Thursday, November 25, 2010

తెర వెనుక కథేంటి?



ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణాలో ఆందోళనలు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎలా సిఎంను చేస్తారన్న వాదనలన్నీ పటాపంచలయ్యాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్టానం సిఎం పదవికి ఎంపిక చేసింది. గురువారం ఆయన రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేస్తారు. కిరణ్‌కుమార్‌ గతంలో వైఎస్‌కు సన్నిహితంగా మెలిగినప్పటికీ, చీఫ్‌విప్‌గా, స్పీకర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించినప్పటికీ వైఎస్‌ చనిపోయాక జగన్‌కు వ్యతిరేకంగా మారినట్లు చెబుతున్నారు. జగన్‌కు చెక్‌ పెట్టడానికి రాయలసీమకు చెందిన కిరణ్‌కుమార్‌ను కాంగ్రెస్‌ రంగంలోకి దించినట్లుంది. 

అంతేకాకుండా రాయలసీమలో పునాది కలిగిన ఒక సామాజిక వర్గానికి సిఎం పదవి ఇచ్చి జగన్‌ పక్కన ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు చేరకుండా పావులు కదిపింది. కిరణ్‌కుమార్‌ హైదరాబాద్‌ నిజాం కాలేజీ విద్యార్థి కావడంవల్ల ఆయన ఎంపికపై తెలంగాణా ప్రాంతానికి చెందిన నేతలకు పెద్దగా అభ్యంతరం చెప్పడానికి వీల్లేకుండా చేసింది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎదుర్కోడానికి కూడా కిరణ్‌ ఉపయోగపడతారని కాంగ్రెస్‌ ఆలోచించినట్లుంది. జగన్‌ 'సాక్షి'లో సోనియాపై ప్రసారమైన కథనాలపై ఆగ్రహం చెంది జగన్‌పై వేటు పడుతుందనుకుంటే ముఖ్యమంత్రినే మార్చింది కాంగ్రెస్‌. దటీజ్‌ 125 సంవత్సరాల కాంగ్రెస్‌. ఈ నిర్ణయం వెనుక ఏ కుతంత్రం, ఎటువంటి రాజకీయలబ్ధి దాగుందో కాలమే చెపుతుంది.

No comments:

Post a Comment