Tuesday, November 16, 2010

'సూక్ష్మ' హామీలు చెల్లని చెక్కులు

  • మైక్రో బకాయిలపై లెక్కల్లేవు
  • రుణాలపై చేతులెత్తేసిన బ్యాంకులు
  • పావలావడ్డీ ప్రకటించని ప్రభుత్వం
మైక్రో ఫైనాన్స్‌ సంస్థల ఆగడాల నుండి ప్రజలను రక్షించడానికి తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌, ఆ సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు చెల్లని చెక్కుల వలే పనికిరాకుండా పోయాయి. రోజుకో విధంగా సమస్యలు ముసురుకుంటున్నాయి. ఆర్డినెన్స్‌ చెల్లదంటూ ఇప్పటికే మైక్రో సంస్థలు హైకోర్టులో సవాల్‌ చేయగా, 'సూక్ష్మ' బకాయిలు తీర్చేందుకు బాధితులకు రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు చేతులెత్తేశాయి. ఉన్న ఫళంగా మూడు నెలల్లో పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడం సాధ్యం కాదంటున్నాయి. మైక్రో బకాయిలు తీర్చడానికి బ్యాంకులిచ్చే రుణాలపై పావలావడ్డీ అమలుకు ప్రభు త్వం ముందుకు రాలేదు. సూక్ష్మ సంస్థలు రాష్ట్రంలో ఎన్ని రుణాలిచ్చాయో వాస్తవ లెక్కలు తేలట్లేదు.
మైక్రో రుణ బాధితులకు బ్యాంకుల నుండి అప్పులిప్పించి రుణ విముక్తులను చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) స్టీరింగ్‌ కమిటీ పలు దఫాలు భేటీ అయింది. రుణాలిచ్చే విషయంలో ఒక నిర్ణయా నికి రాలేకపోయింది. ఇప్పటి వరకూ మైక్రో సంస్థల ఆర్థిక కార్యకలాపాలపై నియంత్రణ లేనందువల్ల రాష్ట్రంలో ఇప్పటికి ఎంత రుణమిచ్చాయో స్పష్టంగా తెలియట్లేదు. ప్రభుత్వం వద్ద సైతం స్పష్టమైన సమాచారం లేదు.
నిఘా వర్గాల అంచనా మేరకు సుమారు కోటి మంది దాదాపు రూ.25 వేల కోట్లు సూక్ష్మ సంస్థలకు బకాయి పడ్డారు. ఎస్‌ఎల్‌బిసి, ఎస్‌ఇఆర్‌పి, ఎంఇపిఎంఎ అంత మొత్తంలో బకాయిలు లేవంటున్నాయి. ఇక మైక్రో సంస్థలైతే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. మైక్రో సంస్థల నెట్‌వర్క్‌ విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలో 60 లక్షల మందికి రుణాలిచ్చినట్లు పేర్కొంది. కోర్టులో వేసిన పిటిషన్‌లో మాత్రం 21 లక్షల మందికి రూ.5,961 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. రుణ గ్రహీతలు 40-60 శాతం వడ్డీ చెల్లిస్తున్నామని వాపోతుండగా మైక్రో నెట్‌వర్క్‌ కోర్టులో వేసిన పిటిషన్‌లో సగటున 26.7 శాతం వడ్డీ వసూలు చేస్తున్నట్లు తెలిపింది. సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపు (ఎస్‌హెచ్‌జి)లకు ప్రభుత్వం అప్పులిప్పించనందువల్లనే సూక్ష్మ సంస్థలు రెచ్చిపోతున్నాయన్న విమర్శలను ఎదుర్కొనేందుకు ఎస్‌ఎల్‌బిసి, ఎస్‌ఇఆర్‌పి, ఎంఇపిఎంఎ మైక్రో బకాయిలను తక్కువ చేసి చూపుతున్నాయి. అధిక వడ్డీరేట్లు, రుణాల పంపిణీ వాస్తవ లెక్కలు బయట పడకుండా మైక్రో సంస్థలు తమ కార్యకలాపాలను తక్కువ చేసి చూపుతున్నాయి.
ఇవీ అడ్డంకులు
ఈ ఏడాది ఎస్‌హెచ్‌జిలకు బ్యాంకులు రూ.11,776 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ 2,500 కోట్లు పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి టార్గెట్‌ చేరడం కష్టంగా కనబడుతోంది. తీసుకున్న టార్గెట్‌ పరిస్థితి ఇలావుంటే అదనంగా మైక్రో బాధితులకు 20 వేల కోట్లు అదీ మూడు నెలల్లో ఎలా ఇవ్వాలని బ్యాంకులు ప్రశ్నిస్తున్నాయి. వార్షిక రుణ ప్రణాళికను మార్పు చేయడానికి ఆర్‌బిఐ నుండి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, అది అంత సులువు కాదని ఎస్‌ఎల్‌బిసి స్టీరింగ్‌ కమిటీలో చర్చకొచ్చినట్లు తెలిసింది. మరికొన్ని సమస్యలనూ బ్యాంకర్లు లేవనెత్తుతున్నారు. ఇప్పటికే బ్యాంకులో రుణం తీసుకున్న ఎస్‌హెచ్‌జిలకు కొత్తగా మరో అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎస్‌హెచ్‌జిల్లోని సభ్యులు వ్యక్తిగతంగా తీసుకున్న సూక్ష్మ రుణాలకు బ్యాంకులు అప్పులివ్వవు. ఎందుకంటే గ్రూపు బాధ్యతపై బ్యాంకులు అప్పులిస్తున్నాయి కనుక వ్యక్తిగత రుణాలు సాధ్యం కాదు.
ప్రభుత్వం వద్ద రిజిస్టర్‌ కాకుండా ప్రైవేట్‌గా మైక్రోలు ఏర్పాటు చేసిన జెఎల్‌జి, ఎస్‌హెచ్‌జిలకు, గ్రూపుల వెలుపలున్న వారు వ్యక్తిగతంగా తీసుకున్న అప్పులకు బ్యాంకులు, ప్రభుత్వం బాధ్యత వహించట్లేదు. ఒక ఎస్‌హెచ్‌జి సభ్యురాలు ఒక గ్రూపులోనే ఉండాలి. ఆర్డినెన్స్‌లో ఈ నిబంధన ఉన్నందువల్ల ప్రభుత్వ సంస్థల వద్ద రిజిస్టరైన గ్రూపులైనా సరే ఒకటికి మించి ఎస్‌హెచ్‌జిలో సభ్యులుగా ఉండి తీసుకున్న సూక్ష్మ రుణాలెన్నో తేల్చడం కష్టమని బ్యాంకులంటున్నాయి. 'అసలు' ఎంతైతే ఉందో అంత మొత్తమే వడ్డీ ఉండాలని, అంతకుమించి వడ్డీ ఉండకూడదని ఆర్డినెన్స్‌ చెబుతోంది. ఉదాహరణకు సూక్ష్మ రుణం ప్రిన్సిపల్‌ అమౌంట్‌ ఐదు వేలుంటే, వడ్డీ ఐదువేలుండాలి. మొత్తం బకాయి పదివేల కంటే ఎక్కువ ఉండకూడదు. మైక్రోలు కోర్టులో ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేసిన నేపథ్యంలో వాస్తవంగా వారు వసూలు చేస్తున్న వడ్డీ రేటు ఎంతుందో స్పష్టంగా తెలియట్లేదు. ప్రభుత్వం ఆదేశించినట్లు సూక్ష్మ సంస్థలు తమ బ్రాంచిల వద్ద వడ్డీ రేట్లు నోటీసుబోర్డులో ప్రకటించినా, ఆ అంకెలకు, గ్రామాల్లో ఏజెంట్లు వసూలు చేస్తున్న వడ్డీకి చాలా తేడా ఉంది.
'పావలా' ఏదీ?
ప్రభుత్వం పావలావడ్డీ అమలు చేయడం వల్లనే ఎస్‌హెచ్‌జి రుణాల రీపేమెంట్‌ మెరుగ్గా ఉంది. అన్ని గ్రూపులకూ ప్రభుత్వం పావలావడ్డీ రీయింబర్స్‌ చేయట్లేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో 200 కోట్లు ప్రతిపాదించింది. సూక్ష్మ సంస్థల బాధితులకు రుణాలివ్వాలని బ్యాంకులను కోరుతున్న ప్రభుత్వం ఆ రుణాలపై తాను పావలావడ్డీ అమలు చేస్తానని హామీ ఇవ్వట్లేదని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. నిధుల కొరత చూపి ప్రతిపాదించిన స్థాయిలో నిధులను రీయింబర్స్‌ చేయలేని స్థితిలో ఉండగా కొత్తగా బ్యాంకులిచ్చే రుణాలకు నిధులెక్కడి నుండి ఇవ్వాలని ఆర్థికశాఖ ప్రశ్నిస్తోంది. సర్కార్‌ పావలావడ్డీ ప్రకటించకపోతే తమకు రీపేమెంట్‌ రాదని, సూక్ష్మ సంస్థల బాధితులకు రుణాలు ఇవ్వలేమని బ్యాంకులంటున్నాయి.

No comments:

Post a Comment