ఎస్‌హెచ్‌జిలకు వల
రాష్ట్రంలో మారుమూలకు విస్తరణ
టాప్‌టెన్‌లో ఐదు ఇక్కడే
రైతుపైనా కన్ను
మనీ లెండింగ్ బిల్లులో 'సూక్ష్మ' నియంత్రణకు సర్కార్ నో
ఒత్తిళ్లే కారణం
బ్యాంకర్ల ఫిర్యాదును పట్టించుకోని ఆర్‌బిఐ
రాష్ట్రంలో మారుమూలకు విస్తరణ
టాప్‌టెన్‌లో ఐదు ఇక్కడే
రైతుపైనా కన్ను
మనీ లెండింగ్ బిల్లులో 'సూక్ష్మ' నియంత్రణకు సర్కార్ నో
ఒత్తిళ్లే కారణం
బ్యాంకర్ల ఫిర్యాదును పట్టించుకోని ఆర్‌బిఐ
రాష్ట్రంపై మైక్రో ఫైనాన్స్ మహమ్మారి ఇంతగా కోరలు చాచడానికి ఇక్కడ అత్యధిక సంఖ్యలో స్వయం సహాయ గ్రూపుల (ఎస్‌హెచ్‌జి) ఏర్పాటు ప్రధాన కారణమా?! మైక్రో విష కోరల్లో 40 లక్షల మంది చిక్కుకొని గిలగిల్లాడటానికి వెనుక ప్రభుత్వ వైఫల్యం లేదా? అసలు, అధిక వడ్డీ చెల్లించలేక, మైక్రో వేధింపులకు తాళలేక పలువురు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడంపై సర్కార్ బాధ్యత తీసుకోదా? మైక్రో దా'రుణాలు' ఆందోళన కలిగిస్తున్న తరుణంలో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలకు బ్యాంకు లింకేజి ద్వారా సూక్ష్మ రుణాలిచ్చేందుకు దేశం మొత్తమ్మీద ఏర్పాటైన ఎస్‌హెచ్‌జిల్లో సగానికంటే ఎక్కువ రాష్ట్రంలోనే ఉన్నాయి. వీటిపై మైక్రో ఫైనాన్స్ సంస్థలు కన్నేశాయి. బ్యాంక్ లింకేజి రుణాల కోసం ఎదురు చూస్తున్న మహిళలను మైక్రోలు వలలో వేసుకుంటున్నాయి. ఎస్‌హెచ్‌జిలకు బ్యాంకుల నుండి రుణాలిప్పించలేని ప్రభుత్వ వైఫల్యాన్ని మైక్రోలు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఎస్‌హెచ్‌జిల ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సైతం మైక్రోలు వేసే ఎరలకు ఆశపడి గ్రూపులను అప్పచెపుతున్నారు. వారే ఏజెంట్ల అవతారమెత్తుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూపుల్లో చీలికలు తీసుకొచ్చి మైక్రోలు లాభ పడుతున్నాయి. రాష్ట్రంలో మైక్రో దోపిడీ పెరగడంతో నిఘా వర్గాలు రెండేళ్ల క్రితమే ఈ విషయాలను సర్కార్ దృష్టికి తీసుకొచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ మనీ లెండింగ్ చట్టం ముసాయిదా తయారు చేసే సమయంలో మైక్రో ఆగడాలపైనా అధికారులు దృష్టి సారించారు. ఆ సంస్థల నియంత్రణకు చట్టంలో కొన్ని అంశాలను ప్రతిపాదించారు. వడ్డీ, రుణాల వసూళ్లు తదితర మైక్రో కార్యకలాపాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సెల్ నెలకొల్పాలని సూచించారు. అందుకు ప్రభుత్వం ఒప్పుకోలేదని తెలిసింది. ఇప్పటి వరకూ అసలు మనీ లెండింగ్ బిల్లు అసెంబ్లీ ముందుకు చర్చకు రానేలేదు. ముసాయిదా బిల్లులో మైక్రో నియంత్రణ అంశం లేదని, సంస్థల ఒత్తిళ్లే ఇందుక్కారణమని విమర్శలొస్తున్నాయి. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) సైతం మైక్రోల వ్యవహారంపై పలు సమావేశాల్లో అసంతృప్తి వ్యక్తం చేసింది. మైక్రోల నియంత్రణకు చట్టం చేయాలని పలుమార్లు సూచించినా సర్కార్ పెడచెవిన పెట్టింది. తమ సర్వీస్ ఏరియాలో మైక్రో సంస్థలు కమర్షియల్ బ్రాంచిలు నెలకొల్పి ఎస్‌హెచ్‌జిలకు అప్పులిస్తున్నాయని, అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాయని బ్యాంకులు సర్కార్‌కు, రిజర్వ్‌బ్యాంక్ (ఆర్‌బిఐ)కు మొరపెట్టుకున్నా స్పందించలేదు.
ఎపి టాప్
దేశంలో మూడువేల మైక్రో కంపెనీలు 50 వేల కోట్ల రూపాయల రుణాలిచ్చాయి. బిజినెస్ ఒక మాదిరిగా ఉన్న సంస్థలు 400 కాగా వాటిలో పేరెన్నికగన్నవి 146. మైక్రోల్లో రుణాలు అధికంగా ఇచ్చిన టాప్ 50 సంస్థలకు గత ఏడాది క్రిసిల్ అనే సంస్థ రేటింగ్ ఇచ్చింది. వాటిలో 17 సంస్థల ప్రధాన కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం గమనార్హం. టాప్ టెన్ మైక్రోల్లో ఐదు ఎపి కేంద్రంగా పని చేస్తున్నాయి. టాప్‌టెన్‌లో మొదటి నాలుగు స్థానాలను ఆక్రమించినవి మన రాష్ట్రానికి చెందినవే. దేశంలో మైక్రోలు ఇచ్చిన మొత్తం అప్పులో 50 శాతం ఎపిలో ఇచ్చాయని నిఘా వర్గాలు అంచనా వేశాయి. అంటే దాదాపు రూ.25 వేల కోట్లు ఇక్కడ పంపిణీ చేశాయన్నమాట. మొత్తం మైక్రో రుణాల్లో టాప్‌టెన్ సంస్థల వాటా 74 శాతం. టాప్‌టెన్‌లో మొదటి స్థానంలో ఉన్న ఎస్‌కెఎస్ హెడ్‌క్వార్టర్ సికింద్రాబాద్‌లో ఉంది. 19 రాష్ట్రాల్లో ఈ సంస్థ 14 వేల కోట్లు రుణాలివ్వగా 50 శాతం ఒక్క ఎపిలోనే ఇచ్చినట్లు సమాచారం. రెండో స్థానంలో ఉన్న స్పందన స్ఫూర్తి సంస్థ దేశ వ్యాప్తంగా 13 వేల కోట్లు రుణాలివ్వగా వాటిలో 60-70 శాతం ఎపిలోనే పంపిణీ చేసింది. టాప్‌టెన్‌లో తర్వాతి స్థానాల్లో ఉన్న షేర్, అస్మిత, భారతీయ సమృద్ధి, ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఎల్, ఎస్‌సిసిఐ, సాధన, రాష్ట్రీయ సేవ, అన్నపూర్ణ, పాయకరావుపేట, ఆదర్శ, సిఆర్‌ఇఎస్‌ఎ, ఐఐఎంఎఫ్, ప్రగతి, సేవ తదితర సంస్థలు తమ శక్తి మేరకు రుణాలిచ్చి ప్రజల మూలుగ పీల్చుతున్నాయి. బ్యాంక్ లింకేజి ఎక్కడీ
రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్వంలో 120 లక్షల మంది సభ్యులతో 9.35 లక్షల ఎస్‌హెచ్‌జిలను ఏర్పాటు చేశారు. బ్యాంక్ లింకేజి కింద ఇప్పటి వరకూ కేవలం 4.3 లక్షల గ్రూపుల్లోని 62 లక్షల మంది సభ్యులకు 11,764 కోట్లు ప్రభుత్వం రుణాలిప్పించింది. లక్షల సంఖ్యలో గ్రూపులు, వాటిలోని సభ్యులు రుణాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. గత సంవత్సరం ఎస్‌ఎల్‌బిసి 6,501 కోట్లు గ్రూపులకు ఇవ్వగా ఈ ఏడాది 11,764 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఆగస్టు నాటికి కేవలం 1,890 కోట్లు పంపిణీ చేసింది. ఇటీవల జరిగిన ఎస్‌ఎల్‌బిసి సమావేశంలో దీనిపై ముఖ్యమంత్రి అసంతృప్తి వెలిబుచ్చారు. ప్రమాదకరమైన సంకేతమేంటంటే 62 లక్షల మంది గ్రూపు సభ్యులకు బ్యాంకులిచ్చిన మొత్తం రుణాలు 11,764 కోట్లయితే రాష్ట్రంలో మైక్రో సంస్థలు 40 లక్షల మందికి 25 వేల కోట్ల వరకూ పంపిణీ చేశాయి. ప్రభుత్వం పావలావడ్డీకి రుణాలని చెబుతున్నా ఆ పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల, బ్యాంకుల సహాయ నిరాకరణ వల్ల సూక్ష్మ రుణాల కోసం గ్రామీణ పేద మహిళలు 40 శాతం వడ్డీకి మైక్రోలను ఆశ్రయించాల్సి వస్తోంది. వ్యవసాయంపై కన్ను
చిన్న వ్యాపారాలకు, కుటుంబ అవసరాలకు రుణాలిస్తున్న మైక్రోలు తమ వ్యాపారాన్ని లాభసాటి, అనువైన రంగాలకు విస్తరిస్తున్నాయి. ఎస్‌కెఎస్ సంస్థ ఐదు రాష్ట్రాల్లో 80 బ్రాంచిలతో 15 కోట్ల రుణాలతో వ్యాపారాన్ని ప్రారంభించింది. స్వల్పవ్యవధిలో 19 రాష్ట్రాలు, 2,029 బ్రాంచిలు 14 వేల కోట్ల రుణాలకు విస్తరించింది. స్పందన, షేర్ తదితర సంస్థల విస్తరణ సైతం ఇలాగే ఉంది. స్పందన ఆసియాలో నెంబర్‌వన్ స్థానానికి చేరుకున్నట్లు చెబుతున్నారు. ఎస్‌బిఐ, సిడ్బి వంటి సంస్థలు మైక్రోలకు టర్మ్‌లోన్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. ఈ ఏడాదే షేర్‌కు ఎస్‌బిఐ 200 కోట్లు రుణం ఇచ్చింది. షేర్, ఎస్‌కెఎస్‌కు సిడ్బి వంద కోట్ల చొప్పున అప్పిచ్చింది. ఇప్పుడిప్పుడే మైక్రో గుత్తాధిపత్యం పెరుగుతోంది. షేర్‌లో అస్మిత్ విలీనం కానున్నట్లు వార్తలొస్తున్నాయి. పోటీ పెరిగి కొత్త రంగాలకు మైక్రోలు విస్తరిస్తున్నాయి. సంస్థాగత రుణాలందక ఇబ్బందులు పడుతున్న చిన్న సన్నాకారు రైతులను,కౌలు రైతులతో వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన జాయింట్ లయబిలిటీ గ్రూపులు (జెఎల్‌జి), రైతుమిత్ర, రైతు క్లబ్‌లను మైక్రోలు ఆకర్షిస్తున్నాయి. కొంత మంది అధికారులు, ఆదర్శరైతులు ఏజెంట్ల అవతారమెత్తి రైతులను మైక్రో ఉచ్చులోకి లాగుతున్నారు. స్పందన సంస్థ ఈ ఏడాది చిన్న సన్నకారు రైతులకు 500 కోట్లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. మామూలు రుణాలపై 24 శాతం వడ్డీ వసూలు చేస్తున్నామని, రైతులకు 21 శాతమే ఛార్జి చేస్తామని ఆ సంస్థ ఎమ్‌డి పద్మజారెడ్డి చెబుతున్నారు. ఎస్‌కెఎస్, షేర్ వంటి సంస్థలూ పంట రుణాలపై కేంద్రీకరించాయని తెలుస్తోంది. మైక్రో సంస్థల కబంధ హస్తాల్లో రైతులూ బందీలయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.
No comments:
Post a Comment