Sunday, November 28, 2010

'చిదంబర' రహస్యం!

రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో కిరణ్‌కుమార్‌రెడ్డిని కూర్చోబెట్టడానికి కేంద్ర హౌం మంత్రి చిదంబరం తన వంతు సాయం చేశారా? ఈ ప్రశ్న కాంగ్రెస్‌ వర్గాలను తొలిచేస్తోంది. కిరణ్‌ సిఎం కావడానికి ఏ శక్తులు ఢిల్లీలో పని చేశాయో పరిశోధిస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులకు 'చిదంబర' రహస్యం బయటికొచ్చిందట. కిరణ్‌కుమార్‌ తండ్రి నల్లారి అమరనాథ్‌రెడ్డి, 'తమిళతంబి' మాంచి ఫ్రెండ్స్‌. తమిళనాడుకు అతి సమీపంలో నల్లారి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉంది. అమరనాథ్‌రెడ్డికి చిదంబరానికి దగ్గరి సాన్నిహిత్యం ఉండేదట. చిదంబరం కొన్నాళ్లపాటు కాంగ్రెస్‌ను వీడి మొపనార్‌ కాంగ్రెస్‌లో చేరినప్పటికీ నల్లారి వారి కుటుంబానికి, ఆయనకు సంబంధాలు కొనసాగాయట. కేంద్రంలో కాంగ్రేసేతర ప్రభుత్వంలో పని చేసినప్పుడు కూడా చిదంబరానికీ, నల్లారి ఫ్యామిలీకి సాన్నిహిత్యం కొనసాగిందట.

అమరనాథ్‌రెడ్డి చిత్తూరు జిల్లాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న సమయంలో అప్పట్లో యువకునిగా ఉన్న వైఎస్‌కు, అమర్‌నాథ్‌కు మధ్య వైరం ఉండేదట. అమరనాథ్‌ మరణం తర్వాతనే రాష్ట్ర కాంగ్రెస్‌లో వైఎస్‌ హవా కొనసాగింది. గతంలో అమర్‌నాథ్‌తో ఉన్న విభేదాలను పక్కనపెట్టి కిరణ్‌ను ప్రోత్సహించారు వైఎస్‌. తాను సిఎం అయిన వెంటనే చీఫ్‌విప్‌ పదవి కట్టబెట్టారు. రెండోసారి అధికారంలోకొచ్చాకనే వైఎస్‌తో కిరణ్‌కు స్వల్ప విభేదాలొచ్చాయి. మంత్రి పదవిని ఆశించిన కిరణ్‌కుమార్‌కు వైఎస్‌ స్పీకర్‌ పదవి ఇచ్చారు. స్పీకర్‌ పదవిపై అయిష్టత వ్యక్తం చేసిన కిరణ్‌ చేసేదిలేక ఆ పదవిలో సర్దుకున్నారు.

తనకు మంత్రిపదవి రాకపోవడం కంటే చిత్తూరు జిల్లాలో తన ప్రత్యర్ధి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినిస్టర్‌ కావడాన్ని కిరణ్‌ జీర్ణించుకోలేక పోయారు. రామచంద్రారెడ్డికి వైఎస్‌ జగన్‌ పట్టుపట్టి పదవి ఇప్పించారట. జగన్‌ తనకు పదవి రానీకుండా చేశారన్న అసంతృప్తిని తన సన్నిహితుల వద్ద కిరణ్‌ ప్రస్తావించేవారంటున్నారు చిత్తూరు నేతలు. అప్పట్లో చిదంబరంతో ఉన్న సాన్నిహిత్యంతో మంత్రి పదవి కోసం లాబీయింగ్‌ చేసినా వైఎస్‌ హవా నడుస్తుండటంతో ఆ ప్రయత్నాలు పని చేయలేదట. వైఎస్‌ చనిపోయాక చిదంబరానికి దగ్గరై అధిష్టానాన్ని ప్రభావితం చేసి మార్కులు కొట్టేసి కిరణ్‌కుమార్‌ ముఖ్యమంత్రి అయ్యారట. చిదంబరానికీ నల్లారి ఫ్యామిలీకి దూరపు బంధుత్వం ఉందట. సిఎంగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడు తమిళనాడు పండితులు ముహూర్తం పెట్టారట. తెలుగు పండితులు ఆ ముహూర్తం మంచిది కాదంటున్నారు. ఈ ప్రచారం తమ వ్యతిరేకులు చేసిన కుట్రగా కిరణ్‌ మద్దతుదార్లు అంటున్నారట. ఇదండీ కాంగ్రెస్‌ నేతలు శోధించిన 'చిదంబర' రహస్యం.

No comments:

Post a Comment