Saturday, November 20, 2010

సిగ్గుచేటు

చాయ్ ..చాయ్ ... నేను బస్టాప్‌లో నించొని ఉండగా చిన్న పిలగాడు చాయ్  అమ్ముతున్నాడు. నా దగ్గరకొచ్చి సార్‌ చాయ్ అన్నాడు. నాకు చాయ్  వద్దుకాని నీకు పట్టుమని పదేళ్లు లేవు చాయ్  అమ్ముతున్నావ్‌, బడికెందుకెళ్లట్లేదు, చదువుకోవా అని నేను ఆ పిల్లాడిని ప్రశ్నించాను. మొన్నీమధ్య మా నాన్న చచ్చిపోయాడు. నేనే సంపాదించాలి, మా అమ్మ పని చేయలేదు అని దీనంగా చెప్పాడు. పేపర్‌ చదువుతున్న నా పక్కాయన ఒక్కసారి పేపరు పక్కకు జరిపి మా మధ్య జోక్యం చేసుకొని 'వీడు అబద్ధం చెబుతున్నాడు. ఇంట్లో చెప్పకుండా సిటీకొచ్చి ఉంటాడు. చేతిలో డబ్బులైపోయేసరికి ఈ వేషం వేశాడు' అని అన్నాడు. ఇదిగో చూశారా పేపర్లో వేశారు.




బాల కార్మికులను గవర్నమెంట్‌ అధికారులు పట్టుకెళ్లి మరీ స్కూళ్లలో చేర్పించారట అని పేపర్లో వచ్చిన వార్త చూపించాడు. కార్ఖానాలు, టీ బంకులపై అధికారులు దాడులు చేసి కొంత మంది పిల్లల్ని స్కూళ్లలో చేర్పించారన్నది పేపర్‌ వార్త. పేపర్‌ చదువుతున్న ఆయనే తన జేబులోని సెల్‌ఫోన్‌ బయటికి తీసి తనకు తెలిసిన అధికారికి ఫోన్‌ చేయబోయాడు. ఇంతలో ఆయన ఎక్కాల్సిన బస్సొచ్చి ఫోన్‌ మాట మర్చిపోయి బస్సెక్కి చక్కా పోయాడు. నేనూ నా బస్సెక్కాను. చారు పిల్లాడు చాయ్ చాయ్  అంటూ కదిలాడు. బస్టాప్‌లో నేను చూసినటువంటి బాలకార్మికులు రాష్ట్రంలో ఇరవై లక్షలకు పైమాటేనని ఎక్కడో చదివినట్లు గుర్తు. దేశంలో బాలకార్మికులు కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందనీ చదివాను. ప్రభుత్వం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టిన చర్యలెక్కడీ ఈ ప్రశ్న వేయడానికి, సర్కార్‌పై విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలు ఎలాగూ ఉన్నాయి? చారు అమ్మే పిలగాడు నాకు చెప్పిన జవాబు తర్వాత కూడా ఆ పిలగాడు స్కూల్‌లో చేరాలా లేక చాయ్  అమ్మాలా? ఇంకా సూటిగా.. పేదరికాన్ని నిర్మూలించకుండా బాల కార్మిక రుగ్మత సమాజం నుండి తుడిచిపెట్టుకు పోతుందా? కోడి ముందా గుడ్డు ముందా అన్న సందేహంపై దశాబ్దాలుగా తలలు బద్దలు కొట్టుకున్న శాస్త్రజ్ఞులు ఈ మధ్యనే గుడ్డు ముందని తేల్చిపారేశారు. పేదరిక నిర్మూలన, బాలకార్మిక వ్యవస్థ రూపుమాపడం ఈ రెంటిలో ఏది ముందు? ఇంతకాలమైనా ఇంకా ఈ ప్రశ్నలు తలెత్తడంపై సిగ్గు పడాల్సింది పేదలా? బాల కార్మికులా? ప్రభుత్వాలా? సమాజమా?

No comments:

Post a Comment