Sunday, November 21, 2010

వెర్రి


 రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ అనగానే ముందు చార్మినార్‌ తర్వాత హుస్సేన్‌సాగర్‌ మదిలో మెదులుతాయి. ట్యాంక్‌బండ్‌ సైతం స్మరణకొచ్చినప్పటికీ ప్రాంతీయ ఆందోళనల పుణ్యమా అని వివాదస్పదమైంది. ఇప్పుడు ట్యాంక్‌బండ్‌ మాటెత్తకపోవడం ఉత్తమం. హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుడు ఇంకా ప్రాంతీయ గొడవల్లోకి రాలేదు కనుక తథాగతుని విగ్రహాన్ని తలుచుకుంటే ఇబ్బందేమీలేదు. శాంతిని బోధిస్తున్న బుద్ధుని సాక్షిగా విధ్వంసాలు, ప్రజా ఉద్యమాలపై పోలీస్‌ లాఠీఛార్జీలు, తూటాల వర్షాలు సరేసరి. వినాయకచవితికి హుస్సేన్‌సాగర్‌కు అవినాబావ సంబంధముందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.




వేలాది గణేశ్‌ విగ్రహాలను సాగర్‌లో ముంచడం ఆనవాయితీ. ఎంతో ఖర్చుపెట్టి తొమ్మిది రోజులు పూజలూ పునస్కారాలతో కొలిచిన గణేశ్‌సార్లను సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రకృతి ప్రేమికులు మొత్తుకుంటున్నా వినేవారేరి. భారీ గణేశ్‌లొద్దని  ప్రమాదకర రంగులు వాడొద్దని ప్రభుత్వం చేసిన హెచ్చరికలు బేఖాతర్‌. సర్కార్‌ సూచనల్లోనూ చిత్తశుద్ధి కరువు. సాగర్‌లో గణేశ్‌లను ముంచడం తమ జన్మహక్కని బిజెపి, సంఘపరివారం చేసే ఆగం అంతా ఇంతా కాదు. మత కత్రువులను తమకనుకూలంగా మార్చుకొనే విషయంలో కాషాయ కూటమికి ఎక్కడలేని అత్యుత్సాహం. అంతేకాదు హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా మార్చమన్నట్లే హుస్సేన్‌సాగర్‌కు 'హిందు' పేరు పెట్టమంటుంది కాషాయ కూటమి. గణేశ్‌లప్పుడే వార్తల్లోకొచ్చే హుస్సేన్‌సాగర్‌ అప్పుడప్పుడు ప్రేమ విఫలమైనవారు, జీవితంపై విరక్తి కలిగిన వారు ఆత్మహత్య చేసుకున్నప్పుడూ చర్చనీయాంశమవుతుంది. రెండు రోజుల నుండి మీడియాలో పతాక శీర్షికకెక్కింది హుస్సేన్‌సాగర్‌.


ఎస్సై రాత పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణాలో ఎగిసిపడిన ఆందోళనల నేపథ్యంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రోశయ్యను ఒక జర్నలిస్టు 'రాత పరీక్షలు వాయిదా వేస్తే నిరుద్యోగుల సంగతేంటి? పరీక్షలు నిర్వహిస్తే 'ఫ్రీజోన్‌'కు నష్టం జరుగుతుంది కదా' అని ప్రశ్నించగా అందరికీ హుస్సేన్‌సాగర్‌ ఉందిగా అని సిఎం అసహనంతో జవాబు చెప్పారు. దీంతో 'హుస్సేన్‌సాగర్‌'పై మీడియాలో ఎడతెరిపి లేకుండా చర్చలు సా..గుతున్నాయి. ఎవరో ఎన్టీఆర్‌ పాతాళభైరవి సినిమా సీన్‌ను గుర్తు చేశారు. సినిమాలో మాయల మరాఠీ ఎస్వీ రంగారావు పాతాళభైరవి విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేయాలని ఎన్టీఆర్‌కు సూచిస్తాడు. సాష్టాంగపడితే ఎన్టీఆర్‌ మెడ ఖండించి దేవి అనుగ్రహం పొందాలన్నది మాంత్రీకుడి కుట్ర. కాని ఎలా నమస్కారం చేయాలో ముందు మీరే చూపెట్టాలని ఎస్వీఆర్‌ను ఎన్టీఆర్‌ అడుగుతాడు. ఎస్వీఆర్‌ సాష్టాంగ నమస్కారం చేయడం, ఆయన తలను ఎన్టీఆర్‌ ఖండిస్తాడు. పాతాళభైరవిలో లాగానే ముందు రోశయ్య, ఆయన సహచర మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు, యావత్‌ ప్రభుత్వం కట్టకట్టుకొని హుస్సేన్‌సాగర్‌లో దూకి ఎస్సై అభ్యర్ధులకు చూపాలట. ప్రాంతీయ విభేదాలను పెంచి పోషిస్తున్న కాంగ్రెస్‌ నేత ఒకరు హుస్సేన్‌సాగర్‌కూ ప్రాంతాన్నీ అంటగట్టారు.


ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలోని జలాశయాల్లోనే దూకాలి వేరే ప్రాంతం వారొచ్చి మా హుస్సేన్‌సాగర్‌లో దూకుతానంటే నేనొప్పుకోనన్నారాయన. ఇందిరాసాగర్‌ (పోలవరం) గొడవలో ఇద్దరు కాంగ్రెస్‌ మేధావులు కావూరి, కేకే మధ్య వాదోపవాదాలు జరిగాయి. వీరి గొడవపై కాంగ్రెస్‌ నేత ఒకరు ఆ మేధావులకు గచ్చకాయంత వెర్రి అని విరుచుకుపడ్డారు. ఒక ప్రాంతంలో వేపకాయంత, మరో ప్రాంతంలో గచ్చకాయంత అంటారని 'వెర్రి'కీ ప్రాంతం అంటగట్టి గచ్చకాయ, వేపకాయ మధ్య పోట్లాట పెట్టారా పెద్ద మనిషి.

No comments:

Post a Comment