Thursday, November 18, 2010

చీమాయణం

చీమ..
ఆకారంలో చిన్నదని మనకు చులకన. కాని చీమకూ చాంతాడంత చరిత్ర ఉందండోయ్. లాంగ్‌ లాంగ్‌ ఎగో చీమ శంకరుడి కటాక్షం కోసం తపస్సు చేసింది. భక్తా ఏమి నీ కోరిక అని శంకరుడు చీమ ముందు ప్రత్యక్షమయ్యాడు. నేను కుట్టగానే చనిపోవాలని వరం కోరుకుంది చీమ. తథాస్తు అన్నాడు శంకరుడు. ఆ నాటి నుండి చీమ కుట్టడం మనిషి దాన్ని నలిపి చంపడం జరుగుతున్న చరిత్ర. ఇదో పుక్కిటి పురాణం. కాని దీనిలోనూ నీతి ఉంది. తన చేత కుట్టించుకున్నవారెవరైనా చావాలని చీమ వరం కోరుకోవాలనుకుంది. భాష, భావ వ్యక్తీకరణలో పొరపాటు చేసి తన నెత్తిమీదికే తెచ్చుకుంది. ఏదైనా విషయాన్ని ఎదుటివారికి సూటిగా అర్థమయ్యేటట్లు వ్యక్తీకరింకపోతే ఎదురయ్యే అనర్థాలను చీమ 'పురాణం' బోధిస్తోంది.

అంతే కాదండోరు, చిన్న చీమ మనుషులకు బోల్డంత వ్యక్తిత్వవికాసాన్ని బోధిస్తుంది. ఆహార సేకరణకు సాటి చీమలందరినీ పోగేసి సమిష్టితత్వాన్ని లోకానికి అందించింది. 'క్యూ' అని బోర్డు ఉన్నా క్యూ పాటించని మనుషులకు చీమల 'క్యూ'లు 'క్యూ' క్రమశిక్షణ నేర్పుతున్నాయి. ఆర్నెల్లపాటు ఆహారాన్ని దాచుకొని ముందస్తు ప్రణాళికలు అందించాయి. దుబారా ఖర్చులు చేసే వారికి పొదుపు నేర్పుతున్నాయి. శత్రువుకు సైతం హాని చేయని మనస్తత్వం చీమది. తాము పుట్టలుపెట్టి పాములకు ఆశ్రయం ఇస్తున్నాయి. పూర్వ కవులకు కథా వస్తువు చీమ. '

బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదే' అని సుమతి శతకంలో బలవంతుల విర్రవీగుడును ఎండగట్టారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరతాయని పరాన్న జీవులను ఏకేశారు. శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదంటారు ఆధ్యాత్మిక వాదులు. మన బామ్మలు, తాతాయ్యల కథ 'అనగనగా రాజు'లో చీమ నా బంగారు బొక్కలో వేలుపెడితే కుట్టనా?!' అంటూ తనని ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకోనంటుంది చీమ. చీమల్లో కొన్ని వేల రకాలున్నాయట. చీమ భాషపై పరిశోధనలు జరుగుతున్నాయి. చీమకు ఎన్నికాళ్లనే దానిపై మేథావులు ఇప్పటికీ మథనం చేస్తున్నారు. అతితక్కువ వస్తుపరిమాణాన్ని 'చీమతలకాయంత'గా చెపుతారు. 'పాపం చేస్తే చీమై పుడతారంటారు. జర్నలిస్టులు చీమలా వార్తలను పసిగట్టాలంటారు. నిశ్శబ్దం గురించి చెప్పేటప్పుడు 'చీమ చిటుక్కుమనడం' తెలిసిందే. ఏనుగును సైతం చీమ ముప్పుతిప్పలు పెట్టిందట.

చలిచీమలు, చీమలదండు సినిమాలు తెరకెక్కాయి. చలిచీమలు పుస్తకమే వచ్చింది. చలిచీమల పేరుమీద ఒక పత్రిక ప్రత్యేక కాలమ్‌ను నడిపింది. సినిమా పాటల్లో చీమ పాటలెన్నో. 'చీమ కుట్టిందా చిమచిమలాడిందా' అని ఎన్టీఆర్‌ పాడితే 'ఓరి నాయనో చిలిపి చీమ కుట్టిందయ్యో' అని చిరంజీవి స్టెప్పులేశారు. 'చీమ చీమ చిమ చీమా చీమా' అని జూనియర్‌ ఎన్టీఆర్‌ గిలిగింతలు పెట్టారు. సికాకులంలో చీమాలున్నయంట అని వంగపండు శ్రీకాకుళం నక్సల్‌ ఉద్యమానికి ఊతం పలికారు. ఈ మధ్య మధుమేహం వ్యాధికి పేటెంట్‌ తీసుకోకుండానే లోగో అయింది చీమ. చీమలు తింటే కంటికి మంచిదంటుంటారు పూర్వీకులు. అదేదో దేశంలో కేవలం చీమలనే ఆహారంగా తీసుకొని ఒకాయన గిన్నీస్‌ బుక్‌లో ఎక్కారు. పాలకులు ప్రజల సమస్యలను పట్టించుకోనప్పుడు 'చీమ కుట్టినట్టయినా లేద'ంటారు. అధికారంలో ఉన్నవారి చుట్టూ చేరే వారిని 'బెల్లం వద్దకు చీమల'నడం కద్దు. '

చీమ'కుర్తి గెలాక్సీ రాయి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. 'చీమ'కుర్తి గనుల్లో రాజకీయ రాబందుల అక్రమాలపై ఎన్నోసార్లు అసెంబ్లీ స్తంభించింది. 'చీమ'కుర్తి గని ప్రమాదం కార్మికులను పొట్టనపెట్టుకుంది. చురుకుదనానికి చీమ కుట్టుడుతో పోల్చినా చీమ కుడితే కలిగే మంట కుట్టించుకున్న వారికే తెలుస్తుంది. చెవిలో చీమ దూరితే ఆ బాధ వర్ణనాతీతం. మామిడిపండుకూ చీమకు అవినాబావ సంబంధం ఉంది. చీమలను చంపడానికి గమాక్సిన్‌ నుంచి 'లక్ష్మణరేఖ' సహా పలు బ్రాండ్ల చీమలమందులొచ్చి బహుళజాతి కంపెనీలకు సిరులు కురిపిస్తున్నాయి. చీమలమందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న అన్నదాతలు, మైక్రో ఫైనాన్స్‌ బాధితులూ ఉన్నారు. మా మైలవరం దగ్గర చీమలపాడు ఊరుంది. చీమబడిలో బోల్డంత పర్సనాల్టీ డెవలప్‌మెంట్‌. సైకియాట్రిస్టులను సంప్రదించే బదులు 'చీమబడి' లో చేరితే పోలా? చీమా వర్ధిల్లు!

No comments:

Post a Comment