్‌పై చర్చకు సెర్ప్‌ సిఇఓకు ఆహ్వానం


రాష్ట్ర ప్రభుత్వం కోరల్లేని ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చి సూక్ష్మ రుణ బాధితులను మభ్య పెట్టగా, ఈ ఆర్డినెన్స్‌ వల్లనే బ్రహ్మాండం బద్దలైనట్లు, నష్టాల్లో నిలువునా మునిగినట్లు మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు ఒక పథకం ప్రకారం గగ్గోలు పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఆర్డినెన్స్‌తో దేశం మొత్తమ్మీద మైక్రో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్నట్లు చిత్రించి విపరీతమైన సానుభూతిని పొందడానికి కుట్ర చేస్తున్నాయి. బిబిసి, వాషింగ్టన్‌పోస్ట్‌, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సహా అంతర్జాతీయ, కార్పొరేట్‌ మైక్రోలు మీడియాలో తమకు అపార నష్టం జరిగిందని ప్రచారం చేయిస్తున్నాయి. విదేశీ జర్నలిస్టులను రాష్ట్రంలో దింపి అధ్యయనాలు చేయించి తమకనుకూలంగా కథనాలను వండి వారుస్తున్నాయి. మైక్రో సంస్థల దా'రుణా'లతో ఆత్మహత్యలు చేసుకున్న జిల్లాల్లో విదేశీ మీడియా జర్నలిస్టులు పర్యటిస్తున్నారు. 

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ సంక్షోభం బంగ్లాదేశ్‌పై పడుతోందంటూ దక్షిణాసియా మైక్రో సంస్థల అసోసియేషన్‌ గొంతెత్తింది. బంగ్లాదేశ్‌లో మైక్రోలు 27 శాతానికిపైగా వడ్డీని వసూలు చేసినా అక్కడ లేని ఆత్మహత్యలు ఇక్కడెందుకు జరుగుతున్నాయని కొన్ని కుహనా అధ్యయనాలు విష ప్రచారాన్ని ఎత్తుకున్నాయి. బిగ్‌బుల్‌ ఎస్‌కెఎస్‌ అయితే తన షేర్‌ విలువ పతనమైనట్లు చెప్పుకుంటోంది. ఇదిలావుంటే ఈ నెల 15,16 తేదీల్లో మైక్రో ఫైనాన్స్‌ ఇండియా-2010 సమ్మిట్‌ ఢిల్లీలో జరుగుతోంది. సూక్ష్మ సంస్థల విస్తరణ ఊపందుకున్నాక 2005 నుండి ప్రతి యేటా ఇటువంటి సమ్మిట్‌ నిర్వహిస్తున్నప్పటికీ ఈసారి జరిగే కాన్ఫరెన్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. 

రాష్ట్ర ఆర్డినెన్స్‌ను బూచిగా చూపించి కేంద్రం, రిజర్వ్‌బ్యాంక్‌, సిడ్బీ, బ్యాంకులను ప్రభావితం చేసి పెద్ద ఎత్తున రుణాలు పొందడానికి మైక్రో బిగ్‌బుల్స్‌ ప్రయత్నిస్తున్నాయి. 'రాష్ట్ర సంక్షోభం'పై ప్రత్యేక చర్చ జరుపుతున్నాయి. సుస్థిరత, బాధ్యత, పారదర్శకత, సోషనల్‌ డెవలప్‌మెంట్‌, రుణ గ్రహీతల రక్షణ అని ఎన్నో ముద్దుపేర్లు పెట్టాయి. తమది నష్టం, లాభం లేని వ్యాపారమని చెబుతున్నప్పటికీ పేదల రక్తాన్ని పీల్చి అధిక లాభాలు సాధించమే మైక్రో సమ్మిట్‌-2010 ప్రధాన లక్ష్యంగా కనబడుతోంది. సమ్మిట్‌ను దృష్టిలో పెట్టుకొనే ఎస్‌కెఎస్‌ తన వడ్డీ రేటును 24 శాతానికి రాష్ట్రంలో తగ్గించింది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 

మైక్రో సంస్థల అసోసియేషన్‌గా చెబుతున్న సా-ధన్‌ ఈ నెల 3న హైదరాబాద్‌ నాబార్డు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. నాబార్డు, సిడ్బీ, జాతీయ, ప్రైవేట్‌ బ్యాంకుల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సా-ధన్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆర్డినెన్స్‌కు అనుగుణంగా రాష్ట్రంలో నడుచుకుంటామంటూ సా-ధన్‌ స్వీయ ప్రవర్తనా నియమావళిని ప్రతిపాదించింది. దానికి బ్యాంకులు, ప్రభుత్వం తలూపాయి. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగిందని, త్వరలో జరిగే సమ్మిట్‌లో తమ ఆగడాలకు మసిపూయడానికే సా-ధన్‌ కోడ్‌ను ముందుకు తెచ్చిందని ఆరోపణలొస్తున్నాయి. ఇక మైక్రో ఫైనాన్స్‌ సంస్థల నెట్‌వర్క్‌ (ఎంఎఫ్‌ఐఎన్‌) రాష్ట్ర ఆర్డినెన్స్‌పై హైకోర్టులో సవాల్‌ చేస్తూనే, కోర్టు ఆదేశాల మేరకు నడుకుంటామని సర్కస్‌ ప్రారంభించింది. 

తమ పిటిషన్‌పై కోర్టులో సానుకూల నిర్ణయం రాకపోవడంతో కొన్ని ఎస్‌హెచ్‌జిలను ప్రోత్సహించి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయించినట్లు సమాచారం. ఒక గ్రూపులో ఉన్న సభ్యురాలు మరో గ్రూపులో ఉండకూడదని, రుణం తీసుకోకూడదని ఆర్డినెన్స్‌లో పెట్టిన నిబంధన వల్ల మహిళలకు అప్పులు అందవన్న వాదన తెరమీదికి తెచ్చింది. వేధింపులకు గురి చేసి మరీ బకాయిలు వసూలు చేస్తున్న మైక్రోలకు అకస్మాత్తుగా రుణ గ్రహీతలపై ప్రేమ పుట్టుకొచ్చింది. 'సూక్ష్మ' ఏజెంట్లు రుణ గ్రహీతల ఇళ్లకు వెళ్లొద్దని, నెలకోసారి మాత్రమే గ్రామ పంచాయితీ కార్యాలయం వద్దకు పిలిపించుకొని రుణాలు వసూలు చేసుకోవాలని ఆర్డినెన్స్‌ చెబుతుండగా, మహిళలు పంచాయితీ కార్యాలయానికి ఎలా వస్తారని మైక్రోలు 'ఆందోళన' చెందుతున్నాయి. పంచాయితీ కార్యాలయం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, పనులు మానుకొని, ప్రయాణ ఛార్జీలు పెట్టుకొని రుణాలు చెల్లించాల్సి ఉంటుందని 'బాధ' పడుతున్నాయి. నిబంధన మార్చాలని, నెల కిస్తులకు బదులు పాత పద్ధతిలో వారం కిస్తులకు అనుమతించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

ఈ వంకతో మైక్రోలు ఇప్పటికీ రుణ గ్రహీతల ఇళ్లకెళ్లి తమ ప్రతాపం చూపుతున్నాయి. సా-ధన్‌, ఎంఎఫ్‌ఐఎన్‌ దేనిలోనైనాసరే మైక్రో బిజినెస్‌లో బిగ్‌బుల్స్‌గా ఉన్న ఎస్‌కెఎస్‌, స్పందన, షేర్‌, అస్మిత, బేసిక్స్‌, ట్రిడెంట్‌, బంధన్‌ తదితర సంస్థలే చక్రం తిప్పుతున్నాయి. ఢిల్లీలో జరిగే మైక్రో ఫైనాన్స్‌ ఇండియా సమ్మిట్‌లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్డినెన్స్‌, అనంతర పరిణామాలపై ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. కాన్ఫరెన్స్‌లో ప్రధాని ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ డాక్టర్‌ సి రంగరాజన్‌, ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ, నాబార్డు, సిడ్బీ, జాతీయ, ప్రైవేట్‌ బ్యాంకుల ప్రతినిధులు, ప్రపంచబ్యాంక్‌ అధికారులు, ఫోర్బ్స్‌ ఇండియా ఎడిటర్‌ తదితరులు పాల్గొంటున్నారు. ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్‌ సంక్షోభంపై చర్చించడానికి ప్లీనరీ సెషన్‌ ఏర్పాటు చేశారు. దీనికి సెర్ప్‌ సిఇఒ బి రాజశేఖర్‌ను ఆహ్వానించారు. ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన మార్పులు చేసుకోవడానికి మైక్రోలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తమ దోపిడీకి అడ్డంకులను తొలగించుకోడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై, ఆర్‌బిఐ తదితర ఆర్థిక సంస్థలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. 

తమకు విరివిగా రుణాలిస్తున్న, ఇప్పిస్తున్న నాబార్డు, సిడ్బీ, బ్యాంకులను ప్రసన్నం చేసుకోనున్నాయి. ఆర్డినెన్స్‌ మూలంగా 'మైక్రోహబ్‌' ఆంధ్రప్రదేశ్‌లో రీపేమెంట్స్‌ తగ్గాయని గగ్గోలు పెడుతున్నాయి. తమకు వసూళ్లు లేనందువల్ల తామూ బ్యాంకులకు రీపేమెంట్స్‌ చేయబోమని కొంతకాలం మొరాయించాయి. మాలెగాం ఆధ్వర్యంలో ఆర్‌బిఐ నియమించిన కమిటీ నివేదిక ఇచ్చే వరకూ రుణాలు ఇవ్వబోమని బ్యాంకులూ మెలిక పెట్టాయి. చివరికి మైక్రోల ఒత్తిడికి బ్యాంకులు దిగొచ్చాయి. ఇప్పటికే రూ.27 వేల కోట్లిచ్చిన బ్యాంకులు, రీపేమెంట్స్‌ కోసం తాము గతంలో మంజూరు చేసిన రుణాలు, అలాగే కొత్తగా అప్పులను సైతం మైక్రోలకు ఇస్తామని మాట మార్చాయి. ఢిల్లీలో జరిగే సమ్మిట్‌లో జాతీయ బ్యాంకులను తమ దారికి తెచ్చుకొనేందుకు మైక్రోలు పావులు కదుపుతున్నాయి.

No comments:

Post a Comment