Tuesday, November 23, 2010

గొంగట్లో అన్నం తింటూ...?!



మొక్కప్పుడు తుంచేయకపోతే మాను అవుతుందన్న సామెత ఇప్పటి మీడియా పోకడకు సరిగ్గా అతుకుతుంది. మనం చేస్తే ఒప్పు ఇతరులు చేస్తే తప్పు అంటోంది ఇప్పటి మీడియా. మీడియా అంటే కేవలం టీవి చానెల్స్‌ మాత్రమే కాదు. ప్రధాన పత్రికలకూ ఈ విమర్శ వర్తిస్తుంది. పక్కనున్న తమిళనాడులో మీడియా, రాజకీయ పార్టీలకు మధ్య సరళరేఖ చెరిగి పోయిందని అనుకున్నాం. అక్కడ పార్టీలే పత్రికలు, మీడియాను నడుపుతున్నాయని వింత ప్రదర్శించాం. 

ఆ జాఢ్యం రాష్ట్రానికీ తగులుకుంది. అలా అని తాము ఫలాన పార్టీ పక్షమని ప్రకటించకుండానే కొన్నాళ్లపాటు తమ పని తాము చేసుకుపోయింది మీడియా. ఒక పత్రిక లేదా చానెల్‌ ఫలాన పార్టీకి కొమ్ము కాస్తోందని ప్రత్యర్ధి పార్టీ చెప్పే వరకూ గతంలో తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదు. ఏ పత్రిక ఏ పార్టీదో ఏ నేతదో ఇట్టే తెలుస్తోంది. ఇదీ ఒక రకంగా మంచిదే. తానేమిటో తెలియనీయకుండా ముసుగు వేయాల్సిన అవసరం సదరు మీడియాకు తప్పింది. ఇదే సమయంలో ప్రజలకూ ఆ మీడియా ఎవరిదో, దాని ప్రయోజనాలేమిటో బహిర్గతమవుతోంది.

కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోసే మీడియాకు టిడిపి వత్తాసు పలుకుతుంది. టిడిపిపై విరుచుకుపడే మీడియాకు కాంగ్రెస్‌ మద్దతిస్తుంది. కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపులెన్ని ఉన్నాయో ఆ పార్టీకి చెందిన మీడియా సైతం అన్ని గ్రూపులైంది. తనకు లాభం చేకూర్చే ముఠాకు సదరు 'గ్రూప్‌' మీడియా మద్దతిస్తుంది. తనకు లాభం లేని సొంత పార్టీలోని వారిపైనా విమర్శలు సంధిస్తుంది. గతంలో ఒక సెక్షన్‌ మీడియా టిడిపిలోని ఒకరిద్దరు నాయకులు మంచి వారు మిగిలిన వారు అసమర్ధులంటూ చిత్రించేది. ఇప్పుడు అదే మీడియా కొంతకాలం పాటు కాంగ్రెస్‌లోని తనకు వ్యతిరేకమైన వ్యక్తులపై కత్తులు నూరింది. వైఎస్‌ కుమారుడు స్థాపించిన మీడియా టిడిపి, దాన్ని వెనకేసుకొచ్చే మీడియాను తూలనాడుతోంది. ప్రత్యర్థి పార్టీపై నిప్పులు చెరినప్పుడు ఎంజారు చేసిన కాంగ్రెస్‌ శ్రేణులు ఇప్పుడు 'తమ' మీడియా తమ అధినేతను విమర్శించే సరికి అగ్గిమీద గుగ్గిలం అయ్యాయి. ఆ మీడియాపై నానా యాగీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌లో ముఠా సంస్తృతి సాధారణం. అదేంటంటే నూటపాతికేళ్ల పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని నేతలు తప్పించుకుంటారు.

ప్రస్తుత వ్యవస్థలో మీడియా నిష్పక్షపాతంగా ఉంటుందనుకోవడం పొరపాటు. అలా ఎవరైనా అంటే అందులో నిజం లేదు. ఆ మీడియా ఎవరి పక్షం వహిస్తున్నదనేదే ప్రశ్న. మీడియా స్వేచ్ఛ అనేది అది వహించే పక్షానికే చెందుతుంది. క్రోనీ కేపిటలిజం వృద్ధి చెందాక 'రాజకీయాల'తో పాటు మీడియా విలువలు సైతం పతనమయ్యాయి. 2జి స్పెక్ట్రం కుంభకోణంలో నీరా వ్యవహారం మీడియా విలువలను పాతాళానికి చేర్చాయి. ఈ పరిస్థితుల్లో మీడియా పోకడపై బాధ పడితే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలొచ్చాయని బాధ పడినట్లుంటుంది.

No comments:

Post a Comment